ఐఫోన్ కోసం కుటుంబం బలి కాదు.. శంభాజీనగర్ కొండ విషాదం వెనుక అసలు నిజాలు ఇవీ?
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర కొండ విషాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
By: A.N.Kumar | 25 Aug 2026 6:13 PM ISTమహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర కొండ విషాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కొండపై నుంచి పడి ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే ఈ దారుణ ఘటనపై సోషల్ మీడియాలోనూ.. కొన్ని వార్తా మాధ్యమాల్లోనూ వస్తున్న ప్రచారాలు ఆ కుటుంబాన్ని మరింత కుంగదీస్తున్నాయి. ఐఫోన్ ఈఎంఐ వివాదమే ఈ ఘోరానికి కారణమంటూ వస్తున్న వార్తలపై మృతురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. సంగితా చంద్‌గుడే తన భర్త, కుమారుడితో కలిసి కొండ ప్రాంతానికి వెళ్లిన సమయంలో తీవ్ర కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. ఆ అనూహ్య పరిణామాల మధ్య కొండపై నుంచి పడి కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఆ తర్వాత సంగితా కూడా కొండపై నుంచి దూకి చనిపోవడం స్థానికంగా తీవ్ర కలకలానికి దారితీసింది.
అయితే ఘటన జరిగిన మరుక్షణం నుంచే ఒక ఐఫోన్ కొనుగోలు, దాని ఈఎంఐ చెల్లింపుల చుట్టూ వివాదం నడిచిందని.. అదే ఈ దారుణానికి ప్రధాన కారణమంటూ వార్తలు షికారు చేశాయి. ఈ వార్తలపై మృతురాలి సోదరి పల్లవి పాటిల్ కన్నీటి పర్యంతమయ్యారు. ఐఫోన్ ఈఎంఐ అంశంపై జరుగుతున్న ప్రచారం కేవలం పుకార్లు మాత్రమేనని ఆమె తేల్చి చెప్పారు.
“ఈ విషయాలు ప్రచారం చేస్తున్న వారికి అసలు కుటుంబంలో ఏం జరిగిందో ఏమీ తెలియదు. మీరు అల్లే కథనాలు ఇప్పటికే పుట్టెడు దుఃఖంలో ఉన్న మాకు మరింత వేదనను మిగులుస్తున్నాయి” అని పల్లవి పాటిల్ అత్యంత ఆవేదనతో పేర్కొన్నారు. అసలు నిజాలు తెలియకుండా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని వేడుకున్నారు.
పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఈఎంఐ కోణాన్ని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. అసలు కారణాలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు సేకరించి, దర్యాప్తు పూర్తయిన తర్వాతే అధికారిక నిజాలు వెలుగులోకి వస్తాయి.
ఒక వైపు సొంత మనుషులను కోల్పోయిన తీరని లోటు.. మరోవైపు సమాజంలో వస్తున్న కట్టుకథలు ఆ కుటుంబాన్ని నరకం చూపుతున్నాయి. అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎలాంటి ఊహాగానాలను.. పుకార్లను నమ్మవద్దని, ఒక విషాదాన్ని ఆధారంగా చేసుకుని మనోవేదనను పెంచవద్దని కుటుంబ సభ్యులు పదే పదే అభ్యర్థిస్తున్నారు.
