Begin typing your search above and press return to search.

విశాఖ దశ తిరిగింది!

విశాఖలో మరో ప్రతిష్టాత్మకమైన సంస్థగా లులూ మెగా షాపింగ్ మాల్ రాబోతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో లులూ ఒప్పందం కుదుర్చుకుంది.

By:  Satya P   |   9 Nov 2025 9:58 AM IST
విశాఖ దశ తిరిగింది!
X

మొత్తానికి చూస్తే విశాఖ దశ తిరిగింది. పంట కూడా పండుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే విశాఖ మీద దృష్టి సారించింది. అంతే కాదు ఆచరణలోనూ జెట్ స్పీడ్ తో ఉంది. దాని ఫలితంగా విశాఖ కేంద్రంగా ఎన్నో కీలక మైన ప్రాజెక్టులు వరసగా వస్తున్నాయి. దాని వల్ల ప్రగతి పరుగులు పెట్టడమే కాదు ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. విశాఖకు అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ వచ్చిన సంగతి తెలిసిందే. తొందరలోనే దీనికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇపుడు మరో గుడ్ న్యూస్ కూడా దీని వెంబడే విశాఖ తలుపు తడుతోంది.

లూలూకి కొబ్బరికాయ :

విశాఖలో మరో ప్రతిష్టాత్మకమైన సంస్థగా లులూ మెగా షాపింగ్ మాల్ రాబోతోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో లులూ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెలలోనే లులూ షాపింగ్ మాల్ ని విశాఖలో కీలకమైన ప్రదేశంలో నిర్మించేందుకు శంకుస్థాపన చేయబోతున్నారు. గూగుల్ డేటా సెంటర్ తో పాటే లులూ కూడా సమాంతరంగా విశాఖలో నిర్మాణం జరుపుకుని అతి తొందరలోనే జనాలకు అందుబాటులోకి రానుంది అని అంటున్నారు. విశాఖలో ఈ నెల 14, 15 తేదీలలో పెట్టుబడుల సదస్సు జరగనుంది. దానికి హాజరవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగానే ఈ శంకుస్థాపన జరుగుతుంది. ఈ మెరకు లులూ యాజమాన్యం అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు.

ఇంటర్నేషనల్ స్టాండర్స్ తో :

విశాఖలో షాపింగ్ మాల్స్ ఉన్నాయి కానీ అంతర్జాతీయ ప్రమాణాలతో లులూ మెగా షాపింగ్ మాల్ ఏర్పాటు కావడం మాత్రం నగరం కీర్తిని మరో మెట్టు పైన ఉంచుతుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వెనక్కి వెళ్ళిపోయిన లులూని తిరిగి పిలిపించి ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం విశాఖ సాగర తీరానికి అభిముఖంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన భూమిని కేటాయించింది. అలా 13.75 ఎకరాల భూమిని లులూకి రాష్ట్ర ప్రభుత్వం 99 ఏళ్ళ పాటు లీజుకు ఇచ్చే ప్రాతిపదికన అప్పగించింది. ఇక ఈ భూమిలఒ లులూ అనేక నిర్మాణాలు చేపట్టనుంది. అందులో సూపర్ మార్కెట్, లులూ కనెక్ట్, లులు ఫ్యాషన్స్, లులూ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సెంటర్, అమ్యూజ్మెంట్ పార్క్, అలాగే ఎనిమిది స్క్రీన్లఒత మల్టీప్లెక్స్, ఫుడ్ కోర్టు వంటివి ఏర్పాటు చేయనున్నారని అంటున్నారు. ఇవన్నీ పూర్తి అయితే విశాఖ వాసులకు ఉపాధి అవకాశాలు వేలాదిగా వస్తాయి. కనీసంగా ఎనిమిది వేల మందికి ఉపాధి దక్కుతుందని అంటున్నారు.

అలా మొదలెట్టి :

ఇక విశాఖలో పెట్టుబడుల సదస్సులో ఏకంగా పది లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే పెట్టుబడులకు సంబంధించి వివిధ జాతీయ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకోబోతోంది. ఇదే సమయమో లులూ నిర్మాణానికి పునాది రాయి వేస్తారు, అలాగే వరసబెట్టి రానున్న కాలంలో విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలలో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారని అంటున్నారు. మొత్తానికి ఇది విశాఖ వాసులకు శుభవార్తగానే చూస్తున్నారు.