Begin typing your search above and press return to search.

హిందూ మతంలోకి తిరిగి మారితే ఎస్సీ సర్టిఫికెట్ హక్కు ఉంటుందా?

ఈ కేసు ఎం. రవికుమార్ వర్సెస్ డిస్ట్రిక్ట్ లెవల్ విజిలెన్స్ కమిటీకి సంబంధించినది. రవికుమార్ కుటుంబం మొదట హిందూ ఆదిద్రావిడ (ఎస్సీ) సమాజానికి చెందినది.

By:  A.N.Kumar   |   20 Sept 2026 11:57 AM IST
హిందూ మతంలోకి తిరిగి మారితే ఎస్సీ సర్టిఫికెట్ హక్కు ఉంటుందా?
X

క్రైస్తవ మతంలోకి మారిన అనంతరం తిరిగి హిందూ మతంలోకి వచ్చిన వ్యక్తికి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికెట్ వివాదంలో మద్రాస్ హైకోర్టు ఒక కీలక వ్యాఖ్య చేసింది. ఒక వ్యక్తి యొక్క మతాన్ని లేదా సామాజిక హోదాను ఆయన శారీరక లక్షణాలు, ఎత్తు, చర్మం రంగు, తమిళం లేదా ఇంగ్లిష్ మాట్లాడే సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా నిర్ణయించడం సరైన విధానం కాదని కోర్టు స్పష్టం చేసింది. మానవశాస్త్ర నిపుణుల పరిశీలన లేకుండా కేవలం రూపాన్ని బట్టి ముగింపునకు రావడం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.

కేసు నేపథ్యం ఏమిటి?

ఈ కేసు ఎం. రవికుమార్ వర్సెస్ డిస్ట్రిక్ట్ లెవల్ విజిలెన్స్ కమిటీకి సంబంధించినది. రవికుమార్ కుటుంబం మొదట హిందూ ఆదిద్రావిడ (ఎస్సీ) సమాజానికి చెందినది. ఆయన తండ్రి క్రైస్తవ మతంలోకి మారినప్పటికీ ఆ తర్వాత రవికుమార్ ఆయన తండ్రి ఆర్యసమాజ్ కేంద్రంలో నిర్వహించిన మత మార్పిడి కార్యక్రమం ద్వారా తిరిగి హిందూ మతంలోకి వచ్చారు. అనంతరం రవికుమార్ ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికెట్ పొంది.. ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు.

అయితే 2026 మేలో ఆయన పదవీ విరమణ చేయడానికి కొద్దికాలం ముందు విజిలెన్స్ కమిటీ ఆయన సర్టిఫికెట్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. రవికుమార్ కుటుంబ సభ్యులు తెల్లగా, పొడవుగా ఉండటం.. మంచి శరీరాకృతి కలిగి ఉండటం, జుట్టు వంకరగా ఉండటం.. ఇంగ్లిష్ మాట్లాడటం వంటి కారణాలను చూపిస్తూ వారు క్రైస్తవులేనని కమిటీ పేర్కొంది. దీనిని సవాలు చేస్తూ రవికుమార్ హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టు విచారణలో కీలక వ్యాఖ్యలు

ఒక వ్యక్తి హిందూ పూజలు చేస్తున్నాడా లేదా క్రైస్తవ ఆచారాలు పాటిస్తున్నాడా అనేవి పరిశీలించదగ్గ అంశాలు కావచ్చు కానీ శారీరక రూపాన్ని బట్టి మతాన్ని నిర్ణయించడం తీవ్ర అభ్యంతరకరమని కోర్టు పేర్కొంది. రవికుమార్ తన వివాహం, కుమార్తె వివాహం హిందూ సంప్రదాయాల ప్రకారమే జరిగాయని ఆధారాలు చూపారు. కమిటీ పేర్కొన్న ఆధారాలలో కూడా స్పష్టత లేదని.. ఉదాహరణకు 1994 రేషన్ కార్డులో రవికుమార్ కుమార్తె పేరు ఉన్నట్లు కమిటీ చెప్పగా.. ఆ సమయానికి ఆయనకు కుమార్తె జన్మించలేదని పిటిషనర్ నిరూపించారు.

తీర్పు యొక్క ముఖ్య ఉద్దేశం

విజిలెన్స్ కమిటీ ఉత్తర్వులను రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు, రవికుమార్‌కు వ్యక్తిగత విచారణకు అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఆయన సమర్పించే ఫొటోలు, పత్రాలు, ఇతర ఆధారాలను నిబంధనల ప్రకారం విచారించి 8 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

ఈ తీర్పు "క్రైస్తవం నుంచి హిందూ మతంలోకి మారగానే ఆటోమేటిక్‌గా ఎస్సీ సర్టిఫికెట్ వస్తుంది" అని చెప్పలేదు. కేవలం విచారణ ప్రకారమే కమ్యూనిటీ హోదాను నిరూపించుకోవాలని, శారీరక రూపం ఆధారంగా మతాన్ని నిర్ణయించకూడదని మాత్రమే తీర్పు స్పష్టం చేసింది.