Begin typing your search above and press return to search.

వెనిజుల ఆపరేషన్ ఎలా జరిగింది? అధ్యక్షుడిని అమెరికా ఎలా బంధించింది.. తెరవెనుక జరిగిందిదీ..

అమెరికా అగ్రరాజ్యం హోదాలో ఏం చేసినా చెల్లుతుందా? ఒకదేశంపైకి వెళ్లి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి అమెరికా తీసుకొచ్చేందుకు దానికి ఏం రైట్స్ ఉన్నాయి? అధ్యక్షుడినే అరెస్ట్ చేస్తుంటే వెనిజుల సైన్యం, పోలీసులు, ప్రజలు ఏం చేస్తున్నారు.?

By:  A.N.Kumar   |   4 Jan 2026 12:52 PM IST
వెనిజుల ఆపరేషన్ ఎలా జరిగింది? అధ్యక్షుడిని అమెరికా ఎలా బంధించింది.. తెరవెనుక జరిగిందిదీ..
X

అమెరికా అగ్రరాజ్యం హోదాలో ఏం చేసినా చెల్లుతుందా? ఒకదేశంపైకి వెళ్లి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి అమెరికా తీసుకొచ్చేందుకు దానికి ఏం రైట్స్ ఉన్నాయి? అధ్యక్షుడినే అరెస్ట్ చేస్తుంటే వెనిజుల సైన్యం, పోలీసులు, ప్రజలు ఏం చేస్తున్నారు.? ఎందుకు తిరగబడలేదు. అంత సులువుగా అమెరికా వెనిజులాలో అధ్యక్షుడిని పదవీ చిత్యుడిని ఎలా చేయగలిగింది.. ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశమైనా సరే తన గగనతల భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉంటుంది. శత్రు దేశపు చిన్న డ్రోన్ లేదా బెలూన్ కనిపిస్తేనే క్షిపణులతో కూల్చేసేంత అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉంది. ఇటీవల అమెరికా గగనతలంలోకి వచ్చిన చైనా బెలూన్‌ను అమెరికా యుద్ధ విమానాలు ఎలా వెంటాడి కూల్చాయో ప్రపంచం చూసింది. కానీ, వెనిజులా వంటి దేశంలోకి అమెరికా యుద్ధ విమానాలు యధేచ్ఛగా ప్రవేశించి ఆ దేశ అధ్యక్షుడినే బంధించి తీసుకువెళ్తుంటే.. అక్కడి రక్షణ వ్యవస్థలు ఎందుకు స్పందించలేదు? రాడార్లు ఎందుకు మూగబోయాయి? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? అన్నది హాట్ టాపిక్ గా మారింది..

పాకిస్తాన్ 'అబోటాబాద్' ఆపరేషన్ పునరావృతమైందా?

చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరగేస్తే.. 2011లో పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికా జరిపిన ఆపరేషన్ గుర్తుకు వస్తుంది. అప్పట్లో ఒబామా ప్రభుత్వం అత్యంత రహస్యంగా హెలికాప్టర్లను పంపి అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చింది. ఆ సమయంలో పాకిస్తాన్ సైన్యానికి గానీ ప్రభుత్వానికి గానీ సమాచారం లేదని అమెరికా ప్రకటించింది. కానీ ఒక దేశపు సార్వభౌమాధికారాన్ని ధిక్కరిస్తూ విదేశీ విమానాలు లోపలికి వచ్చినప్పుడు సైన్యం చూస్తూ ఊరుకుంటుందా? పాకిస్తాన్ సైన్యం మౌన సహకారం లేకుండా అది సాధ్యం కాదని అప్పట్లో అంతర్జాతీయ విశ్లేషకులు తేల్చి చెప్పారు. ఇప్పుడు వెనిజులాలో మదురో విషయంలోనూ అదే 'పాకిస్తాన్ మోడల్' పునరావృతమైందని విమర్శలు వినిపిస్తున్నాయి.

వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్.. అసలు ఆపరేషన్ ఎలా జరిగింది?

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో , ఆయన సతీమణిని అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది. గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని అమెరికా విమానాలు నేరుగా రాజధానిలోకి ప్రవేశించాయి. వెనిజులా రక్షణ వ్యవస్థ నిశ్చలంగా ఉండటం వెనుక ఆ దేశ సైన్యంలోని కొందరు ఉన్నతాధికారుల హస్తం ఉందని తెలుస్తోంది. అమెరికా బలప్రయోగం కంటే వెనిజులా సైన్యం అందించిన 'లోపలి సహకారం' వల్లే మదురోను బంధించడం సులువైందనే వాదన బలంగా ఉంది. అరెస్ట్ చేసిన వెంటనే వారిని అమెరికాకు తరలించి, న్యూయార్క్ కోర్టులో ప్రవేశపెట్టడం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర చర్చకు దారితీసింది.

అమెరికా సామ్రాజ్యవాదం.. ఆధిపత్య పోరాటమా?

లాడెన్ ఘటన ఉగ్రవాద నిర్మూలన కోసం జరిగిందని చెప్పుకున్నా.. వెనిజులాలో జరిగిన మార్పు వెనుక అమెరికా రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెనిజులాలో ఉన్న అపారమైన చమురు నిల్వలపై నియంత్రణ సాధించడం.. తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలను కూలదోసి, తమకు నచ్చిన వారిని గద్దెనెక్కించడం... లాటిన్ అమెరికా దేశాల్లో తమ మాటే చెల్లాలని అమెరికా భావించడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.

అమెరికాది కుటిల ప్రజాస్వామ్య వాదం?

ఒక దేశ ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని.. మరో దేశం వచ్చి తన చట్టాలతో అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఉగ్రవాద నిరోధమా లేక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చడమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా తన ప్రయోజనాల కోసం ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని కాలరాస్తోందనే విమర్శలకు ఈ ఘటన బలమైన సాక్ష్యంగా నిలుస్తోంది.

పాకిస్తాన్‌లో అబోటాబాద్.. ఇప్పుడు వెనిజులాలో మదురో అరెస్ట్.. పేర్లు మారినా దేశాలు మారినా అమెరికా అనుసరిస్తున్న వ్యూహం మాత్రం ఒక్కటే. అది "లోపలి సైన్యాన్ని లొంగదీసుకోవడం.. గగనతలాన్ని ఆక్రమించడం.. లక్ష్యాన్ని చేధించడం... భద్రతా వ్యవస్థలు ఎన్ని ఉన్నా.. దేశద్రోహం లేదా అంతర్గత కుట్రలు తోడైనప్పుడు ఏ దేశానికైనా రక్షణ కరువవుతుందని వెనిజులా ఉదంతం నిరూపిస్తోంది.