Begin typing your search above and press return to search.

గ్యాస్ బండలు ఇక కనిపించవు...కేంద్రం భవిష్యత్తు ఆలోచనలు !

ఇదిలా ఉంటే మన దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల వాడకం 1955 డిసెంబర్‌లో మొదలైంట్లుగా చరిత్ర చెబుతోంది. బరల్‌గాస్ పేరుతో ఇది ప్రారంభమైంది.

By:  Satya P   |   24 Aug 2026 9:21 AM IST
గ్యాస్ బండలు ఇక కనిపించవు...కేంద్రం భవిష్యత్తు ఆలోచనలు !
X

గ్యాస్ బండ అయిపోయింది అంటూ అంతా సాదా సీదాగా మాట్లాడుకోవడం అంతా చూస్తున్నదే. గ్యాస్ సిలిండర్లకు గ్యాస్ బండ మారు పేరు అన్న మాట. గ్యాస్ సిలిండర్లు ఎప్పటి నుంచి దేశంలో వాడుకలోకి వచ్చాయో కానీ వాటికి కాలం చెల్లబోతోంది అనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తాజా ఆదేశాలతో అది ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ఇక మీదట వంట గ్యాస్ సిలిండర్లు అంటే ఎల్పీజీ మాయం అయి ఆ స్థానంలో పైప్ లైన్ల ద్వారా నడిచే గ్యాస్ పీఎన్‌జీ వినియోగం పెద్ద ఎత్తున అందుబాటులోకి రానుంది అని అంటున్నారు.

ఎల్పీజీ చరిత్ర ఇదే :

ఇదిలా ఉంటే మన దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల వాడకం 1955 డిసెంబర్‌లో మొదలైంట్లుగా చరిత్ర చెబుతోంది. బరల్‌గాస్ పేరుతో ఇది ప్రారంభమైంది. ఆ తర్వాత 1965 అక్టోబర్ 22న కోల్‌కతాలో తొలి ఇండియన్ ఆయిల్ ఇండేన్ గ్యాస్ కనెక్షన్‌ను విడుదల చేశారు. 1967 హైదరాబాద్‌లోని అల్విన్ ఫ్యాక్టరీలో దేశీయంగా తొలి గ్యాస్ సిలిండర్ల తయారీ ప్రారంభమైంది. ఆ తరువాత వేగం పుంజుకుంది. 1980 నాటికి మధ్యతరగతి వర్గాలు పూర్తిగా ఎల్పీజీ వినియోగానికి మారిపోగా 2000 నుంచి పేదలు మొత్తం ఈ వైపుగా మారిపోయారు. దీంతో ఈ రోజున దేశంలో వంద కోట్ల కుటుంబాలు ఎల్పీజీ మీద పూర్తి స్థాయిలో ఆధారపడి జీవిస్తున్నారు. దాంతో ఎల్పీజీ సరఫరా మీద ఒత్తిడి బాగా పెరిగిపోయింది. అయితే ఎల్పీజీకి అవసరం అయిన ముడి చమురు పశ్చిమాసియా దేశాల నుంచి వస్తుంది. ఇటీవల అక్కడ సంక్షోభం యుద్ధ మేఘాల నేపథ్యంలో ఎల్పీజీకి కష్టాలు వచ్చాయి నాటి నుంచే కేంద్రం పీఎన్‌జీ మీద ఫోకస్ పెట్టింది.

ఇబ్బందులు లేకుండానే :

ఇక దేశంలో వంటగ్యాస్ సిలిండర్లపై ఆధారపడటాన్ని తగ్గించి పైప్‌లైన్ ద్వారా అందే గ్యాస్ పీఎన్‌జీ వినియోగాన్ని వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా పీఎన్‌జీ కనెక్షన్‌లను ప్రోత్సహించేందుకు సరికొత్త ప్రోత్సాహక పథకాలను తీసుకొచ్చింది. అందువల్ల భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ల అవసరం క్రమంగా తగ్గే అవకాశం ఉంది.పీఎన్‌జీ ) వైపు అడుగులు ఎంత వేగంగా పడితే అంత తొందరగా ఎల్‌పీజీ దిగుమతులపై భారాన్ని తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పైప్‌లైన్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో పీఎన్‌జీ వినియోగాన్ని వేగవంతం చేస్తున్నారు. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. పైప్ ద్వారా గ్యాస్ అందడం వల్ల సిలిండర్లు మార్చే పని తప్పుతుంది. పీఎన్‌జీ కనెక్షన్ తీసుకున్న వారు ఎల్‌పీజీ సిలిండర్లను నిబంధనల ప్రకారం సరెండర్ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ మార్పును వేగవంతం చేయడానికి రాష్ట్రాలతో కలిసి యంత్రాంగం ఇప్పటికే పనిచేస్తోంది.

కేంద్రం ఉత్తర్వులతో :

ఇక ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఎల్పీజీ నుంచి పీఎన్‌జీకి మార్పు వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలను ఇందులో భాగస్వాములను చేయాలని కేంద్రం గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారి నియామకానికి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశం జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం చూస్తే పీఎన్‌జీ కనెక్షన్ ఉన్నచోట తప్పనిసరిగా ఎల్పీజీ వాడకం నిలిపివేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలను ఎక్కడైనా అతిక్రమిస్తే ఎల్పీజీ సరఫరా నిలిపివేసే అవకాశం కూడా ఉందని పేర్కొంది. దేశంలో ఇంధన భద్రతతో పాటు సురక్షిత వాడకం కోసమే కేంద్రం ఈ చర్యలను తీసుకుంటోంది అని అంటున్నారు. దీంతో కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ ఈ నెల 21న దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. పీఎన్‌జీ కనెక్షన్ల విస్తరణని వేగవంతం చేయాలని దాని కోసం సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారుల మధ్య సమన్వయం కోసం జిల్లా స్థాయి పరిపాలనా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు.

సొంత శక్తితోనే :

ఇక పీఎన్‌జీ వినియోగాన్ని దేశంలో పూర్తిగా పెంచగలిగితే భద్రతతో పాటు పర్యావరణ హితంగా ఉంటుందని అంతే కాదు ముడి చమురు దిగుమతి కూడా తగ్గుతుందని భావిస్తోంది. కేంద్రం తాజా ఆదేశాలతో పీఎన్‌జీ సౌకర్యం ఉన్న ఇళ్లు ఎల్పీజీ కనెక్షన్‌ను ఎట్టి పరిస్థితుల్లో కలిగి ఉండకూడదు. అంతే కాదు దీని మీద అధికారులు నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా పీఎన్‌జీకి దరఖాస్తు చేసుకోని వారి ఎల్పీజీ కనెక్షన్‌ను నిలిపివేసే అధికారం కూడా కేంద్రానికి ఇక మీదట ఉంటుంది. దీంతో కొత్తగా నియమించే జిల్లా నోడల్ అధికారులు ఈ విషయంలో కీలకంగా వ్యవహరించనున్నారు. ఈ అధికారుల నియామకం చేసి వారి వివరాలను తమకు పంపాలని ఆదేశాల్లో కేంద్రం కోరింది. మొత్తానికి రానున్న కాలమంతా పీఎన్‌జీదే అని అంటున్నారు.