మాచర్లలో హైవోల్టేజ్ పాలిటిక్స్.. !
నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం లేకుండా పోయిందని.. ఎమ్మెల్యే బ్రహ్మానెందరెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారని పిన్నె ల్లి చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
By: Garuda Media | 5 April 2026 10:00 PM ISTపల్నాడు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం మాచర్లలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ సెగలు కక్కుతూనే ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నా.. టీడీపీ పాలన సాగించినా.. పల్నాడులో అత్యంత వివాదాస్పద నియోజకవర్గంగా రికార్డుల్లో ఉన్న నియోజ కవర్గం మాచర్లే. రాజకీయ పార్టీల కంటే కూడా వ్యక్తిగత వైరుధ్యాలు.. సొంత పాలిటిక్స్ ఇక్కడ ఎక్కువగా సాగుతున్నాయి.
సుదీర్ఘకాలం వరుసగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫ్యామిలీ మాచర్లలో చక్రం తిప్పింది. ఇక, పిన్నెల్లి ఆధిపత్యానికి గండి కొట్టాలన్న ఏకైక అజెండాతో టీడీపీ కూడా అదేతరహా దూకుడు ప్రదర్శించింది. గత ఎన్నికల సమయంలో మాచర్లలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక, గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ చాలా కాలం తర్వాత.. విజయం దక్కించుకుంది. మరోవైపు.. వైసీపీ నేత.. పిన్నెల్లి పలు కేసుల్లో చిక్కుకు ని జైలుకు వెళ్లారు. ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు.
ఈ క్రమంలో తాజాగా నియోజకవర్గం మాటల తూటాలు పేలుతున్నాయి. నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం లేకుండా పోయిందని.. ఎమ్మెల్యే బ్రహ్మానెందరెడ్డి అరాచకాలకు పాల్పడుతున్నారని పిన్నె ల్లి చేసిన వ్యాఖ్యలు.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనికి ప్రతిగా బ్రహ్మా రెడ్డి.. పిన్నెల్లి పై చార్జిషీట్ పేరుతో గతంలో జరిగిన అక్రమాలు.. అన్యాయాలు.. హత్యలు వంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకువచ్చారు.
వరుస ప్రెస్‌మీట్లు పెట్టి.. పిన్నెల్లిని ఏకేస్తున్నారు. అంతేకాదు.. వైసీపీ ఇక్కడ పూర్తిగా నిర్వీర్యమైందని.. రౌడీలు మాత్రమే పార్టీని నడిపిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇది ప్రస్తుతం నియోజకవర్గంలోఇరు వర్గాల సమస్యగానే కాకుండా.. పెద్ద వివాదంగా మారుతోంది. ప్రస్తుతం పిన్నెల్లి వర్గం కౌంటర్ ఇవ్వకపోయినా.. ఏ క్షణాన ఏంజరుగుతుందో అనే వివాదం మాత్రం సాగుతోంది. మరోవైపు.. పిన్నెల్లిపై మరిన్ని కేసులు నమోదు చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
వైసీపీ హయాంలో టీడీపీ సానుభూతి పరులను నియోజకవర్గం నుంచి వెళ్లగొట్టారు. అనంతరం.. వారిపై దాడులు కూడా జరిగాయి. ఈ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి స్వయంగా వారిని తీసుకువచ్చారు. ఇప్పుడు వారే.. పోలీసులకు పిన్నెల్లిపై ఫిర్యాదులు చేయాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. సో.. మొత్తంగా నియోజకవర్గంలో మళ్లీ హైవోల్టేజీ రాజకీయాలు ముసురుకున్నాయి.
