అడవుల్లోకి రూ.కోటి మేకలను వదిలితే ఆ సమస్య సాల్వ్..!
ఇందులో భాగంగా... చిరుతలు జనావాసాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో మేకలను అడవుల్లోకి వదిలిపెట్టాలని మహారాష్ట్ర మంత్రి గణేశ్ నాయక్ సూచించారు.
By: Raja Ch | 9 Dec 2025 2:00 AM ISTఇటీవల కాలంలో అడవి జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తోన్న ఘటనలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అటవీ ప్రాంతాల్లోని పొలాల్లోకి ఏనుగులు, గ్రామాల్లోకి చిరుతపులులు రావడం పెరుగుతున్న ఘటనలు తెరపైకి వస్తోన్నాయి. ఈ సమయంలో జనావాసాల్లోకి చిరుతలు ప్రవేశించకుండా అడ్డుకునేందుకు మహారాష్ట్ర మంత్రి చేసిన సూచన చర్చనీయాంశంగా మారింది.
అవును... ఇటీవల మహారాష్ట్రలోని పలు గ్రామాల్లో చిరుత దాడులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే జితేంద్ర ఆహ్వాద్. తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్థావించారు. దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించారు. దీనిపై మంత్రి గణేశ్ నాయక్ బదులిచ్చారు.
ఇందులో భాగంగా... చిరుతలు జనావాసాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో మేకలను అడవుల్లోకి వదిలిపెట్టాలని మహారాష్ట్ర మంత్రి గణేశ్ నాయక్ సూచించారు. చనిపోయిన తర్వాత బాధితులకు పరిహారం అందించే బదులు.. అదే డబ్బుతో వచ్చే మేకలను అడవిలోకి వదిలివేయాలని అన్నారు. ఈ మేరకు అధికారులకు సూచించినట్లు తెలిపారు.
ఈ క్రమంలో... చిరుత దాడుల్లో ఒకవేళ నలుగురు మరణిస్తే.. వారికి పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి చెల్లించాలి అని చెప్పిన మంత్రి.. అందుకే మరణాల తర్వాత కోటి రూపాయలు పరిహారంగా అందించే బదులు.. ఆ కోటి రూపాయల విలువైన మేకలను కొని, అడవుల్లో వదిలితె చిరుతలు జనావాసాల్లోకి రాకుండా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పలు జిల్లాలో ఇటీవల చిరుతల దాడులు భారీగా పెరిగాయని తెలిపారు.
మనిషి - చిరుత పులి ఘర్షణ!:
మహారాష్ట్రలోని ఆలీబాగ్ లో గల ప్రసిద్ధ నాగావ్ బీచ్ సమీపంలోని నాగావ్ గ్రామంలో తాజాగా జరిగిన మనిషి - చిరుతపులి ఘర్షణలో ఇద్దరు స్థానికులు గాయపడ్డారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలకు దారి తీసింది. ఈ సమయంలో పూణేకు చెందిన వన్యప్రాణుల రెస్క్యూ ఎన్జీవో ఆలీబాగ్ కు బయలుదేరిందని చెబుతున్నారు.
రెండు రోజుల రెస్క్యూ తర్వాత తల్లిని కలిసిన పిల్లలు!:
మరోవైపు.. డిసెంబర్ 5న సాంగ్లీ జిల్లాలోని శిరాల గ్రామస్తులు చెరకు కోత కోస్తున్న సమయంలో.. అక్కడ రెండు చిరుతపులి పిల్లలు కనిపించాయి. దీంతో.. ఆరు సమీప సహ్యాద్రి రెస్క్యూ వారియర్స్ కు సమాచారం అందించారు. ఈ సమయంలో మహారాష్ట్ర అటవీ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్న రెస్యూ బృందం.. తల్లి చిరుతను తిరిగి కలుసుకోవడానికి వీలుగా పిల్లలను పెట్టేలో ఉంచింది.
ఈ సమయంలో.. రెండు రోజుల తర్వాత డిసెంబర్ 7న ఉదయం 5 గంటల ప్రాంతంలో తల్లి చిరుతపులి తిరిగి వచ్చి తన రెండు పిల్లలను కలుసుకుంది. ఈ స్థాయిలో అక్కడి ప్రజలకు చిరుతలతో సమస్యలు ఉండటంతో.. మేకలను అడవిలోకి వదలాలంటూ మంత్రి సూచించారు. ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది.
