జయంతి ముందే ఘోరం.. లండన్ లో మహాత్ముడికి తీవ్ర అవమానం..
మహాత్ముడు కేవలం భారతదేశానికే కాదు.. ప్రపంచానికి సైతం ఆదర్శప్రాయుడు. ఆయన నడిచిన బాట.. ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ అనుసరనీయం.
By: Tupaki Political Desk | 30 Sept 2025 12:17 PM ISTమహాత్ముడు కేవలం భారతదేశానికే కాదు.. ప్రపంచానికి సైతం ఆదర్శప్రాయుడు. ఆయన నడిచిన బాట.. ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ అనుసరనీయం. మహాత్ముడి అహింస ప్రపంచానికి దారి చూపుతుంది. ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలన్న గాంధీ సిద్ధాంతాన్ని ఇప్పటికీ పాటించేవారు లేకపోలేదు. అందుకే అతను మహాత్ముడయ్యాడు. ఆయన జయంతిని ప్రపంచ శాంతి దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. అలాంటి వ్యక్తి విగ్రహానికే అవమానం జరగడం ఆందోళనకు గురి చేస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన..
లండన్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. టావిస్టాక్ స్క్వేర్‌లోని మహాత్మా గాంధీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నల్లరంగు పూసి, విద్వేషపూరిత వ్యాఖ్యలు రాయడం సమస్త ప్రపంచాన్ని బాధించింది. కేవలం ఒక విగ్రహానికి జరిగిన అవమానం మాత్రమే కాదు. ఒక మానవతా విలువపై చేసిన దాడిగా చూడాలని భారత జాతి కోరుతోంది. అంతర్జాతీయ అహింసా దినోత్సవానికి (అక్టోబర్ 2) మూడు రోజుల ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత బాధించే విషయం.
ప్రపంచానికి వెలుగునిచ్చిన మహాత్ముడి ఆలోచనలు..
భారతదేశపు స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించిన గాంధీజీ కేవలం ఒక జాతీయ నాయకుడు మాత్రమే కాదు. ఆయన ఆలోచనలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయి. ‘అహింసా పరమోధర్మః’ అనే సూత్రాన్ని ఆచరణలో పెట్టి, బ్రిటీష్ సామ్రాజ్యాన్ని వణికించిన నేతగా నిలిచారు. ఆయన బోధించిన అహింసా పరమోధర్మహ సిద్ధాంతం మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా వంటి నాయకులకు స్ఫూర్తినిచ్చి ప్రపంచవ్యాప్తంగా అనేక సమాజాల్లో శాంతి ఉద్యమాలకు పునాది వేసింది. అలాంటి వ్యక్తి విగ్రహంపై దాడి జరగడం అంటే శాంతి, సహనం అనే విలువలపై విసిరిన సవాలు అని చెప్పాలి.
విగ్రహాలు భావనకు గుర్తు..
విగ్రహాలు ఒక భావనకు ప్రతీకలు. అవి చరిత్రను గుర్తుచేసే చిహ్నాలు. వాటిని ధ్వంసం చేయడం ద్వారా చరిత్రను చెరిపేయవచ్చని కొందరు భావించడం సరైన చర్య కాదు. ఇలాంటి చర్యలు సమాజంలో ద్వేషాన్ని నింపగలవు. గాంధీజీ విగ్రహాన్ని అవమానించిన వారు ఆయన విలువలను చెరపలేరు. ఆయన బోధనలు నేటికీ అవసరమని. ఎందుకంటే ప్రపంచం నేడు మతవివాదాలు, జాతి విభజనలు, రాజకీయ విద్వేషాలతో మునిగిపోయింది.
విగ్రహానిది గొప్ప చరిత్ర..
లండన్ లోని టావిస్టాక్ స్క్వేర్‌లోని యూనివర్సిటీ కాలేజ్ సమీపంలో 1968లో ఈ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కళాకారిణి ఫ్రెడ్డా బ్రిలియంట్ మహాత్ముడిపై ఉన్న ప్రేమతో ఈ విగ్రహానికి మెరుగులు దిద్దారు. విగ్రహ ధ్వంసంపై స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. విగ్రహాన్ని తిరిగి పునరుద్దరిస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే ఇది సిగ్గుమాలిన చర్య అని భారత రాయభార కార్యాయలం ఖండించింది. ఈ పిచ్చి చర్యలను సిగ్గుమాలినదిగా అభివర్ణించింది. ఇది ముమ్మాటికీ అహింసా వారసత్వంపై జరిగిన దాడేనని నొక్కి చెప్పింది.
