Begin typing your search above and press return to search.

0001 నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు పెట్టిన గుంటూరు వాసి

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. వీఐపీ నంబర్ ప్లేట్లు ఇప్పుడు కేవలం అంతస్తుకు చిహ్నాలు మాత్రమే కాదు.. అవి ప్రీమియం లైఫ్‌స్టైల్ అసెట్స్‌గా మారుతున్నాయి.

By:  A.N.Kumar   |   2 Feb 2026 11:58 PM IST
0001 నంబర్ ప్లేట్ కోసం రూ. 2.08 కోట్లు పెట్టిన గుంటూరు వాసి
X

సాధారణంగా ఒక లగ్జరీ కారు ధర కోట్లలో ఉండటం చూస్తుంటాం. కానీ కేవలం కారు నంబర్ ప్లేట్ కోట్లు పలికితే? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఒక వ్యాపారవేత్త ఏకంగా రూ. 2.08 కోట్లు వెచ్చించి 'DDC 0001' అనే వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను సొంతం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా వాహన రిజిస్ట్రేషన్ నంబర్ల వేలంలో ఇది ఒక సరికొత్త రికార్డుగా నిలిచింది.

డిజిటల్ వేలంలో హోరాహోరీ

ప్రముఖ లగ్జరీ కార్ల డీలర్, ఆక్షన్ ప్లాట్‌ఫామ్ 'బిగ్ బాయ్ టాయ్స్' తమ మొబైల్ యాప్ ద్వారా నిర్వహించిన డిజిటల్ వేలంలో ఈ అరుదైన నంబర్ ప్లేట్ అమ్మకానికి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న కార్ల ప్రేమికులు, కలెక్టర్లు ఈ వేలంలో పాల్గొనగా గుంటూరుకు చెందిన కొనుగోలుదారు అత్యధిక ధరను కోట్ చేసి ఈ ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకున్నారు.

చిన్న నగరాల్లో పెరుగుతున్న 'లగ్జరీ' క్రేజ్

ఒకప్పుడు ఇలాంటి ఖరీదైన వేలాలు కేవలం ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాలకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు టైర్-2 నగరమైన గుంటూరు నుంచి ఇంతటి భారీ బిడ్ రావడం మార్కెట్ నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. ఇది చిన్న పట్టణాల్లో కూడా పెరిగిన సంపదకు, మారుతున్న జీవనశైలికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.

కేవలం స్టేటస్ మాత్రమే కాదు.. ఒక ఇన్వెస్ట్‌మెంట్!

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. వీఐపీ నంబర్ ప్లేట్లు ఇప్పుడు కేవలం అంతస్తుకు చిహ్నాలు మాత్రమే కాదు.. అవి ప్రీమియం లైఫ్‌స్టైల్ అసెట్స్‌గా మారుతున్నాయి. 0001 వంటి నంబర్లు వాహనానికి ఒక విలక్షణమైన గుర్తింపును ఇస్తాయి. కాలక్రమేణా ఇలాంటి అరుదైన నంబర్ల విలువ పెరుగుతుండటంతో వీటిని ఒక ఇన్వెస్ట్‌మెంట్‌గా కూడా కొందరు చూస్తున్నారు. గతంలో ప్రభుత్వ వేలాల ద్వారా మాత్రమే లభించే ఇవి.. ఇప్పుడు ప్రైవేట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా లభ్యం కావడంతో వేలంలో పాల్గొనడం సులభమైంది. "భారత్‌లో హై-ఎండ్ బిడ్డింగ్ సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఈ రికార్డు స్థాయి బిడ్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పట్ల కొనుగోలుదారులకు ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది." అని బీబీటీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

డిజిటల్ బిడ్డింగ్ ప్రక్రియ మరింత సులభతరం కావడంతో భవిష్యత్తులో మరిన్ని ఫ్యాన్సీ నంబర్లు ఇలాంటి భారీ ధరలను పలికే అవకాశం ఉంది. ప్రస్తుతం గుంటూరు వాసి దక్కించుకున్న ఈ DDC 0001' నంబర్ ప్లేట్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.