Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కు పళ్లెంలో పెట్టి అధికారం.. బీజేపీ ఓడబోయే మరో రాష్ట్రం అదే

శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా ఉండగా.. 2013లో మధ్యపద్రేశ్‌ లో బీజేపీ సర్కారు హయాంలో వ్యాపమ్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

By:  Tej   |   16 July 2023 9:39 AM GMT
కాంగ్రెస్ కు పళ్లెంలో పెట్టి అధికారం.. బీజేపీ ఓడబోయే మరో రాష్ట్రం అదే
X

రాజకీయాల్లో కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి.. ఓడిపోయే పార్టీ ఏది..? గెలవబోయే పార్టీ ఏది..? అని ముందే స్పష్టంగా తెలిసిపొతుంటుంది. ఉదాహరణకు ఇటీవల కర్ణాటక ఎన్నికలే తీసుకోండి.. కొన్ని నెలలు ఆ మాటకొస్తే ఏడాది కిందటే బీజేపీ ఓడిపోతున్నదని తేలిపోయింది. పేసీఎం ఆరోపణలు.. విచ్చలవిడి అవినీతి.. ప్రజల జీవితాల్లోకి చొరబాటు.. సీఎం మార్పు.. దిగ్గజ నాయకుడు యడియూరప్పను పక్కనపెట్టడం.. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ కర్ణాటకలో బీజేపీ చేజేతులా ఓడింది. అసలు ప్రభుత్వం పనితీరే సరిగా లేదనే భావన వ్యాపించాక ఇక గెలుపు అనే మాటే ఉండదు. కర్ణాటకలో అదే జరిగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే గెలిచిపోయింది. ఆ తర్వాత జరిగినదంతా మెజారిటీ ఎంత అనేదే..?

అక్కడ కూడా అలాంటి పరిస్థితే..

కర్ణాటకలోలాగే మరో రాష్ట్రం కూడా బీజేపీ చేజారుతున్నదని పరిణామాలు చాటుతున్నాయి. అవినీతి ఆరోపణలు.. ఒకదానివెంట ఒకటి వివాదాలు.. ప్రతిపక్ష పార్టీని చీల్చి.. ప్రభుత్వాన్ని పడదోసి అధికారంలోకి రావడం.. అచ్చం కర్ణాటకలాగే ఆ రాష్ట్రంలోనూ ఘటనలు జరుగుతున్నాయి. ఇక సీఎం మీద ఆరోపణలు లేకున్నా.. ఆయన గొప్పగా ఏమీ పాలించడం లేదనే చెడ్డ పేరొచ్చింది.

ఇదీ సర్కారు తీరు..

పైన చెప్పుకొన్నదంతా మధ్యప్రదేశ్ గురించి. 2018 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఓడిపోయింది. కానీ, కాంగ్రెస్ నుంచి జ్యోతిరాదిత్య సింధియాను లాక్కుని మళ్లీ అధికారం చేపట్టింది. అయితే, పనితీరు మాత్రం అంతంతే అని తెలిసిపోతోంది. దీనికి పెద్ద ఉదాహరణ.. ఇటీవల గిరిజనుడిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన. ఇందులో నిందితుడి ఇంటిని ఆగమేఘాల మీద కూల్చివేసిన ప్రభుత్వ యంత్రాంగం.. బాధితుడు ఎవరనేది కచ్చితంగా గుర్తించడంలో విఫలమైంది. దీంతో ఒకరి బదులు మరొకరిని సీఎం వద్దకు పంపింది. సీఎం ఏకంగా ఆ బాధితుడి కాళ్లుకడిగి వార్తల్లో నిలిచారు. తీరా చూస్తే.. అతడు అసలు బాధితుడే కాదు. ఈ ఉదంతం మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేసింది.

పదేళ్ల తర్వాత మళ్లీ వ్యాపమ్..?

శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎంగా ఉండగా.. 2013లో మధ్యపద్రేశ్‌ లో బీజేపీ సర్కారు హయాంలో వ్యాపమ్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నాడు ఉద్యోగ నియామకాల బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన పలు పరీక్షల్లో రాజకీయ నాయకులు, అధికారులు డబ్బు కోసం అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. ఏకంగా వెయ్యి ఎఫ్‌ఐఆర్‌ లు నమోదయ్యాయి. పలు కోర్టుల్లో కేసులు నడుస్తూనే ఉన్నాయి.

మళ్లీ ఇదే తరహా కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవలి నియామక పరీక్షలో టాపర్లుగా నిలిచినవారిలో చాలామంది ఒకే కేంద్రంలో పరీక్ష రాయడం గమనార్హం. అంతేగాక అది బీజేపీ ఎమ్మెల్యే సంజీవ్‌ కుశ్వాహాకు చెందిన కాలేజీ కావడంతో పెద్ద వివాదం రేగింది.

మధ్యప్రదేశ్ లో గ్రూప్ 2, గ్రూప్ 4 పట్వారీ పరీక్ష ఫలితాలను జూన్‌ 30న విడుదల చేశారు. టాపర్లుగా నిలిచిన 10 మంది జాబితా చూస్తే ఏడుగురు ఎమ్మెల్యేకు చెందిన గ్వాలియర్‌ ఎన్‌ ఆర్‌ఐ కాలేజీలో పరీక్ష రాసినట్లు తెలిసింది. టాపర్ల రోల్ నంబర్లు 2488 7991 నుంచి 2488 9693 మధ్యే ఉన్నాయి. ఒకేచోట పరీక్ష రాసిన దాదాపు 1,700 మంది అభ్యర్థుల్లో ఏడుగురు టాప్ -10లో నిలిచారు. వీరంతా జవాబు పత్రంలో హిందీలో సంతకం చేసి.. పరీక్షను ఆంగ్లంలో రాశారు. దీంతో మొత్తం పరీక్ష నిర్వహణపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అంతేగాక పరీక్ష నిర్వహించిన కంపెనీని కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌ లిస్ట్ లో పెట్టినట్లు కథనాలు వచ్చాయి. అయినా పరీక్ష నిర్వహణ కోసం ఆ సంస్థకే టెండర్‌ అప్పగించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

ఇవన్నీ వ్యతిరేక పవనాలే..

గిరిజనుడిపై దాడిలో ప్రభుత్వ ప్రమేయం లేకున్నా.. అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగి వ్యవహారంగా భావించినా.. అనంతరం ప్రభుత్వం వ్యవహరించిన తీరే నవ్వులపాల్జేసింది. ఇదొక్కటే గాక.. బడుగు వర్గాలపై మధ్యప్రదేశ్ లో దాడులు జరిగిన ఉదంతాలు ఇంకొన్ని వెలుగుచూశాయి. ఒకదాని వెనుక ఒకటిగా చుట్టుముడుతున్న వివాదాలు మధ్యప్రదేశ్ లో ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయి. చివరకు ఇది ఎన్నికల్లో ప్రభావం పడేందుకు కారణమైనా ఆశ్చర్యం లేదు.