Begin typing your search above and press return to search.

ఇరాన్ యుద్ధంపై ఫ్రాన్స్ అధ్యక్షుడి మాట వింటే గుండెల్లో గుబులు

తాము కోరుకున్న అధిక్యతను సొంతం చేసుకోవటానికి మొదలుపెట్టే ఈ యుద్ధాలు ప్రపంచ మానవాళికి శాపంగా మారుతుంటాయి.

By:  Garuda Media   |   10 March 2026 11:24 AM IST
ఇరాన్ యుద్ధంపై ఫ్రాన్స్ అధ్యక్షుడి మాట వింటే గుండెల్లో గుబులు
X

కొందరు యుద్ధాన్ని పులిస్వారీతో పోలుస్తారు. ఒకసారి స్వారీ మొదలైతే.. దాన్ని ఆపటం అంత తేలికైన విషయం కాదు. స్వారీని మధ్యలో ఆపలేం. అలా అని కొనసాగించని పరిస్థితి. యుద్ధం కూడా అంతే మొదలు మాత్రమే మన చేతిలో ఉంటుంది. కానీ.. ముగింపు అంత తేలికైన విషయం కాదు. అందుకే యుద్ధంలో విజేత అన్నోడు ఎవరూ ఉండరు. ఒకవేళ గెలుపోటములపై స్పష్టత వచ్చినా.. గెలిచినోడు ఇంట్లో ఏడిస్తే.. ఓడినోడు బయట ఏడుస్తాడంతే. నాగరిక ప్రపంచంలో నిజమైన విజయం వార్ తో కానే కాదన్న విషయం తెలిసినప్పటికి.. అగ్రరాజ్యాలు.. ధనిక దేశాల తీరుతో తప్పని పరిస్థితి. తాము కోరుకున్న అధిక్యతను సొంతం చేసుకోవటానికి మొదలుపెట్టే ఈ యుద్ధాలు ప్రపంచ మానవాళికి శాపంగా మారుతుంటాయి.

ఇటీవల మొదలైన ఇరాన్ -ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రపంచంపై తన ప్రభావాన్ని చూపించటం ఇప్పటికే షురూ అయ్యింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఈ యుద్ధం తాలుకూ ప్రభావం ప్రపంచ దేశాలపై బలంగా పడుతోంది. తొలుత అనుకున్నట్లు రోజుల్లో కాకున్నా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లు నాలుగైదు వారాల్లో ముగిసే పరిస్థితి కనిపించటం లేదు. ఒకదశలో నాలుగు వారాలు.. అంతకంటే తక్కువ సమయంలోనే యుద్ధం ముగిసే వీలుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అవసరమైతే యుద్ధాన్ని మరింత కాలం కొనసాగే అవకాశం ఉందన్న హెచ్చరికను చేశారు.

ఏమైనా తాము కోరుకున్న మార్పు.. తాము పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకూ యుద్దం సాగుతుందన్న స్పష్టమైన సంకేతాల్ని ఆయన ఇవ్వటం తెలిసిందే. ఇప్పటికే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని చాలావరకు దెబ్బ తీశామని.. యుద్ధం తనలక్ష్యానికి చాలా దగ్గరగా ఉందన్న ట్రంప్.. ఇరాన్ తన క్షిపణి.. నౌకదళ సామర్థ్యాన్ని కోల్పోయినట్లుగా పేర్కొన్నారు. ఇరాన్ నాయకత్వం కూడా దెబ్బ తిందన్న ఆయన.. ఇరాన్ నుంచి షరతులు లేని లొంగుబాటు మాత్రమే యుద్ధానికి సరైన ముగింపుగా పేర్కొంటున్నారు. అలాంటి పరిస్థితి నిజంగా ఉందా? అంటే సందేహమే.

ఎందుకంటే.. ఇరాన్ పై వార్ అన్నది అమెరికా అధ్యక్షుడికి చిన్న విహారయాత్రగా పేర్కొంటున్నారు. అయితే.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఇరాన్ పై జరుగుతున్న యుద్దంగా ఆయన తన ఆందోళనను వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వార్ ముగిసే అవకాశాల్లేవన్న ఆయన.. ‘‘ఈ యుద్ధం ప్రస్తుత తీవ్రస్థాయిలో ఇంకా చాలా రోజులు.. బహుశా పలు వారాల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇది పూర్తిగా ప్రతి పక్షం తమ తుది లక్ష్యాన్ని ఎలా నిర్వచిస్తుందనే దానిపై ఆధారపడి ఉంది. అంతిమంగా ఏ తుదిస్థితిని సాధించాలనుకుంటున్నారో.. అదే ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగాలో డిసైడ్ చేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగా.. ఫ్రాన్స్ ఈ సంఘర్షణలో ప్రత్యక్షంగా పాల్గొనటం లేదని ఆయన స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యంలో శాంతి పునరుద్దరణకు ప్రయత్నిస్తామన్న ఆయన.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం డి-ఎస్కలేషన్ పై ఫోకస్ చేయాలన్న మాట ఫ్రాన్స్ పదే పదే చెబుతుండటం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ఇరాన్ పై జరుగుతున్న యుద్ధం ట్రంప్ చెప్పినంత సింఫుల్ గా ముగియదన్న విషయాన్ని తేల్చటమే కాదు.. ప్రపంచం మరిన్ని గడ్డు పరిస్థితులకు సిద్ధం కావాలన్న మాటను నేరుగా కాకున్నా.. చెప్పకనే చెప్పేశారు ఫ్రాన్స్ అధ్యక్షుడు.