శాంతికి పిత అయిన గాంధీజీకి నోబెల్ బహుమతి ఎందుకు దక్కలేదు?
నోబెల్ శాంతి బహుమతుల చరిత్రలో మహాత్మాగాంధీ పేరు లేకపోవడం ఎల్లప్పుడూ భారతీయులకు ఒక భావోద్వేగపు నిరాశకు గురిచేసే ప్రశ్న.
By: A.N.Kumar | 6 Oct 2025 11:18 PM ISTనోబెల్ శాంతి బహుమతుల చరిత్రలో మహాత్మాగాంధీ పేరు లేకపోవడం ఎల్లప్పుడూ భారతీయులకు ఒక భావోద్వేగపు నిరాశకు గురిచేసే ప్రశ్న. అహింసా మార్గంలో భారత్‌కు స్వాతంత్య్రం సాధించి ప్రపంచానికి శాంతిదూతగా నిలిచిన గాంధీజీకి 5 సార్లు నామినేషన్ వచ్చినా కూడా, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు.మహాత్మా గాంధీని ప్రపంచం అహింసా పూజారుగా, శాంతి ప్రతీకగా ఆరాధిస్తుంది. “సాబర్మతి కే సంత్ తూనే కర్ దియా కమాల్, దే దీ హమే ఆజాదీ బినా ఖడగ్, బినా ఢాల్…” అనే పాటల ద్వారా ఆయన సాధన, గౌరవం ప్రతి ఇంటికి చేరింది. బ్రిటిష్ సామ్రాజ్యంపై గాంధీ చేపట్టిన స్వాతంత్య్ర ఉద్యమం కూడా అహింసా పథంలో జరిగి, వారిని భారత్ నుంచి బయటకు పంపించడంలో విజయవంతమైంది.
గాంధీజీని 1937, 1938, 1939, 1947, 1948లలో మొత్తం ఐదు సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. ప్రతిసారీ ఆయన పేరు తుది జాబితాలో ఉన్నప్పటికీ బహుమతి దక్కకపోవడానికి కమిటీ సభ్యులు లేవనెత్తిన కొన్ని వాదనలు..పరిణామాలు కారణమయ్యాయి:
1948లో మరణం
1948 జనవరి 30న గాంధీజీ హత్యకు గురయ్యారు. ఆ సంవత్సరం నామినేషన్ల గడువు ముగియడానికి కేవలం రెండు రోజుల ముందు (ఫిబ్రవరి 1) ఆయన పేరు పరిశీలనలో ఉంది. నోబెల్ ఫౌండేషన్ నియమాల ప్రకారం, కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తప్ప మరణించిన వ్యక్తులకు బహుమతి ఇవ్వకూడదు. గాంధీజీకి వారసత్వ సంపద లేదు, ఆయన ఒక సంస్థకు ప్రాతినిధ్యం వహించలేదు, మరణ శాసనం కూడా రాయలేదు. కాబట్టి ఒకవేళ బహుమతి ఇచ్చినా, ప్రైజ్ మనీ ఎవరికి అందజేయాలనే విషయంలో కమిటీకి స్పష్టత కరువైంది. ఈ కారణాల వలన 1948లో బహుమతిని ఎవరికీ ఇవ్వకుండా రిజర్వ్ చేయాలని కమిటీ నిర్ణయించింది. కమిటీ ఛైర్మన్ గున్నార్ జాన్ తన డైరీలో "అర్హులైన జీవించి ఉన్న అభ్యర్థి ఎవరూ లేరు" అన్న కారణాన్ని కోట్ చేస్తూ ఆ ఏడాది బహుమతిని నిలిపివేశారు.
అప్పటి కమిటీ సందేహాలు:
గాంధీజీ జీవించి ఉన్న కాలంలో (1937–1947) నామినేట్ అయినప్పుడు, కమిటీ సభ్యులు కొన్ని కీలకమైన సందేహాలను వ్యక్తం చేశారు. కమిటీకి సలహాదారుగా ఉన్న ప్రొఫెసర్ జాకబ్ వార్మ్-ముల్లర్ తన నివేదికలో గాంధీజీ "పూర్తి శాంతివాది" కాదేమోనని సందేహం వ్యక్తం చేశారు. ఆయన ఉద్యమాలు కొన్ని సందర్భాల్లో హింసకు దారితీయడంపై, 1947లో భారత్-పాకిస్తాన్ ఘర్షణ సమయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గాంధీజీ కృషి భారతదేశం విముక్తికి మాత్రమే పరిమితమైందని, ఆయన ఆదర్శాలు అంతర్జాతీయ స్థాయిలో తక్కువ ప్రభావాన్ని చూపాయని కొందరు సభ్యులు భావించారు. ఆ రోజుల్లో నోబెల్ శాంతి బహుమతిని ఎక్కువగా ఐరోపా, అమెరికన్లకు మాత్రమే ఇచ్చేవారు. దక్షిణాఫ్రికాలో ఆయన పోరాటం కేవలం భారతీయుల తరఫున మాత్రమేనని, అక్కడి నల్లజాతీయులందరి తరఫున కాదనే వాదన కూడా అప్పట్లో వినిపించింది. నార్వేలోని నోబెల్ కమిటీ సభ్యులు, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహుమతిని ఇవ్వడానికి వెనుకాడారనే రాజకీయ కోణం కూడా ఉంది.
*నోబెల్ కమిటీ పశ్చాత్తాపం: చరిత్రలో అతిపెద్ద పొరపాటు
గాంధీజీకి నోబెల్ బహుమతి దక్కకపోవడంపై నోబెల్ కమిటీ తరువాతి సభ్యులు తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నోబెల్ ఫౌండేషన్ అధికారిక వెబ్‌సైట్ గాంధీజీని "బహుమతి అందుకోని పురస్కృతుడు"గా అభివర్ణించింది. 1989లో దలైలామాకు నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేసినప్పుడు, కమిటీ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ సెజెర్‌స్టెడ్ , గాంధీజీకి నివాళులర్పిస్తూ ఆయన స్మృతికి దలైలామాకు బహుమతి ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. దీని ద్వారా గాంధీజీకి ఇవ్వలేకపోవడాన్ని "కమిటీ చేసిన అతిపెద్ద పొరపాటు"గా పరోక్షంగా అంగీకరించారు.
గాంధీజీ చేసిన సేవ ప్రపంచవ్యాప్తంగా శాంతి ఉద్యమాలకు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా లాంటివారికి స్ఫూర్తిగా నిలిచింది. ఆయనకు బహుమతి దక్కకపోవడంపై నిరసనగా.. ఆయన సిద్ధాంతాలను గౌరవిస్తూ గాంధీ శాంతి పురస్కారంను భారత ప్రభుత్వం 1995లో ఏర్పాటు చేసింది.
భారత స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గాన్ని అవలంబించి, ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహాత్ముడికి నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడం, ఇప్పటికీ నోబెల్ పురస్కారాల చరిత్రలో తీరని లోటుగా మిగిలిపోయింది.
