అక్క భర్త పొట్టిగా ఉన్నాడని హత్య.. గుంటూరులో ఘటన
ప్రేమ ఈ మాటకు బతికించే శక్తి ఉంటుంది కానీ శిక్షించే కాఠిన్యం ఉండదు. కానీ ఇప్పటి ప్రేమలు మారుతున్నాయి.
By: Tupaki Political Desk | 10 Oct 2025 12:42 PM ISTప్రేమ ఈ మాటకు బతికించే శక్తి ఉంటుంది కానీ శిక్షించే కాఠిన్యం ఉండదు. కానీ ఇప్పటి ప్రేమలు మారుతున్నాయి. కన్నవాళ్ల ఆశలను కాలరాస్తున్నారని తల్లిదండ్రులు చెప్తుంటే.. మనసులు కలిసిన వారితోనే జీవితం ఆనందంగా ఉంటుందని యువత చెప్తోంది. తాతలు, తండ్రుల కాలంలో పరువు హత్యలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు తగ్గాయని కాదు.. అసలు ఉండవద్దని అభిప్రాయం. గతంలో మీడియా లేదు కాబట్టి ఘటనలు బయటకు వచ్చేవి కావు. కానీ నేడు మీడియా విస్తృతమైంది కాబట్టి పరువు హత్యలు బయటకు వస్తున్నాయి.
కలకలం రేపుతున్న గుంటూరు హత్య..
ప్రేమ మనసుల బంధం కావాలి. కానీ మన సమాజంలో అది పరువుతో ముడిపడుతోంది. ఈ మధ్య గుంటూరులో చోటు చేసుకున్న పరువు హత్య మరోసారి ఈ విషాద వాస్తవాన్ని బయటపెట్టింది. తన అక్క తన మనసుకు నచ్చినవాడిని వివాహం చేసుకుంది. అక్క ప్రేమ వివాహం నచ్చని తమ్ముడు బావ పొట్టిగా ఉన్నాడన్న సాకుతో హత్య చేశాడు. మనలో ఇంకా బలంగా ఉన్న సామాజిక దౌర్భాగ్యానికి ప్రతిబింబం.
మొదట యువకుడు పెళ్లి చూపులకు వచ్చాడు. ఆ సమయంలో యువతి తల్లిదండ్రులు అతన్ని అంగీకరించలేదు. కానీ అదే సమయంలో ఫోన్ నెంబర్లు మార్చుకున్న జంట తరుచూ మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారు. తల్లిదండ్రులను కాదని యువతి ఇంటి నుంచి వెళ్లిపోయి అతన్ని వివాహం చేసుకుంది. ‘కుటుంబ గౌరవం’ అనే పేరుతో ఆ యువతి సోదరుడు బావను చంపాడు.
గతంలో చాలా ఘటనలు..
ఇదేమి కొత్త కాదు.. గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. 2018లో మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య ఇప్పటికీ మరచిపోలేని ఉదాహరణ. ప్రణయ్ ఇతర కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆమె కుటుంబ సభ్యులు పట్టపగలు హత్య చేయించారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల తీర్పు వచ్చింది. ఆ దృశ్యం ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. ఆ కేసులో ప్రధాన నిందితుడు మరణదండనకు గురయ్యాడు, కానీ ప్రణయ్ ప్రాణం తిరిగి రాలేదు.
ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో కూడా నుదుటిపై సింధూరం చూసి తన సోదరి వివాహం చేసుకుందన్న కోపంతో అన్న గొంతు నులిమి చంపేశాడు. పెద్దపల్లి జిల్లా, ముప్పిరిపల్లిలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని అమ్మాయి తండ్రి, బంధువులు కత్తితో దారుణంగా హత్య చేశారు.
షాద్‌నగర్‌లో మరో కేసులో.. ఒక యువతి తన తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల ప్రేమ వివాహం చేసుకున్న అక్కను చంపిన ఘటన కూడా సమాజాన్ని కలచివేసింది.
సమాజం ఆలోచించాలి..
ఈ వరుస ఘటనలతో సమాజం ఆలోచనలో పడాలి. మనసు కంటే కులం, పరువు, గౌరవం అనే అబద్ధపు ముసుగుకే విలువ ఇస్తున్నాం. ‘మన కుటుంబం అవమానమవుతుంది’ అని చెప్పి ఒక ప్రాణం తీసేయడం ఎలాంటి గౌరవం? ఒకరి జీవితాన్ని చిదిమేస్తే కుటుంబ గౌరవం ఎలా నిలుస్తుంది? అనేది ఆలోచించాలి.
ప్రేమ నేరమా..?
ప్రేమ ఒక నేరం కాదు.. అది వ్యక్తిగత హక్కు. కానీ మనలో ఇంకా ఆ హక్కును అంగీకరించే స్థాయి రాలేదు. చట్టపరంగా చూస్తే, సుప్రీంకోర్టు పరువు హత్యలను ‘మానవ హక్కుల ఉల్లంఘన’గా, ‘నేరాలన్నింటికంటే దారుణమైనది’అని పేర్కొంది. అయినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమను రక్షించడమే కాదు, ప్రేమించే హక్కును రక్షించడం కూడా ప్రతి ప్రభుత్వ, ప్రతి పోలీసు వ్యవస్థ బాధ్యతగా మారాలి. ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, కుటుంబ సలహా కేంద్రాలు, ప్రేమ వివాహ జంటలకు భద్రత కల్పించే చర్యలు తీసుకుంటేనే ఇలాంటి హత్యల నుంచి ప్రేమికులను కాపాడుకోగలం.
