Begin typing your search above and press return to search.

స్లీపర్ బస్ ను ఓయో రూమ్ చేద్దామనుకున్న లవర్స్.. ట్విస్ట్ ఇదే

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును 'ఓయో' రూమ్‌గా మార్చుకోవాలని చూసిన ఒక ప్రేమజంట.. చివరకు డ్రైవర్‌పై దాడి చేసి పోలీసు కేసు వరకు వెళ్లిన ఘటన మచిలీపట్నంలో కలకలం రేపింది.

By:  A.N.Kumar   |   17 Feb 2026 4:05 PM IST
స్లీపర్ బస్ ను ఓయో రూమ్ చేద్దామనుకున్న లవర్స్.. ట్విస్ట్ ఇదే
X

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును 'ఓయో' రూమ్‌గా మార్చుకోవాలని చూసిన ఒక ప్రేమజంట.. చివరకు డ్రైవర్‌పై దాడి చేసి పోలీసు కేసు వరకు వెళ్లిన ఘటన మచిలీపట్నంలో కలకలం రేపింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా నిబంధనలు అమలు చేయాలని చూసిన డ్రైవర్‌పై ఆ జంట విచక్షణారహితంగా దాడికి పాల్పడింది.

అసలేం జరిగింది?

హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రేమజంట మచిలీపట్నం వెళ్లేందుకు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులో టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే స్లీపర్ బస్సుల్లో అపరిచిత వ్యక్తులైన స్త్రీ, పురుషులకు పక్కపక్క సీట్లు కేటాయించరనే నిబంధనను దాటవేసేందుకు యువకుడు ఒక పథకం వేశాడు. టికెట్ బుకింగ్ సమయంలో తనను కూడా యువతిగానే చూపిస్తూ ఫిమేల్ కోటాలో రెండు సీట్లు బుక్ చేశాడు.

గుట్టు రట్టు చేసిన డ్రైవర్

బస్సు బయలుదేరిన తర్వాత టికెట్లు తనిఖీ చేస్తున్న సమయంలో డ్రైవర్ అసలు విషయాన్ని గుర్తించాడు. పక్కపక్క సీట్లలో యువతీ యువకులు ఉండటం, ఐడీ కార్డులు పరిశీలించినప్పుడు యువకుడు తప్పుడు వివరాలతో బుక్ చేశాడని తెలియడంతో డ్రైవర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిబంధనల ప్రకారం వేర్వేరు లింగాల వారు పక్కపక్కనే ప్రయాణించడం కుదరదని స్పష్టం చేయడంతో జంట వాగ్వాదానికి దిగింది. ఇతర ప్రయాణికులు నచ్చజెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది.

రెచ్చగొట్టిన ప్రియురాలు.. దాడి చేసిన ప్రియుడు

బస్సు మచిలీపట్నంలోని చిలకలపూడి సెంటర్‌కు చేరుకోగానే అసలు కథ మొదలైంది. ప్రయాణంలో తమను అడ్డుకున్నాడన్న కోపంతో యువతి తన ప్రియుడిని రెచ్చగొట్టింది. ఆమె మాటలతో ఆవేశానికి లోనైన యువకుడు, బస్సు దిగగానే డ్రైవర్‌పై భౌతిక దాడికి దిగాడు. విచక్షణారహితంగా కొట్టడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

పోలీసుల రంగప్రవేశం

బాధిత డ్రైవర్ ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనల ఉల్లంఘనతో పాటు విధి నిర్వహణలో ఉన్న వ్యక్తిపై దాడి చేసినందుకు సదరు యువకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.