Begin typing your search above and press return to search.

బీజేపీకి మిత్ర సంకటం...మండిపోతున్న షిండే

ఇక ఇటీవల మహారాష్ట్రలోని జరిగిన అయిదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఓటమి పాలు అయింది. దాని వెనక ఏక్ నాథ్ షిండే వర్గం ఉందని బీజేపీ అనుమానిస్తోంది.

By:  Satya P   |   31 Oct 2026 9:29 AM IST
బీజేపీకి మిత్ర సంకటం...మండిపోతున్న షిండే
X

మహారాష్ట్రలో రాజకీయం మారుతోంది. శివసేనను చీల్చి అందులో నుంచి ఏక్ నాథ్ షిండేను తెచ్చి 2022లో ముఖ్యమంత్రిగా చేసిన బీజేపీకి ఇపుడు అదే షిండే నుంచి ఎదురు గాలి వీస్తోంది. ఆయన రెండేళ్ళకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2024 లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన తన వర్గం ద్వారా 50 కి మించి ఎమ్మెల్యేలను గెలిపించుకున్నా ఉప ముఖ్యమంత్రికే పరిమితం అయ్యారు. గతంలో మాదిరిగా తననే సీఎం చేస్తారు అని భావించినా బీజేపీ తన పార్టీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌ని ముఖ్యమంత్రిగా చేసింది. ఆనాటి నుంచి ఈ ఇద్దరికి మధ్య విభేదాలు ఉన్నా ఇపుడు అవి మరింత బాహాటం అవుతున్నాయని అంటున్నారు.

బీజేపీని ఓడించారా :

ఇక ఇటీవల మహారాష్ట్రలోని జరిగిన అయిదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఓటమి పాలు అయింది. దాని వెనక ఏక్ నాథ్ షిండే వర్గం ఉందని బీజేపీ అనుమానిస్తోంది. ఈ అయిదు స్థానాలలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ మూడు స్థానాలను గెలుచుకోగా అధికార మహాయుతి కూటమి కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. దీనిపై బీజేపీ ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేతలు బహిరంగంగానే పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక చూస్తే పూణే, నాగపూర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లో శివసేన తమకు ఆశించిన స్థాయిలో సహకరించలేదని బీజేపీ ప్రధాన ప్రతినిధి నవనాథ్ బాన్ నేరుగానే ఆరోపించారు. పూణే టీచర్స్ నియోజకవర్గంలో చివరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థి సచిన్ సనాప్‌కు శివసేన మద్దతు ఇవ్వడం వల్ల కూటమి ఐక్యత దెబ్బతిందని, ఓట్లు చీలిపోయాయని బీజేపీ పేర్కొంది.

చర్యలు తీసుకోవాలని :

అధికార మహా యుతి కూటమి నిలబెట్టిన అభ్యర్ధులకు వ్యతిరేకంగా షిండే శివసేన నేతలు పనిచేశారు అని బీజేపీ అంటోంది. బీజేపీ అభ్యర్థుల కు వ్యతిరేకంగా పనిచేసిన శివసేన పూణే సిటీ చీఫ్ రవీంద్ర ధాంగేకర్ మీద అలాగే మాజీ మంత్రి అబ్దుల్ సత్తార్‌లపై ఏక్‌నాథ్ షిండే కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. అయితే దానికి షిండే వర్గం నేతలు కూడా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. సరైన అభ్యర్థులను నిలబెట్టకపోవడం బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం వల్లనే బీజేపీ ఓడిందని తిప్పికొడుతున్నారు.

థాక్రేలతో భేటీ :

ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, తాజాగా జరిగిన ఒక పుస్తకావిష్కరణ సభకు వచ్చారు. దాని కంటే ముందు ఆయన శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్‌ రాజ్‌ ఠాక్రేలతో ఏకాంత చర్చలు జరిపారు. దీంతో షిండేతో విభేదాల వేళ బీజేపీ కొత్త సమీకరణలు చేస్తోందా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే శివసేనను చీల్చిన షిండేను ఇంత కాలం తమ వైపు ఉంచుకున్న బీజేపీ ఇపుడు థాక్రేలను దగ్గర తీయడం తో మహా రాజకీయంలో కొత్త మలుపు అంటున్నారు. ఇక ఈ ఏకాంత చర్చల తరువాత 2029 వరకు ఫడ్నవీస్‌ సీఎంగా కొనసాగాలన్న రాజ్‌ థాక్రే వ్యాఖ్యానించడాన్ని కూడా కొత్తగా చూస్తున్నారు.

షిండే ఏం చేస్తారు :

ముఖ్యమంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్న ఏక్ నాథ్ షిండే అయితే రానున్న కాలంలో ఏమి చేస్తారు అన్నది చర్చగా ఉంది. ఆయనకు జనంలో బలం ఉంది. థాక్రేల కంటే కూడా ప్రజాదరణ ఉందని ఆయన పలు ఎన్నికల్లో నిరూపించుకున్నారు. థాక్రేలను బీజేపీ దువ్వితే ఆయన ప్రతిపక్ష శిబిరం వైపు వెళ్తారా అన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మొత్తానికి మహా రాజకీయం అయితే నివురు గప్పిన నిప్పులాగానే ఉంది అని అంటున్నారు. ఇప్పటికి రెండేళ్ళ పాలన మాత్రమే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ పూర్తి చేసుకున్నారు. బీజేపీకి సొంతంగానే బలం ఉంది. కానీ 2029 ఎన్నికల గురించి ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు.