పాలిటిక్స్ నుంచి స్పోర్ట్స్ దిశగా.. మాధవీలత యూటర్న్!
ఈ సందర్భంగా ఆమె కీలక విషయాన్ని వెల్లడించారు. ``ఆరేళ్ల క్రితం, భుజానికి తగిలిన తీవ్రమైన గాయం నేను ఊహించని రీతిలో నన్ను సవాలు చేసింది.
By: Garuda Media | 25 Jun 2026 5:00 AM ISTబీజేపీ తెలంగాణ నాయకురాలు, ఫైర్ బ్రాండ్ మాధవీలత.. అనూహ్యంగా స్పోర్ట్స్ క్రీడాకారిణి అవతారం ఎత్తారు. షూటింగ్ క్రీడా రంగంలో ఆమె ప్రావీణ్యం సంపాయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే.. ఈ నిర్ణయం బీజేపీ సహా రాజకీయ వర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోంది. ఎందుకంటే పొలిటికల్‌గా మాధవీలత వ్యాఖ్యలు.. ఆమె హావ భావాలు వంటివి రాజకీయంగా హైలెట్. బీజేపీలో ఆమె ఒక ఐకాన్ నాయకురాలిగా వ్యవహరిస్తారన్న పేరుంది.
తిరుపతికి రైల్లో ప్రయాణించినా.. కాలినడకన యాదగిరికి చేరుకున్నా.. మాధవీలత స్టయిల్ వేరుగా ఉంటుంది. ఆమె ఇప్పుడు పొలిటికల్ కెరీర్‌ను పక్కన పెట్టారో లేక క్రీడలవైపు మొగ్గు చూపారో తెలియదు కానీ.. సవాళ్లను తనకు అనుకూలంగా మార్చు కునే ప్రయత్నంలో ఉన్నానని మాత్రం వెల్లడించారు. ఈ క్రమంలో షూటింగ్ స్పోర్ట్స్ వైపు అడుగులు వేసినట్టు తెలిపారు. తాజాగా ఆమె షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె కీలక విషయాన్ని వెల్లడించారు. ``ఆరేళ్ల క్రితం, భుజానికి తగిలిన తీవ్రమైన గాయం నేను ఊహించని రీతిలో నన్ను సవాలు చేసింది. పరిమితులను అంగీకరించకుండా, నేను ఒక స్పోర్ట్స్ పిస్టల్‌ను చేతిలోకి తీసుకుని, సాధించాల్సి న ఒక కొత్త లక్ష్యాన్ని నాకు నేను నిర్దేశించుకున్నాను. జీవితం అంటే సవాళ్లను తప్పించుకోవడం కాదు, వాటిని స్వీకరించడమే. వయసు ఒక అడ్డంకి కాదు. ఎదురుదెబ్బలు అవరోధాలు కావు. మనం మళ్లీ పైకి లేవలేమనే నమ్మకమే ఏకైక నిజమైన అడ్డంకి.`` అని మాధవీ లత పేర్కొన్నారు.
అలానే.. ``నేను 12వ తెలంగాణ రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్‌షిప్ లోకి అడుగుపెడుతున్నప్పుడు, ఈ ప్రయాణం గెలుపు ఓట ముల గురించి కాదు. ఇది క్రమశిక్షణ, పట్టుదల, అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగే ధైర్యం. నా ఈ ప్రయాణం, ఒకప్పుడు అసాధ్యమని భావించిన సవాలును స్వీకరించడానికి ఒక్క మహిళకైనా, ఒక్క యువకుడికైనా, లేదా ఒక్క భారత పౌరుడికైనా స్ఫూర్తినిస్తే, ఈ ప్రయత్నం సార్థకమైనట్లే.`` అని మాధవీ లత పేర్కొన్నారు.
కాగా.. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుంచి పోటీ చేసిన మాధవీ లత పరాజయం పాలయ్యారు. ఎంఐఎంకు కంచుకోట వంటి హైదరాబాద్‌లో ఆమె అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేశారు. మాధవీలత. ఎన్నికల ప్రచారంలో ఆమె వేసిన బాణం.. చేసిన సైగలు ఇప్పటికీ పాతబస్తీవాసులకు నవ్వులు తెప్పిస్తూనే ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో వచ్చిన పలు పొలిటికల్ విషయాలు ఆమెను వివాదంలోకి నెట్టినా.. ఆమె వాటికి తనదైన సమాధానం ఇస్తూనే ఉన్నారు.
