Begin typing your search above and press return to search.

రెస్టారెంట్లలో దోపిడీకి బ్రేక్.. ఫ్రీ వాటర్ రూల్ వైరల్!

మనం ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ‘మినరల్ వాటరా? రెగ్యులర్ వాటరా?’ అంటూ వెయిటర్లు అడగడం, చాలామంది సంకోచించి ఖరీదైన వాటర్ బాటిళ్లు కొని జేబులు ఖాళీ చేసుకోవడం నిత్యం చూస్తూనే ఉంటాం.

By:  Madhu Reddy   |   6 Aug 2026 4:05 PM IST
రెస్టారెంట్లలో దోపిడీకి బ్రేక్.. ఫ్రీ వాటర్ రూల్ వైరల్!
X

మనం ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ‘మినరల్ వాటరా? రెగ్యులర్ వాటరా?’ అంటూ వెయిటర్లు అడగడం, చాలామంది సంకోచించి ఖరీదైన వాటర్ బాటిళ్లు కొని జేబులు ఖాళీ చేసుకోవడం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఈ వ్యాపార ధోరణికి చెక్ పెడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు ఉచితంగా, సురక్షితమైన నీటిని అందించడం వారి ప్రాథమిక హక్కు అని ప్రకటించింది. మన రాష్ట్రాల్లోనూ ఇలాంటి రూల్స్ తక్షణమే అమలు చేయాలంటూ నెటిజన్లు కోరుతున్నారు..

బాటిల్ వాటర్ కొనాలని బలవంతం చేయకూడదు:

ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ప్రకారం ప్రతి హోటల్ మరియు రెస్టారెంట్ కస్టమర్లకు ఉచితంగా శుభ్రమైన తాగునీటిని అందించడం వారి ప్రాథమిక బాధ్యత. ఇక ఏ హోటల్ యాజమాన్యం కూడా కస్టమర్లను ఖరీదైన ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లు కొనమని బలవంతం చేయకూడదని మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రెస్టారెంట్‌కు రాగానే అడగకుండానే ముందుగా ఉచిత తాగునీటిని టేబుల్‌పై ఉంచాలని సూచించారు.

ఫ్రీ వాటర్ బోర్డులు తప్పనిసరి:

వినియోగదారులకు తమ హక్కుల గురించి తెలియజేసేలా "ఉచిత తాగునీరు అందుబాటులో ఉంది" అనే సమాచారాన్ని ప్రతి రెస్టారెంట్ ప్రవేశ ద్వారంలో లేదా అందరికీ కనిపించేలా బోర్డుల రూపంలో ప్రదర్శించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఇక దీనివల్ల కస్టమర్లు సంకోచించకుండా ఉచిత నీటిని అడిగి తీసుకునే అవకాశం ఏర్పడుతుంది.

ఆహార భద్రతపై కఠినమైన నిబంధనలు:

కేవలం తాగునీరే కాకుండా ఇతర ఆహార భద్రతా ప్రమాణాలపై కూడా ఎఫ్‌డీఏ ఉక్కుపాదం మోపింది. నూనె పదార్థాలను వార్తాపత్రికలలో పెట్టి ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధించారు. ఇక ఫుడ్-గ్రేడ్ ప్యాకేజింగ్ మాత్రమే వాడాలని ఆదేశించారు. వంటనూనెలను పదే పదే వాడటంపై ఆంక్షలు విధించడంతో పాటు, హోటల్ సిబ్బందికి వైద్య పరీక్షలు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రత్యేక శిక్షణను తప్పనిసరి చేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు:

ఈ కొత్త నిబంధనలను పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై వినియోగదారుల హక్కుల చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ఆదేశాలను ఉల్లంఘించే సంస్థలకు భారీ జరిమానాలు విధించడంతో పాటు, వారి వ్యాపార లైసెన్సులు కూడా రద్దు చేస్తామని ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది.

మన దగ్గరా అమలు కావాలి:

మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెస్టారెంట్ల దోపిడీకి అడ్డుకట్ట వేసే ఇలాంటి నిబంధనలను మన తెలుగు రాష్ట్రాల్లోనూ సమర్థవంతంగా అమలు చేయాలని, కస్టమర్లు కూడా తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని కోరుతున్నారు