మొన్న ఐదేళ్లుగా.. ఇప్పుడు బ్రతికుండగానే.. మార్చురీలో మనిషి!
అదో రకం విషాదం అనుకుంటే.. తాజాగా బ్రతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
By: Raja Ch | 31 Oct 2025 10:08 AM ISTమనిషి సహజంగా మరణిస్తే అతని ఆఖరి మజిలీ స్మశానం అనే సంగతి తెలిసిందే. కాలుస్తారా, పూడుస్తారా అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ఈ భూమిపై అంతిమ గమ్యస్థానం అదే! అయితే అసహజంగా మరణిస్తే మాత్రం అంతకంటే ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్చురీ అనే మిడిల్ స్టేషన్ ఒకటి ఉంటుంది. అయితే, మరణించకుండానే అక్కడే ఉంటే..? తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.
అవును... ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి మరణించి, సుమారు ఐదేళ్ల నుంచి అతని మృతదేహం మార్చురీలోనే ఉన్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలోని రాంనగర్ కు చెందిన నరేశ్.. బహ్రెయిన్ వెళ్లి కొంతకాలం తర్వాత ఫ్యామిలీతో టచ్ లో లేరు. కట్ చేస్తే... అతడు మరణించి ఐదేళ్లు అయ్యిందని, అప్పటి నుంచీ మార్చురీలోనే అతని మృతదేహం ఉందని తెలిసింది.
అదో రకం విషాదం అనుకుంటే.. తాజాగా బ్రతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
బ్రతికుండగానే మార్చురీకి రోగి..!:
వివరాళ్లోకి వెళ్తే... చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రాజు అనే ట్రాక్టర్ డ్రైవర్ కొంతకాలంగా కాళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఐదు రోజుల క్రితం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. అయితే.. ఆధార్, అటెండెంట్ ఉంటేనే ఆస్పత్రిలో చేర్చుకుంటామని సిబ్బంది చెప్పారు. దీంతో రెండ్రోజులుగా ఆస్పత్రి ఆవరణలోనే ఉంటున్నాడు.
ఈ క్రమంలో.. రెండు రోజులుగా చికిత్స అందకపోవడంతో నీరసంగా మార్చురీ గది ముందు పడుకుండిపోయాడు. అయితే.. అతడు సజీవంగానే ఉన్నాడనే విషయం గమనించకుండానే మార్చురీ వరండాలో స్ట్రెచర్ పై పడుకోబెట్టి తాళం వేశారు ఆస్పత్రి సిబ్బంది. అయితే, శరీర కదలికలు గమనించిన పారిశుద్ధ్య సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో హుటాహుటిన మార్చురీ వద్దకు చేరుకున్న పోలీసులు.. అదే ఆస్పత్రిలో అతడికి వైద్యం చేయించారు. దీనిపై రీజనల్ మెడికల్ ఆఫీసర్ (ఆర్‌ఎంవో) స్పందిస్తూ.. ఈ ఘటనపై విచారణ జరుపుతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆధార్, అటెండెంట్ లేకున్నా.. రోగులకు చికిత్స అందిస్తామని తెలిపారు. ఈ విషయం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
