తొలి స్వాతంత్ర్య వేడుకలకు గాంధీ దూరం...ఎందువల్ల ?
ఈ దేశానికి స్వాతంత్ర్యం రావాలని మహాత్మా గాంధీ ఎంతో పోరాటం చేశారు. ఆయన ముందు అనేక మంది ఉద్యమించినా గాంధీ అహింసా మార్గం ఎంచుకున్నారు.
By: Satya P | 16 Aug 2025 1:15 AM ISTఈ దేశానికి స్వాతంత్ర్యం రావాలని మహాత్మా గాంధీ ఎంతో పోరాటం చేశారు. ఆయన ముందు అనేక మంది ఉద్యమించినా గాంధీ అహింసా మార్గం ఎంచుకున్నారు. ఆయన దేశ స్వాతంత్ర్య పోరాటంలో 1915లో ప్రవేశించారు. 1947 వరకూ చూసుకుంటే 32 ఏళ్ళ పాటు పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీని ఆయన నడిపిస్తూనే ఇతర ఉద్యమ సంస్థలను కలుపుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ లో అతి వాదులు గాంధీ వైఖరి నచ్చక వేరేగా ఉద్యమించారు. కానీ గాంధీ మాత్రం అహింస తన ఆయుధం అని చెప్పారు. ఆ దిశగానే ఆయన తుది వరకు పోరాడారు.
విజయోత్సవాలలో పాల్గొనకుండా :
ఇక ఈ దేశానికి 1947 ఆగస్ట్ 14 అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది. నాడు పండిట్ నెహ్రూ ఢిల్లీ వేదికగా ఈ కీలక ప్రకటన చేశారు అని చెబుతారు. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అని ప్రకటించే సమయంలో గాంధీ ఢిల్లీలో లేరు. కలకత్తాలో ఉన్నారు. దాంతో ఆయన దూరంగానే ఉండిపోయి దేశ స్వాతంత్ర్యం ఉత్సవాలలో పాలు పంచుకోలేదు. ఆయనకు స్వాతంత్ర్యం వచ్చింది అన్న వార్త కంటే ఒక్కటిగా ఉన్న భారత్ రెండుగా విడిపోయింది అన్న ఆవేదన ఎక్కువ అని చెబుతారు.
అసలైన స్వాతంత్ర్యం కోసం :
హిందూ ముస్లిం భాయీ భాయీ అన్నది గాంధీ అభిమతం. అందరూ కలసి ఉండాలని ఆయన కోరుకున్నారు. అయితే రెండుగా దేశం చీలడంతో ఈ స్వాతంత్ర్యం తనకు ఆనందం ఇవ్వడం లేదు అని ఆయన తనకు కలసి వారికి చెప్పారని అంటారు. గాంధీని కలకత్తాలో ఉన్న గాంధీని కలిసేందుకు వెళ్ళిన సి రాజగోపాలాచారితో గాంధీ ఇదే మాట చెప్పారట.ముఖ్యంగా మత ఘర్షణలు చోటు చేసుకోవడం కూడా ఆయన మనసును కలచివేసింది అని అంటారు.
ఆ ప్రకటన తర్వాత :
మరో వైపు చూస్తే 1940 ప్రాంతంలో గాంధీ దేశ విభజన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు అని చరిత్రలో ఉంది. ఆయన తన దేహం రెండు ముక్కలు చేసిన తరువాతనే దేశాన్ని ముక్కలు చేయమని అన్నట్లుగా చెఉబుతారు. కానీ 1947లో మాత్రం దేశం భారత్ పాకిస్థాన్ గా రెండుగా విడిపోయింది. బహుశా ఇది గాంధీని ఎంతో బాధించి ఉండొచ్చు అని అంటారు. ఇక గాంధీ వరకూ చూస్తే ఆయన పోరాటం చేసింది అంతా ఒకే భారతదేశంలో అనుకుంటే వేరుగా జరిగింది అన్న ఆందోళనతోనే చివరి రోజులు గడిపారు అని అంటారు.
గాంధీ ప్రయత్నంలో ఉండగానే :
ఇక గాంధీ భారత్ నుంచి విడిపోయిన పాకిస్థాన్ లో హిందూ ముస్లిం ల మధ్య శాంతి కోసం కూడా తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే ఆయన ప్రయత్నాలు ఇంకా తొలి దశలో ఉండగానే 1948 జనవరి 30న గాడ్సే చేతిలో గాంధీ హత్య కావించబడ్డారు. మొత్తం మీద చూస్తే దేశానికి స్వాతంత్ర్యం లభించిన అయిదున్నర నెలల పాటు గాంధీ జీవించారు కానీ ఆయన మాత్రం స్వాతంత్ర్యం భారత దేశం విజయానందాన్ని పెద్దగా పంచుకోలేదని అంటారు.
చాలా మంది బాధ :
ఏది ఏమైనా దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ భారతదేశం రెండుగా విడిపోయింది అన్న బాధ నాటి తరానికీ నేటి తరానికీ ఉంది. ఈ విషయంలో సరిగ్గా డీల్ చేయలేకపోయారా అన్నది కూడా ఉంది. భారత్ పాక్ వేరుగా కాకుండా ఒక్కటిగా ఉంటే ఈపాటికి భారత్ సూపర్ పవర్ గా ప్రపంచంలో ఉండేది అన్న చర్చ కూడా ఉంది దాయాది పోరుత్లో రక్షణ రంగానికి పెద్ద ఎత్తున పెట్టిన నిధులతో దేశంలోని పేదరికం కూడా బాగా తగ్గేదని అంటారు. ఇవన్నీ చూసినపుడు స్వాతంత్ర్యం కోసం అంతా పోరాడినా తిరిగి తెచ్చుకునేటపుడు మాత్రం రెండుగా చీలిపోవడంతో ఈ విజయం పూర్తి విజయమా లేక అర్ధ విజయమా అన్నది అయితే ఒక పెద్ద మీమాంస గానే ఎప్పటికీ ఉంటుంది.
