వ్యభిచారంపై వర్సిటీ ఆఫ్ మద్రాస్ పరిశోధన.. షాకింగ్ నిజాలు బయటకు
కీలక సామాజిక అంశంపై మద్రాస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు పరిశోధన నిర్వహించారు.
By: Garuda Media | 25 Nov 2025 12:00 PM ISTకీలక సామాజిక అంశంపై మద్రాస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు పరిశోధన నిర్వహించారు. సమాజంలోని కొందరు మహిళలు ఈ ఉచ్చులోకి ఎందుకు చిక్కుకుంటారు? అసలేం జరుగుతోంది? లాంటి అంశాలపై వర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు పలువురు బాధిత మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ఈ ఉచ్చులోకి ఎలా దిగుతారన్న విషయాన్ని గుర్తించారు. మద్రాస్ వర్సిటీ క్రిమినాలజీ విభాగానికి చెందిన ప్రేమానంద.. ప్రొఫెసర్ శ్రీనివాసన్ ఈ కీలక అంశంపై పరిశోధన చేపట్టారు.
తమ పరిశోధనలో భాగంగా బాధిత మహిళల్ని కొందరు ఎలా ట్రాప్ చేస్తున్నారన్న విషయంపై కొంత స్పష్టతను ఇచ్చారు. అక్రమ రవాణాదారులు మహిళల్ని ఎంపిక చేసుకోవటానికి సోషల్ మీడియాను వాడుతున్న విషయాన్ని గుర్తించారు. ఈ తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. ఒక క్రమ పద్దతిలో టార్గెట్ చేసి.. వారిని పడుపు వృత్తిలోకి దించుతున్న వైనాన్ని గుర్తించారు.
మహిళల అక్రమ రవాణాదారులు ఎక్కువగా వాట్సాప్ వినియోగిస్తూ.. తాము టార్గెట్ చేసుకున్న మహిళలకు తమ మీద మంచి అభిప్రాయం కలిగేలా మాయమాటలు చెప్పటం వారి తొలి ఎత్తుగడగా గుర్తించారు. అలా మొదలు పెట్టి తమ మాట వినేలా చేసుకొని.. వారితో వ్యభిచారం చేయించటమే కాదు సోషల్ మీడియాను అసరగా చేసుకొని ప్రకటనలు ఇవ్వటం.. విటుల్ని ఆకర్షిస్తున్నారని తేల్చారు
వాట్సప్ ఛానెల్స్.. ఫేస్ బుక్ ఇతరత్రా వెబ్ సైట్లను తమకు తగ్గట్లు మార్చుకున్న వీరు.. తాము లక్ష్యంగా చేసుకునే మహిళలంతా వారికి బాగా తెలిసిన. పరిచయస్తులేనన్న షాకింగ్ నిజాన్ని గుర్తించారు. బాధిత మహిళల్ని స్వయంగా కలిసి.. వారి గాధల్ని విన్న క్రమంలో ఈ విషయాన్ని గుర్తించారు. ‘మీరు చాలా బాగుంటారు’ లాంటి మాటలతో వారికి నమ్మకస్తులుగా మారుతున్నట్లుగా తన రిపోర్టులో వెల్లడించారు.
తమ పరిశోధనలో భాగంగా మొత్తం 76 మంది బాధిత మహిళలతో మాట్లాడగా.. వారిలో అత్యధికులు చెన్నై.. మదురై.. తిరుచ్చి.. సేలం.. కోయంబత్తూరుకు చెందినవారు. ప్రస్తుతం ప్రభుత్వ సంరక్షణ నిలయాల్లో ఉంటున్న వీరు.. సగం మంది తమిళ మహిళలు కాగా.. 25 శాతం మంది బెంగాల్ నుంచి.. బంగ్లాదేశ్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిగా గుర్తించారు. ప్రస్తుతం ప్రభుత్వ సంరక్షణలో ఉన్న వారిలో 45 శాతం మంది 35 ఏళ్ల లోపు వారేకావటం గమనార్హం. వీరిలో అత్యధికులు విడాకులు తీసుకున్నవారు.. భర్త మరణించిన వారు.. లేదంటే భర్తతో విడిపోయిన వారే.
బాధిత మహిళల్లో 47.4 శాతం మంది ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతోనే ఈ పాడు వృత్తిలోకి స్వచ్ఛందంగా వచ్చినట్లుగా ఒప్పుకన్నారు. కుటుంబాలు పేదరికంలో ఉండటం.. ఇంట్లోవారిని.. పిల్లల్ని పోషించేందుకు చేసిన అప్పులు తీర్చటానికి.. వైద్య ఖర్చులకు ఈ పని చేసినట్లుగా వారు పేర్కొన్నారు. వ్యభిచార కేసుల్లో 85 మంది నిందితుల్ని పట్టుకోగా అందులో 45 మంది మహిళలే.
నిందితుల్లో ఎక్కువ మంది తమిళ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అంతేకాదు వీరిలో పలువురు అధికారులు.. మిలటరీ సిబ్బంది.. పొలిటికల్ నేపథ్యం ఉన్నవాళ్లున్నట్లుగా తేల్చారు. మరింత షాకింగ్ అంశం ఏమంటే.. న్యాయ వ్యవస్థలో పని చేసే వారు కూడా ఇందులో పాలు పంచుకోవటం. నిందితుల్లో 30 శాతం మంది పోలీసులకు లంచం ఇస్తూ బయటకు వస్తుంటే.. 23.5 శాతం మంది పోలీసులతో.. విచారణ అధికారులతో స్నేహం చేయటం ద్వారా తమ పరిధిలోని యువతులకు సంబంధించిన అంశాలు గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. వ్యభిచార ఊబిలోకి దించే ప్రకటనల్ని ఆధునిక సాంకేతికత ద్వారా పట్టుకోవటానికి ప్రయత్నించాలని చెబుతున్నారు. నిందితుల్ని పట్టుకోవటానికి మూస పద్దతుల్లో సాగే పోలీసింగ్ పనికి రాదని.. అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని చెబుతున్నారు.
