లవ్ మ్యారేజ్ లైక్ స్టాక్ మార్కెట్... హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు!
అవును... తిరుచ్చికి చెందిన ఓ గ్రాడ్యుయేట్ అమ్మాయి చెన్నైలో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో సెలవులపై ఇంటికి వచ్చిన ఆమె.. అకస్మాత్తుగా అదృశ్యమైంది.
By: Raja Ch | 31 Dec 2025 11:00 AM ISTతల్లి తండ్రులకు తెలియకుండా, ఇంట్లో నుంచి వెళ్లిపోయి, ప్రేమ వివాహం చేసుకుని, వారిని తీవ్ర అందోళనకు గురి చేసిన ఓ అమ్మాయి విషయంలో మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ చేసిన వ్యాఖ్యలు, అమ్మాయికి చెప్పిన విషయాలు, తల్లి తండ్రులకు చేసిన సూచనలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఈ సందర్భంగా బాధ్యతలు, మోరల్స్, ధర్మం వంటి విషయాలను ప్రస్థావిస్తూనే చట్ట ప్రకారం తీర్పు ఇచ్చిన ఘటన చోటు చేసుకుందని అంటున్నారు! ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అవును... తిరుచ్చికి చెందిన ఓ గ్రాడ్యుయేట్ అమ్మాయి చెన్నైలో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో సెలవులపై ఇంటికి వచ్చిన ఆమె.. అకస్మాత్తుగా అదృశ్యమైంది. తిరిగి ఉద్యోగానికి వెళ్తుందో, ఎక్కడికైనా వెళ్లిందో, లేక.. ఎవరైనా ఎత్తుకుపోయారో అనే విషయాలపై తల్లితండ్రులకు క్లారిటీ లేకుండా అదృశ్యమైంది. దీంతో.. కంగారుపడిన తల్లితండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. తమ కుమార్తె తప్పిపోయిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదే సమయంలో... తప్పిపోయిన తమ కుమార్తెను కోర్టుకు హాజరుపరచాలని కోరుతూ హైకోర్టు మధురై బ్రాంచ్ లో పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీంతో... ఇప్పటికే కేసును విచారించిన న్యాయమూర్తులు అదృశ్యమైన మహిళను హాజరుపరచాలని ఆదేశించారు. ఈ పిటిషన్ మంగళవారం జస్టిస్ వెల్మురుగన్, జ్యోతిరామన్ లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సమయంలో తప్పిపోయిందని చెబుతోన్న ఆ మహిళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు.
ఈ క్రమంలో అసలు ఏమి జరిగింది.. ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు.. ఏమైపోయారు అంటూ న్యాయమూర్తులు ఆ మహిళను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా స్పందించిన ఆ మహిళ... తనతో పాటు పనిచేసే పశ్చిమ బెంగాల్ కు చెందిన వ్యక్తిని తాను వివాహం చేసుకున్నానని ఆ మహిళ కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన న్యాయమూర్తులు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలు మాటలు చెబుతూనే.. తల్లితండ్రులకు ఓ సూచన చేశారు.
ఇందులో భాగంగా... పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లితండ్రులు వారిని బాగా చదివిస్తున్నారు.. ప్రేమించుకునేందుకు కాదు.. ప్రేమ వివాహం స్టాక్ మార్కెట్ లాంటిది.. దానికి ఎత్తుపల్లాలు, హెచ్చుతగ్గులూ ఉంటాయి.. మీరు ఎవరితోనైనా వెళ్లడం మీ వ్యక్తిగత ఇష్టం.. కానీ, మీరు మీ తల్లీండ్రుల అభిప్రాయాలను గౌరవించాలి.. మీ అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని తల్లితండ్రులకు సరిగ్గా తెలియజేయాలి.. వారూ చదువుకున్నారు.. వారికి మిమ్మల్ని ఇలా కోర్టు ద్వారా చూపించడం సరైందేనా..? మీరు మీ తల్లితండ్రులను శాంతిపచేసి, ఒప్పించి ఉండవచ్చు అని వ్యాఖ్యానించారు!
ఇదే సమయంలో భర్తతో వెళ్లి తల్లితండ్రులను సమాధాన పరచాలని కోర్టు ఆమెకు సూచించింది! తల్లితండ్రులకు న్యాయమూర్తులు తగు సూచనలు చేశారు. ఇందులో భాగంగా.. పరిస్థితులను అర్ధం చేసుకుని తల్లితండ్రులు తదనుగుణంగా వ్యవహరించాలని అన్నారు. ఈ సందర్భంగా స్పందించిన ఆ మహిళ తల్లితండ్రులు.. తాము వృద్ధులం అయ్యామని.. తమను చూసుకోవడానికి ఎవరూ లేరని చెబుతూ కన్నీరుమున్నీరయ్యారు. దీనికి స్పందించిన న్యాయమూర్తులు.. ఆమె వివాహం చేసుకుని తన భర్తతో వెళ్లిపోయిందని.. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని చెబుతూ కేసును ముగించారు!!
