శివసేన (యూబీటీ)లో మళ్లీ చీలిక.. ‘ఆపరేషన్ టైగర్’పై ఫడణవీస్ అధికారిక ప్రకటన
మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)ని లక్ష్యంగా చేసుకుని సాగిన 'ఆపరేషన్ టైగర్' లక్ష్యాన్ని చేరుకుందని సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు.
By: Tupaki Political Desk | 22 Jun 2026 10:34 AM ISTమహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)ని లక్ష్యంగా చేసుకుని సాగిన 'ఆపరేషన్ టైగర్' లక్ష్యాన్ని చేరుకుందని సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. అంతేకాకుండా పార్టీ బాడీ కూడా చాలా హెల్దీగానే ఉంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఆదివారం ఇద్దరు ఎంపీలు ఏక్‌నాథ్ శిండే వర్గం శివసేనలో చేరగా, ఈ రోజు మరో నలుగురు ఎంపీలు కూడా వారి బాటలోనే నడవనున్నారని సీఎం వెల్లడించారు. మొత్తం ఆరుగురు ఎంపీలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ శిండే వర్గంలో అధికారికంగా విలీనం కానున్నారు.
ఈ విలీనం వెనుక ఉన్న అత్యంత కీలకమైన అంశం '2/3 వంతు మెజార్టీ'. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం, ఒక పార్టీకి చెందిన ఎంపీలు మూడింట రెండు వంతుల మెజార్టీతో విడిపోయి మరో పార్టీలో విలీనమైతే, వారిపై అనర్హత వేటు పడే అవకాశం లేదు. ఈ చట్టపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కూటమి నేతలు వ్యూహాత్మకంగా పావులు కదిపారని అంటున్నారు. మహారాష్ట్రలో శివసేన (యూబీటీ)కి 9 మంది ఎంపీలు ఉండగా, అందులో ఆరుగురిని తిరుగుబాటు చేసేలా ఒప్పించి ఫిరాయింపుల చట్టం నుంచి రక్షణ కల్పించారని అంటున్నారు.
లోక్‌సభలో తమ సంఖ్యాబలాన్ని మరింత పటిష్టం చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న కేంద్ర బీజేపీ పెద్దలు, ప్రతిపక్షాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తాజా ఉదంతం వెల్లడించింది. ఇందులో భాగంగా 'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీల్లో అంతర్గత తిరుగుబాట్లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను రెండుగా చీల్చిన తరహాలోనే, ఇప్పుడు తాజాగా ‘ఆపరేషన్ టైగర్’ పేరుతో మరోసారి శివసేన (యూబీటీ)లో చీలికను తీసుకురావడం ద్వారా తన రాజకీయ పట్టును మరింత పెంచుకుందని అంటున్నారు.
ఈ రాజకీయ పరిణామం ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వానికి పెద్ద సవాలుగా మారింది. తన తండ్రి బాలసాహెబ్ ఠాక్రే స్థాపించిన పార్టీని, తన ఆధీనంలో ఉన్న ఎంపీలను కాపాడుకోవడంలో ఆయన ఎదుర్కొంటున్న వైఫల్యాలు ఇప్పుడు ఆ పార్టీ ఉనికిపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నిరంతరం కొనసాగుతున్న ఇటువంటి ఆపరేషన్లతో మహారాష్ట్రలో ప్రతిపక్షాల బలం రోజురోజుకూ క్షీణిస్తోందని అంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ అనుసరిస్తున్న ఈ ఫిరాయింపు వ్యూహాలు రాబోయే ఎన్నికల ఫలితాల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తాయనేది ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రధానాంశంగా మారింది.
