మాఘమాసం: ఏ శివలింగాన్ని పూజిస్తే.. ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసా?
తెలుగు సంవత్సరంలో 11వ నెల.. చంద్రుడు ముఖ నక్షత్రంతో కూడుకున్న నెల కావడంతో దీనిని మాఘమాసం అని పిలుస్తారు.
By: Madhu Reddy | 18 Jan 2026 5:00 PM ISTతెలుగు సంవత్సరంలో 11వ నెల.. చంద్రుడు ముఖ నక్షత్రంతో కూడుకున్న నెల కావడంతో దీనిని మాఘమాసం అని పిలుస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతిప్రథమైనది. హిందూ సంప్రదాయం ప్రకారం.. ఈ మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీమన్నారావణుడిని పూజించి, శక్తి కొలది దానం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుందట. ముఖ్యంగా ఈ మాఘ మాసంలో ఏ నది నీరైనా సరే గంగా నదితో సమానం కాబట్టి ఈ మాసంలో నదీ స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఇకపోతే ఈ మాఘ మాసంలో ఎక్కువగా దేవదేవుడైన ఆ మహేశ్వరుడికి పూజలు ఘనంగా జరుగుతాయి . అయితే ప్రత్యేకించి ఈ మాఘమాసంలో మహాశివుడు భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతాడు. అలాంటి ఈ మాఘ మాసంలో ఏ శివలింగాన్ని ఏ విధంగా పూజిస్తే పాపాలు తొలగిపోతాయో.. ? ముఖ్యంగా ఏ శివలింగాన్ని పూజించడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
శివ మహాపురాణం ప్రకారం శివలింగాలు ఎన్ని రకాలు? వేటిని పూజిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది? అనే విషయానికి వస్తే.. శివలింగం తయారైన పదార్థాన్ని బట్టి.. దానిని పూజించే వారికి వివిధ విశేష ఫలితాలు కలుగుతాయట.
1). పార్థివ లింగం:
ఈ లింగాన్ని పుట్టమన్ను లేదా మట్టితో తయారుచేస్తారు. ఇలా తయారుచేసిన శివలింగాన్ని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరి, మోక్షం లభిస్తుంది.
2). పాదరస లింగం:
దీర్ఘకాలిక రోగాలు నయం అవడమేకాకుండా.. మహా పాతకాలు కూడా తొలగిపోతాయి.
3). స్పటిక లింగం:
జ్ఞానం వృద్ధి చెందుతుంది. మనశ్శాంతి కలుగుతుంది. గ్రహదోషాలు ఏవైనా ఉంటే నివారించబడతాయి.
4). స్వర్ణ లింగం:
బంగారంతో తయారు చేయబడిన ఈ స్వర్ణ లింగాన్ని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు , ధన ప్రాప్తి కలుగుతుంది.
5). రజత లింగం:
వెండితో తయారుచేసిన ఈ రజత లింగానే పూజిస్తే.. సంపద వృద్ధి చెందడమే కాకుండా పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది.
6). కాంస్య లింగం:
కంచు లోహంతో తయారు చేసే ఈ లింగాన్ని పూజించడం వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
7). బెల్లపు లింగం:
బెల్లంతో తయారు చేయబడిన ఈ లింగాన్ని పూజించడం వల్ల ప్రేమ వివాహాలు సఫలం అవుతాయి. బంధాలు బలపడతాయి.
8). నవనీత లింగం:
వెన్నతో తయారు చేయబడిన ఈ లింగాన్ని పూజించడం వల్ల కుటుంబంలో సంతోషం కలిగి , కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
9). గంధపు లింగం:
చందనంతో తయారుచేసిన ఈ లింగాన్ని పూజించడం వల్ల సౌభాగ్యం పొందడంతో పాటు ఆనందం కలుగుతుంది.
10). భస్మ లింగం:
విభూదితో చేసే ఈ లింగాన్ని పూజించడం వల్ల అన్ని పనులు చక్కగా నెరవేరడమే కాకుండా గ్రహ పీడ ఏదైనా ఉంటే నివారణ జరుగుతుంది.
11). అన్న లింగం:
అన్నంతో తయారుచేసిన ఈ లింగాన్ని పూజించడం వల్ల ఆహార కొరత ఏర్పడదు. పైగా అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.
12). పుష్ప లింగం :
పువ్వులతో అలంకరించబడిన ఈ పుష్ప లింగాన్ని పూజించడం వల్ల ఆస్తి లాభం మాత్రమే కాకుండా భూ తగాదాలు ఏవైనా ఉంటే పరిష్కారం అవుతాయి.
కాబట్టి పైన చెప్పబడిన లింగం యొక్క ప్రత్యేకతలను బట్టి.. మీకున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని.. ఆయా లింగాలకు పూజలు చేస్తే ఆయా ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
గమనిక: పైన చెప్పబడిన సమాచారం మీకు అవగాహన కోసం మాత్రమే.. మీరు ఏదైనా ఒక కార్యాన్ని తలచినప్పుడు పండితుల సమక్షంలో చేయడం ఉత్తమం.
