చనిపోయిన ప్రియుడ్నే పెళ్లి చేసుకున్న అమ్మాయి
మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన అంచల్ అనే అమ్మాయి.. సాక్షమ్ టేట్ అనే అబ్బాయితో స్నేహం ఏర్పడింది.
By: Garuda Media | 1 Dec 2025 11:00 AM ISTప్రేమకథలు కొత్తేం కాదు. కానీ.. ఇప్పటివరకు ఎప్పుడూ వినని లవ్ స్టోరీ తాజాగా బయటకు వచ్చింది. రీల్ లోనూ టచ్ చేయని రీతిలో ఉన్న ఈ రియల్ లవ్ స్టోరీ విషాదాంతంగా మారటమే కాదు.. వీరి ప్రేమకథ గురించి చదవిన వారు సైతం కన్నీళ్లు పెట్టేస్తారు. ప్రేమ కోసం పోరాటాలు.. త్యాగాలు చేయటం సినిమాల్లోనూ.. నిజ జీవితంలోనూ చూస్తాం. కానీ.. ఈ తరహా ఉదంతాన్ని ఇప్పటివరకు విని ఉండం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శతాబ్దంలోనే అత్యంత విషాద ప్రేమకథగా దీన్ని చెప్పాలి. అసలేం జరిగిందంటే..
మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన అంచల్ అనే అమ్మాయి.. సాక్షమ్ టేట్ అనే అబ్బాయితో స్నేహం ఏర్పడింది. కొద్దికాలానికే వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. వీరి గురించి తెలిసిన అంచల్ వారింట్లోని వారు గొడవ చేశారు. దీనికి కారణం.. అమ్మాయి.. అబ్బాయిది వేర్వేరు కులాలు కావటమే. అంతేకాదు.. వీరి ప్రేమను ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అంగీకరించమని అమ్మాయి కుటుంబ సభ్యులు కుండబద్ధలు కొట్టారు. అంతేకాదు..ఇంకోసారి తమ అమ్మాయిని కలిస్తే బాగోదన్న వార్నింగ్ ఇచ్చారు.
అయితే.. అబ్బాయి మీద ఉన్న ప్రేమతో అంచల్ కలుస్తూనే ఉంది. ఈ మధ్యన తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఈ విషయం అమ్మాయి వారింట్లో తెలియటంతో అమ్మాయి తండ్రితో పాటు ఆయన సోదరులు కలిసి అబ్బాయిని దారుణంగా కొట్టటమే కాదు.. అతడి తలపై పెద్ద రాయి మోదటంతో ఘటనాస్థలంలోనే అతను మరణించాడు. చేతికి అంది వచ్చిన కొడుకు ప్రేమ కారణంగా బలైపోవటంతో అబ్బాయి తల్లిదండ్రులు పుట్టెడు శోకంతో అంత్యక్రియలు చేపట్టారు.
తన కుటుంబ సభ్యులు తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినోడ్ని ఘోరంగా చంపేసిన విషయం తెలుసుకున్నఅంచల్.. అంత్యక్రియలు జరిగే చోటుకు చేరుకుంది. తాను పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు జీవించాల్సిన ప్రియుడ్ని విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి చలించిపోయింది. ప్రియుడి మ్రతదేహాన్ని పట్టుకొని విలపించిన తీరు అందరిని కదిలించింది. అంతేకాదు.. ఈ సందర్భంగా ఆమె ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.
సాక్ష్యమ్ బతికి ఉన్నప్పుడు ఇద్దరం కలిసి జీవిద్దామని అనుకున్నామని.. అతను మరణించినప్పటికీ అతన్ని.. అతడి ఆలోచనల్ని తన నుంచి దూరం చేయలేవని పేర్కొంటూ ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. వెంటనే తన ముఖానికి పసుపు రాసుకొని నుదుట సింధూరం ధరించి ప్రియుడి డెడ్ బాడీతో పెళ్లాడింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ తిన్నారు. అంతేకాదు.. తనకు పెళ్లైంది కాబట్టి.. తాను తన మిగిలిన జీవితాన్ని తన అత్తావారింట్లోనే ఉంటానని డిసైడ్ అయ్యింది.
సాక్ష్యమ్ మరణించినప్పటికీ తమ ప్రేమ గెలిచిందని. తన అన్నలు.. తండ్రి ఓడిపోయారంటూ తీవ్రంగా రోదిస్తూ చెప్పుకొచ్చింది. తన భర్తను దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆమె రోదిస్తున్న తీరు అక్కడున్న వారినే కాదు.. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా తీవ్రంగా కదిలిపోతున్నారు. ఎన్నో ప్రేమకథలు విన్నప్పటికీ.. ఈ విషాద ప్రేమకథ వెంటాడుతుందని చెప్పాలి. ఇప్పుడున్న రోజుల్లో ఇంత పవిత్రంగా.. నిజాయితీగా ప్రేమించే వారున్నారా? అంటూ మాట్లాడుకోవటమే కాదు.. ఈ శతాబ్దంలోనే అరుదైన ప్రేమకథగా చెప్పుకోవటం కనిపించింది.
