అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రికి క్రీడల శాఖ.. ఇది వేరే లెవెల్ నిర్ణయం!
అవును... అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా సభలో రమ్మీ ఆడారంటూ మహారాష్ట్ర మంత్రి మాణిక్ రావ్ కోకాటేపై సంచలన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
By: Raja Ch | 1 Aug 2025 11:16 AM ISTఇటీవల కాలంలో ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో.. నాయకులు ఫోన్లలో బిజీగా ఉన్న ఘటనలు పలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. అసెంబ్లీలో ఫోన్ చేతపట్టి చూడకూడనివి చూసిన ఘటనలు తెరపైకి వచ్చాయని చెబుతుండగా.. తాజాగా అసెంబ్లీలో ఆన్ లైన్ లో రమ్మీ ఆడిన ఓ మంత్రి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఆయనకు క్రీడల శాఖను అప్పగించడం గమనార్హం.
అవును... అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా సభలో రమ్మీ ఆడారంటూ మహారాష్ట్ర మంత్రి మాణిక్ రావ్ కోకాటేపై సంచలన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఇబ్బందులు పడుతుంటే.. వ్యవసాయ మంత్రి రమ్మీ ఆడుతున్నారని విపక్షాలు మండిపడ్డాయి.. రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... మాణిక్ రావ్ పై వేటు వేయలేదు కానీ.. ఆయనను వ్యవసాయ శాఖ నుంచి తప్పించి క్రీడల శాఖను అప్పగించింది. దీంతో.. ఈ విషయం మరింతగా విమర్శలకు దారితీసిందని అంటున్నారు. ఆయనకు క్రీడల శాఖను అప్పగించడం అంటే.. అసెంబ్లీలో రమ్మీ ఆడటాన్ని అధికారికంగా అనుమతించినట్లే అవుతుందని ఎద్దేవా చేస్తున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన శివసేన (యూబీటీ) నేతలు.. అసెంబ్లీలో రమ్మీ ఆడిన మంత్రిని పదవి నుంచి తొలగించకుండా, కేవలం శాఖను మార్చడం జవాబుదారీతనం అనిపించుకోదని.. ఇది కేవలం కంటితుడుపు చర్య మాత్రమే అని మండిపడుతున్నారు.
ఈ విషయంపై స్పందించిన మాణిక్ రావ్ కోకాటే.. ఈ వారం ప్రారంభంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ను కలిసి, తన వాదనను వినిపించానని తెలిపారు. కార్డ్ గేమ్ వివాదం కారణంగా రైతుల మనోభావాలు దెబ్బతిన్నట్లయితే మీడియాతో మాట్లాడిన సమయంలో వారికి క్షమాపణలు చెప్పాను అని అన్నారు. ఇదే సమయంలో.. తనపై రాజీనామా చేయమని ఎటువంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.
కాగా... ఇటీవల మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మాణిక్ రావ్ కోకాటే.. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఫోన్ లో రమ్మీ ఆడుతున్నారని ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపించిన సంగతి తెలిసిందే. రైతులు, వ్యవసాయ సమస్యల గురించి సభలో చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి ఇలా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో రోజుకు 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అయినప్పటికీ వ్యవసాయ శాఖ మంత్రి వీటన్నింటినీ పట్టించుకోకుండా ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇటువంటి మంత్రులున్న ప్రభుత్వం.. రుణ మాఫీ, పంటల బీమా, మద్దతు ధరల కోసం రైతులు చేసే డిమాండ్ లను ఏం వింటుందని విమర్శించారు. దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు.
