Begin typing your search above and press return to search.

వేరు కాపురం పెట్టాలని భర్తపై ఒత్తిడి చేయడం క్రూరత్వమే.. మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

"పెళ్లయ్యాక భర్త నా సొంతం.. ఆయన కష్టపడి సంపాదించే జీతం నా సొంతం.. కానీ ఆయనని కని పెంచిన అత్తామామలు మాత్రం నాకు అస్సలు వద్దు".. ఈ కాలంలో చాలా మంది "అతి తెలివి" కోడళ్ల మైండ్ సెట్ ఇదే.

By:  A.N.Kumar   |   11 Sept 2026 11:01 AM IST
వేరు కాపురం పెట్టాలని భర్తపై ఒత్తిడి చేయడం క్రూరత్వమే.. మద్రాస్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

"పెళ్లయ్యాక భర్త నా సొంతం.. ఆయన కష్టపడి సంపాదించే జీతం నా సొంతం.. కానీ ఆయనని కని పెంచిన అత్తామామలు మాత్రం నాకు అస్సలు వద్దు".. ఈ కాలంలో చాలా మంది "అతి తెలివి" కోడళ్ల మైండ్ సెట్ ఇదే. పెళ్లి కాగానే భర్తను సొంతం చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ ఆ భర్తను కంటికి రెప్పలా కాపాడిన వృద్ధ తల్లిదండ్రులను భరించడంలో చూపించకపోవడం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. "మావగారి దగ్గు నసలు నా కవితాత్మక ఆలోచనలకు భంగం కలిగిస్తున్నాయి", "అత్తగారు టీలో పంచదార ఎక్కువ వేశారు" అనే చిన్న చిన్న కారణాలకు కూడా సూట్‌కేస్ సర్దుకుని "నాతో వేరు కాపురం వస్తావా.. లేక నేను పుట్టింటికి వెళ్ళిపోమంటావా?" అని భర్త గొంతు మీద కత్తి పెట్టే మహానటులకు కొదువ లేదు.

అయితే ఇలాంటి "డ్రామా క్వీన్ల" కుట్రలకు మద్రాస్ హైకోర్టు గట్టి ప్లాస్టిక్ సర్జరీ చేసింది.. "భర్తే ముద్దు.. ఆయన తల్లిదండ్రులు వద్దు" అంటూ వేరు కాపురం కోసం భర్తను పీడించడం తీవ్రమైన 'మానసిక క్రూరత్వం' కిందకే వస్తుందని చెంపదెబ్బ లాంటి తీర్పు ఇచ్చింది.

కథలోకి వెళ్తే.. ఒక మహానుభావుడు తల్లిదండ్రులకు ఏకైక సంతానం. అంటే ఆ వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులకు ఉన్న ఒకే ఒక్క దిక్కు ఆ కొడుకే.. కానీ మన మేడమ్‌గారికి మాత్రం భర్త కావాలి గానీ ఆయనతో పాటు ఉచితంగా వచ్చే అత్తామామల బాధ్యత మాత్రం వద్దు. "వారిని రోడ్డున పడేసి నా వెంట రా" అని భర్తపై పదేపదే ప్రెజర్ కుక్కర్ లాంటి ఒత్తిడి పెంచింది. పోనీ భర్త ఏమైనా ససేమిరా అంటే.. వెంటనే మేకప్ బాక్స్, సూట్‌కేస్ పట్టుకుని పుట్టింటికి పరుగు తీసేది. ప్రతి చిన్న విషయానికీ "నేను మా అమ్మగారింటికి పోతున్నా" అని బెదిరించడం ఈమెకు ఒక హాబీగా మారింది.

చివరకు విసిగి వేసారిన ఆ భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయిస్తే.. "బాబు నీ బాధ వర్ణనాతీతం" అని విడాకులు ఇచ్చేసింది. ఆ తీర్పును తట్టుకోలేక మేడమ్ గారు హైకోర్టు తలుపు తడితే అక్కడ మరింత గట్టి షాక్ తగిలింది. కోర్టు ఈ కేసులో ఇచ్చిన పంచ్‌లు మామూలుగా లేవు. ఏకైక కొడుకు అంటే ఏటీఎం మిషన్ కాదని.. తల్లిదండ్రులను సాకాల్సిన బాధ్యత కొడుక్కి ఉంటుంది. భార్య వచ్చాక "ఆ పాత లగేజ్ అంతా బయట పడేయ్" అని ఒత్తిడి చేయడం తీవ్రమైన మనోవేదనకు గురిచేయడమే.

పుట్టిల్లు పర్మనెంట్ రిసార్ట్ కాదని హైకోర్టు హితవు పలికింది. పదే పదే ఊరికే పుట్టింటికి పారిపోవడం లవ్ స్టోరీల్లో హీరోయిజం కావచ్చు గానీ నిజ జీవితంలో అది సంసారాన్ని కూల్చే సైకలాజికల్ వార్‌ఫేర్ అని కోర్టు క్లారిటీ ఇచ్చింది. సర్దుబాటు లేని చోట సంసారం దండగ అని తీర్పునిచ్చేసింది. పెళ్లి అంటే కేవలం కలసి రీల్స్ చేసుకోవడం, షాపింగ్‌లు చేయడం కాదు. ఒకరి కుటుంబ బాధ్యతలను మరొకరు గౌరవించడమే నిజమైన దాంపత్యం అని క్లాస్ పీకింది.

మొత్తానికి భర్తను తల్లిదండ్రుల నుంచి వేరు చేసి 'ఒంటరి సొత్తు'గా మార్చుకోవాలనుకున్న ఆ కోడలికి హైకోర్టు సరిగ్గా బుద్ధి చెప్పింది. "అత్తామామలు వద్దు" అని భర్తను వేధించే లేడీస్‌ అందరికీ ఈ తీర్పు ఒక పక్కా హెచ్చరిక. ఇప్పటికైనా ఈ 'వేరు కాపురం' సెంటిమెంట్‌ను పక్కన పెట్టి, అత్తామామలను సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటే సంసారాలు నిలబడతాయి.. లేకపోతే కోర్టు మెట్లు ఎక్కాల్సిందే..