Begin typing your search above and press return to search.

దావోస్ లో కళ్లద్దాలు పెట్టుకున్న ప్రెసిడెంట్ సారీ ఎందుకు చెప్పారు..!

ప్రపంచ ఆర్థిక వేదికలో ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ఫ్రెంచ్ నాయకుడు నీలిరంగులోని ఏవియేటర్ సన్ గ్లాసెస్ ధరించారు.

By:  Raja Ch   |   21 Jan 2026 11:45 PM IST
దావోస్  లో కళ్లద్దాలు పెట్టుకున్న ప్రెసిడెంట్  సారీ ఎందుకు చెప్పారు..!
X

స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వద్ద ప్రధానంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ధరించిన కళ్లద్దాలపై పెద్ద ఎత్తున చర్చ జరగడం గమనార్హం. ఓ పక్క అమెరికా అధ్యక్షుడి ప్రసంగం.. మరోవైపు ఎన్నో కీలక విషయాలు, వ్యాపారాలపై చర్చలు జరుగుతున్న వేళ.. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కళ్లద్దాలు చర్చనీయాంశం అవ్వడం.. ఆయన సారీ చెప్పడం వైరల్ ఇష్యూగా మారింది. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దామ్...!

అవును... దావోస్ శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. గ్రీన్‌ ల్యాండ్‌ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రతిపాదిస్తున్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఎనిమిది యూరోపియన్ దేశాలపై సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ చేసిన బెదిరింపును తీవ్రంగా ఖండించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు. అదంతా ఒకెత్తు అయితే... మాక్రాన్ ప్రసంగంలోని మరొక అంశం కూడా ప్రత్యేకంగా నిలిచింది.. అదే ఆయన కళ్లజోడు ఎంపిక!

ప్రపంచ ఆర్థిక వేదికలో ప్రపంచ నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు ఫ్రెంచ్ నాయకుడు నీలిరంగులోని ఏవియేటర్ సన్ గ్లాసెస్ ధరించారు. ఈ సమయంలో దీనిపై సోషల్ మీడియా వేదికగానూ కామెంట్లు మొదలైపోయాయి. ఈ సందర్భంగా... "జాగ్రత్త ట్రంప్.. అక్కడ మాక్రాన్ ఉన్నారు" అని ఒకరు కామెంట్ చేస్తే... "ఆయనకు అంతకు మించి గొప్ప కలెక్షన్ ఆప్షన్ దొరకలేదా" అని మరొకరు స్పందించారు. ఈ నేపథ్యంలో.. మాక్రాన్ వివరణ ఇచ్చారు.

తన కళ్లద్దాలపై దావోస్ వేదికగా, ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న వేళ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్పందించారు. ఇందులో భాగంగా... ఈ కళ్లద్దాలు పెట్టుకున్నందుకు తనను క్షమించాలని.. తనకు చిన్నపాటి కంటి సమస్య ఉందని వెల్లడించారు. కాగా... కొన్నిరోజుల క్రితం కూడా ఆయన కన్ను ఎర్రగా వాచి కనిపించింది. అప్పుడు కూడా కొద్దిసేపు ఈ అద్దాలు ధరించారు. ఈ క్రమలోనే అది కంటిన్యూ చేసినట్లు చెబుతున్నారు.

ఫ్రెంచ్ నివేదికల ప్రకారం.. మాక్రాన్ కంటిలో సబ్-కంజక్టివల్ హెమరేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ప్రమాదకరం కాదు.. నొప్పి ఉండదు.. దృష్టిని ప్రభావితం చేయదు.. సాధారణంగా రెండు మూడు వారాల్లోపే తగ్గిపోతుంది.. కానీ, కొన్నిసార్లు తుమ్మినప్పుడు లేదా గట్టిగా దగ్గినప్పుడు కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది. ప్రధానంగా.. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు ఈ పరిస్థితితో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు!