ప్లేటు పట్టుకునే ముందు.. బోర్డు చూడండి బాసూ.. బిర్యానీ కోసం వెళ్తే బేడీలు తప్పవు!!
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేద్రంలో అశోక్ నందన్ గార్డెన్ యాజమాన్యం పెట్టిన ఈ బోర్డు నెట్టింట తెగ ఆకట్టుకుంటోంది.
By: Tupaki Political Desk | 11 March 2026 3:16 PM ISTఈ బోర్డు చూసిన వారు ఎవరైనా.. ఇకపై పిలవని పేరంటానికి వెళ్లాలంటే కాస్త భయపడాలి. ఆకలి తీర్చుకోబోయి.. ఆపదలో పడొద్దంటూ అపరిచిత అతిథులకు సున్నితంగా హెచ్చరించడం నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. ఘుమఘుమలాడే బిర్యానీ, నోరూరించే స్వీట్లు కోసం ఆహ్వానం లేకుండా పెళ్లిళ్లకు వెళ్లారా? ఇక మీ పని అయిపోయినట్లే.. పిలవని పేరంటానికి వచ్చిన అతిథులుగా భావించి పోలీసుస్టేషన్ లో సత్కరిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. ఇటీవల పెరిగిన పోయిన ఆకలి రాజ్యం గాళ్లను కట్టడి చేస్తూ ఒక పెళ్లి మండపం బయట వెలిసిన బోర్డు రెండు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేద్రంలో అశోక్ నందన్ గార్డెన్ యాజమాన్యం పెట్టిన ఈ బోర్డు నెట్టింట తెగ ఆకట్టుకుంటోంది. నిజానికి మన సంస్కృతిలో వివాహ సమయంలో విందు భోజనం పెట్టడం ఒక సంప్రదాయం. తెలిసిన వారు అందరికీ అతిథి మర్యాదలతో నోరూరించే విందు ఏర్పాటు చేయడం అత్యంత సహజం. ఈ సమయంలో ముఖపరిచయస్తులు ఎదురైనా పిలిచి భోజనం పెడతారు. కొన్నిసార్లు తెలిసిన వారిని భోజనాలకు పిలవలేదని అలకపాన్పులు ఎక్కడం కూడా చాలా మందికి అనుభవ పూర్వకంగా తెలిసే ఉంటుంది. కానీ కేసముద్రంలో ఇలా బయట వ్యక్తులు భోజనాలకు రావొద్దంటూ బోర్డు పెట్టడం వింతగా ఉంది. కానీ, ఈ బోర్డు పెట్టడాన్ని ఎవరూ ఆక్షేపించడం లేదు. నిజమే కదా? అంటూ సమర్థిస్తున్నారు.
సహజంగా మన సంప్రదాయంలో పెళ్లి ఒక సంబరం. పెళ్లి వేడుకే కాదు దానికి ముందు వెనుక కూడా చాలా కార్యక్రమాల్లో విందు భోజనాలు పెట్టడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. అంతేకాకుండా కుటుంబంలో జరిగే శుభ, అశుభ కార్యక్రమాలకు కూడా తెలిసిన వారు అందరినీ పిలిచి భోజనాలు పెడుతుంటారు. ఆ సమయంలో తెలియని వారు కనిపించినా వచ్చి భోజనం చేయమని అడుగుతుంటారు. కానీ, ఇప్పుడు ఇలా తెలియని అతిథులు చేస్తున్న దండయాత్ర వల్ల బోర్డు పెట్టి హెచ్చరించే వరకు వచ్చింది పరిస్థితి. ఫంక్షన్ అని తెలిస్తే చాలు చాలా మంది ‘బిర్యాని బ్యాచ్’ వాలిపోతున్నారట. ఒక్కో ఫంక్షన్ కు వంద నుంచి రెండు వందల మంది దాడి చేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి వారివల్ల నిజమైన అతిథులకు గౌరవ మర్యాదలు తగ్గిపోతున్నాయి. కొన్నిసార్లు భోజనం కూడా పెట్టలేకపోతున్నామని ఫంక్షన్ నిర్వాహకులు వాపోతున్నారు.
ఈ పరిస్థితుల్లో కేసముద్రం పట్టణంలోని ఫంక్షన్ హాలు యాజమాన్యం వినూత్నంగా ఆలోచించి ఈ బోర్డు పెట్టడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వెరైటీ కామెంట్లు, మీమ్స్ తో నెట్టింట ఇంట్రెస్టింగ్ డిబేట్ కు ఆ బోర్డు తెరలేపింది. పిలవని పేరంటానికి వచ్చి భోజనం చేస్తూ పట్టుబడితే మూడు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా అంటూ ఆ బోర్డులో హెచ్చరించడం అందరినీ నవ్వు తెప్పిస్తోంది. కొందరైతే బోర్డులో పెట్టిన సెక్షన్ 441 ప్రకారం నిజంగా శిక్షించవచ్చా? అంటూ ఏఐ చాట్ బాట్ ల్లో సెర్చ్ చేస్తున్నారు. మొత్తానికి బిర్యానీ కోసం వెళ్తే బేడీలు పడతాయని హెచ్చరించాలనే ఆలోచన రావడం కూడా గొప్పగానే అభివర్ణిస్తున్నారు.
