ఫ్యూచర్ సిటీగా మధురవాడ
మధురవాడ పరిసర ప్రాంతాలలో ఒక దశాబ్దం క్రితం వరకూ గజం స్థలం పది వేల నుంచి పదిహేము వేలుగా ఉండేది.
By: Satya P | 12 Oct 2025 9:29 AM ISTవిశాఖలో మధురవాడ ఇపుడు మహా గొప్పగా వెలిగిపోతోంది. కొన్నేళ్ళ క్రితం అయితే ఈ ప్రాంతాన్ని విశాఖకు శివారు గా అంతా చెప్పుకునేవారు. కానీ ఇపుడు విశాఖ కంటే ఎక్కువ యాక్టీటీస్ ఇక్కడే చోటు చేసుకుంటున్నాయి. ప్రతిష్టాత్మకమైన ఐటీ కంపెనీలు మధురవాడలోనే ఏర్పాటు అవుతున్నాయి. ఇంఫోసిస్, టీసీఎస్ వంటివి మధురవాడ వైభోగాన్ని చాటి చెబుతున్నాయి. అదే విధంగా గూగుల్ డేటా సెంటర్ మధురవాడకు సమీపంలో ఆనందపురం దగ్గర ఏర్పాటు అవుతోంది. ఇవి కనుక వర్క్ స్టార్ట్ చేస్తే విశాఖ కంటే మధురవాడకే ఎక్కువ ప్రయారిటీ వస్తుందని అంటున్నారు.
అందుకున్న రియల్ బూమ్ :
మధురవాడ పరిసర ప్రాంతాలలో ఒక దశాబ్దం క్రితం వరకూ గజం స్థలం పది వేల నుంచి పదిహేము వేలుగా ఉండేది. అంతే కాదు అపార్టుమెంట్ ప్లాట్స్ చూసినా చదరపు అడుగు వేయి రూపాయలు మించి పలికేది కాదు. కానీ ఇపుడు మారిన పరిస్థితులు అభివృద్ధి అంతా ఇక్కడే కేంద్రీకృతం కావడంతో అమాంతం భూముల ధరలు పెరిగిపోయాయి. అంతే కాదు ఈ రోజున గజం లక్ష రూపాయలు పై దాటి ఇక్కడ ఉంటే ఫ్లాట్ ఎస్ ఎఫ్ టీ కూడా ఆరేడు వేలకు మించి ఉంది. ఇదంతా రియల్ బూమ్ అని అంటున్నారు. మధురవాడలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం తో పాటు మాల్స్ కూడా వెనక వైపున రావడంతో అటు బీచ్ రోడ్ కి ఇటు మెయిన్ రోడ్ కి మధ్యన ఉండడం కూడా బాగా కలసి వస్తోంది అని అంటున్నారు.
మరో గచ్చీ బౌలీగా :
ఇవన్నీ పక్కన పెడితే రాజకీయ పార్టీల నేతలు మధురవాడ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. భీమిలీ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం మధురవాడ ఉంది. దాంతో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని మరో గచ్చీ బౌలీగా పోలుస్తున్నారు హైదరాబాద్ లో హైటెక్ సిటీ గచ్చీ బౌలీ తరహాలో రానున్న కాలంలో మధురవాడ మారుతుందని ఆయన నమ్మకంగా చెబుతున్నారు అన్ని రకాలైన అభివృద్ధికి మధురవాడ కేంద్ర బిందువుగా ఉందని ఆయన అంటున్నారు.
నియోజకవర్గ కేంద్రంగా :
మరో వైపు మధురవాడ గురించి రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. 2027లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో మధురవాడ ప్రత్యేక నియోజకవర్గంగా మారుతుందని అంటున్నారు. అంటే భీమిలీ నుంచి వేరుపడి మధురవాడ సింహాచలం తదితర ప్రాంతాలను కలుపుకుని ఒక బ్రహ్మాండమైన అసెంబ్లీ సీటుగా మారబోతోంది అని అంటున్నారు.
పోటీకి తయారు :
ఈ లెక్కలు అన్నీ చూసుకుంటున్న రాజకీయ నెతలు అంతా మధురవాడ మీద అపుడే కర్చీఫ్ పరచేశారు. మధురవాడ ప్రత్యేక నియోజకవర్గం అయితే పోటీకి చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయితే చాలు ఆ పదవి మంత్రికి సరి సాటి అని కూడా అంటున్నారు. వెల్ డెవలప్డ్ ప్రాంతంగా మధురవాడ మారబోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే పవర్స్ మామూలుగా ఉండవని కూడా అంటున్నారు. భీమిలీ మూడు లక్షల మంది ఓటర్లతో అతి పెద్ద నియోజకవర్గంగా ఉంది. దాంతో కచ్చితంగా రెండు చేస్తారని ఆ రెండవది మధురవాడ అవుతుందని అంటున్నారు. మరి మధురవాడ పేరులోనే స్వీట్ ఉంది, మరి ఈ సీటు రెడీ అయితే దీనిని అధిష్టించేది ఎవరో చూడాలి మరి.
