Begin typing your search above and press return to search.

మాడుగుల హల్వా కావాలా...వైసీపీ ఏం చేయాలంటే ?

ఇక మాడుగులలో చూస్తే టీడీపీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సీనియర్ నేత.

By:  Satya P   |   4 July 2026 1:00 PM IST
మాడుగుల హల్వా కావాలా...వైసీపీ ఏం చేయాలంటే ?
X

అనకాపల్లి జిల్లాలో కీలకమైన సీటుగా మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఈ సీటు గొప్పతనం ఏంటి అంటే టీడీపీకి దశాబ్దాలుగా కట్టుబడిపోయింది. టీడీపీ ఆవిర్భవించాక ఏడు సార్లు మాడుగులలో టీడీపీ గెలిచింది. అందులో అయిదు సార్లు రెడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. టీడీపీ ముందు కూడా కాంగ్రెస్ రెండు సార్లు గెలిచింది. ప్రతిపక్షాలు ఇండిపెండెంట్లు ఈ సీట్లో గెలుస్తూ వచ్చారు. ఇక 32 ఏళ్ళ సుదీర్ఘ కాలం తరువాత 2004లో కాంగ్రెస్ మాడుగులలో గెలిచింది. మళ్ళీ 2009లో టీడీపీ గెలిచింది. 2014, 2019లలో వైసీపీ తరఫున బూడి ముత్యాలనాయుడు గెలిచారు. 2024లో మళ్ళీ టీడీపీ జెండా ఎగరేసింది.

బూడి గట్టిగానే పట్టు :

ఇక బూడి ముత్యాలనాయుడు జెడ్పీటీసీ నుంచి నేరుగా ఎమ్మెల్యే అయ్యారు. గ్రౌండ్ లెవెల్ లో ఆయనకు మంచి పట్టు జనంతో కలసి తిరగడం స్థానిక సమస్యల మీద అవగాహన వంటివి ఆయనను రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసాయి. సామాన్యుడిగా వ్యవహరించడం కూడా ఆయనకు కలసి వచ్చిన మరో అంశం. ఇక 2024లో కూడా ఎమ్మెల్యేగా వరసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బూడి అనుకుంటున్న నేపధ్యంలో సడెన్ గా ఆయన్ని అనకాపల్లి ఎంపీగా జగన్ నిలబెట్టి ఆయన కుమార్తె జెడ్పీటీసీ అయిన బూడి అనూరాధకు మాడుగుల ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దాంతో తండ్రీ కుమార్తె ఇద్దరూ ఓటమి పాలు అయ్యారు.

ఈసారి చాన్స్ ఉందా :

ఇక మాడుగులలో చూస్తే టీడీపీ నుంచి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన సీనియర్ నేత. అయినప్పటికీ ఆయన చూపు ఎక్కువగా పెందుర్తి మీద ఉంది. అది ఆయన సొంత సీటు దాంతో 2029 లో తన కుమారుడిని అక్కడ నిలబెట్టి రాజకీయ వారసుడిగా తీర్చిదిద్దాలని చూస్తున్నారు. మాడుగుల టీడీపీలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఉన్నారు. అలాగా ఇతర నేతలు కూడా ఉన్నారు. వీరంతా ఎవరికి వారుగా వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మాడుగులలో టీడీపీ పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ విషయం తీసుకుంటే బూడి నెమ్మదించారు అని అంటున్నారు.

జగన్ దిశా నిర్దేశం :

ఇటీవల తాడేపల్లి వెళ్ళిన బూడి ఆయన కుమార్తె అనూరాధలకు పార్టీని పటిష్టం చేయమని జగన్ దిశా నిర్దేశం చేశారు అని అంటున్నారు. టీడీపీకి బలమైన స్థావరంగా ఉన్న మాడుగులలో గెలవడం అంటే వైసీపీకి కత్తి మీద సాము అని అంటున్నారు. పార్టీ బాగా యాక్టివ్ కావాల్సి ఉందని అంటున్నారు. అంతే కాదు బూడి ముత్యాలనాయుడు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్ధి అయితేనే వైసీపీకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని అంటున్నారు. అయితే ఆయన తన కుమార్తె అనూరాధకు టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. అందుకే ఆయన రాజకీయంగా కొంత చురుకు తగ్గించారు అని కూడా అంటున్నారు. అయితే జనాల్లో మాత్రం బూడి పట్ల అభిమానం సానుభూతి ఉన్నాయని ఆయన కనుక పోటీకి దిగితే టీడీపీకి టఫ్ గా ఉంటుందని అంటున్నారు. ఆయన ప్లేస్ లో కుమార్తెని నిలబెడితే మాత్రం సైకిల్ స్పీడ్ అందుకుంటుందని కూడా అంటున్నారు. మరి ఈ విషయంలో వైసీపీ అధినాయకత్వం ఎలా ఆలోచిస్తుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు. మాడుగుల హల్వా కావాలంటే వైసీపీ చేయాల్సింది బోలెడు ఉందని కూడా సూచనలు వస్తున్నాయి.