Begin typing your search above and press return to search.

గ్రామ జనాభా 1500, జననాలు 27397.. ఏమిటీ స్కామ్!

ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని కేవలం 1,500 మంది జనాభా ఉన చిన్న గ్రామంలో ఓ భారీ స్కామ్ వెలుగులోకి రావడం షాకింగ్ గా మారింది.

By:  Raja Ch   |   19 Dec 2025 4:00 AM IST
గ్రామ జనాభా 1500, జననాలు 27397.. ఏమిటీ స్కామ్!
X

భారతదేశంలో స్కామ్ లకు ఏమీ కొదవలేదని.. గ్రామస్థాయి నుంచి హస్తిన స్థాయి వరకూ ఎందెందు వెతికిననా అందందూ కలదని అంటుంటారు అనుభవజ్ఞులు! ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని కేవలం 1,500 మంది జనాభా ఉన చిన్న గ్రామంలో ఓ భారీ స్కామ్ వెలుగులోకి రావడం షాకింగ్ గా మారింది. దీంతో సైబర్ క్రైమ్ నుంచి దేశ విద్రోహశక్తులకు సంబంధించిన పలు అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

అవును... ఓ గ్రామ జనాభా మొత్తం కలిపితే 1,500 మాత్రమే అయితే.. ఆ ఊరిలో సుమారు మూడు నెలల్లో ఎన్ని జననాలు నమోదయ్యే అవకాశం ఉంది? సమాధానంపై పాఠకులకు కాస్త అటు ఇటుగా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కానీ.. ఈ చిన్న గ్రామంలో మాత్రం మూడు నెలల్లో నమోదైన జననాలు అక్షరాలా 27,397. ఈ విషయం ఇప్పుడు షాకింగ్ గా మారింది. దీనిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.

వివరాళ్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో గల శేందుర్ సనీ గ్రామ పంచాయతీ పరిధిలో జనన, మరణాల నమోదు ఆలస్యం అవుతున్నట్లు ఆరోపణలు వచ్చాయంట. దీంతో అధికారులు ఓ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సమయంలో రికార్డులు పరిశీలిస్తే ఓ షాకింగ్ విషయం బయటపడింది. అదేమంటే.. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆ గ్రామంలో 27,397 జననాలు నమోదయ్యాయి.

ఇదే సమయంలో ఈ మూడు నెలల వ్యవధిలోనూ ఏడు మరణాలు చోటు చేసుకున్నట్లు సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్)లో నమోదైంది. దీంతో... కేవలం 1500 మంది జనాభా మాత్రమే ఉన్న ఊరిలో ఈ స్థాయిలో జననాలు నమోదవ్వడం ఏమిటని ఆలోచించిన అధికారులు.. మరో ఆలోచన లేకుండా వెంటనే దర్యాప్తు చేపట్టారు. ఈ సీఆర్ఎస్ లాగిన్ ఐడీ ముంబైకి మ్యాప్ అయినట్లు గుర్తించారు.

దీంతో... ఈ స్కామ్ వెనుక ఎవరున్నారు అనే ప్రశ్నలు లేవనెత్తుతున్న సమయంలో.. సైబర్ క్రైమ్ రాకెట్ కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో.. అక్రమ మార్గంలో నకిలీ ధృవపత్రాలు సృష్టించే రాకెట్ దీని వెనుక ఉండి ఉండొచ్చనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ 27,397 మందిలో ఎక్కువ మంది 18 ఏళ్లు పైబడినవారు మహారాష్ట్రకు చెందినవారు కాదని తెలిపారు. ఈ జాబితాలో 99శాతం పేర్లు పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ కు చెందిన వ్యక్తులవేనని.. బంగ్లాదేశ్‌ వలసదారుల పేర్లు కూడా ఉండొచ్చని ఆరోపించారు.