పారిస్ మ్యూజియంలో 'ధూమ్' తరహా దోపిడీ... షాకింగ్ అప్ డేట్స్!
అవును.. రోజూ వేల మంది సందర్శకులతో కిటకిటలాడే పారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియం ఆదివారం మూసివేయబడింది. అందుకు కారణం... ఆ మ్యూజియంలో భారీ దొంగతనం జరిగిందని తెలుస్తోంది.
By: Raja Ch | 19 Oct 2025 7:30 PM IST'ధూమ్' సినిమాల్లో జరిగిన దొంగతనాల తరహాలో ఊహించని రీతిలో ఓ షాకింగ్ దోపిడీ జరిగిందనే విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా... ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పారిస్ లోని లౌవ్రే మ్యూజియంలో దొంగలు పడ్డారని.. నెపోలియన్ కాలం నాటి విలువకట్టలేని సుమారు తొమ్మిది ఆభరణాలను దోచుకున్నారని తెలుస్తోంది.
అవును.. రోజూ వేల మంది సందర్శకులతో కిటకిటలాడే పారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియం ఆదివారం మూసివేయబడింది. అందుకు కారణం... ఆ మ్యూజియంలో భారీ దొంగతనం జరిగిందని తెలుస్తోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. దొంగలు సీన్ నది వైపు నుండి మ్యూజియంలోకి ప్రవేశించి, గూడ్స్ లిఫ్ట్ ద్వారా గదిలోకి ప్రవేశించి, బైక్ లపై పారిపోయారు.
ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి రచిదా దాటి సోషల్ మీడియా పోస్ట్ లో ఈ సంఘటనను ధృవీకరించారు. రిపోర్ట్ చేయడానికి ఎటువంటి గాయాలు లేవని.. తాను, మ్యూజియం బృందాలు, పోలీసులతో పాటు సంఘటనా స్థలంలో ఉన్నామని.. దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో.. అమూల్యమైన వారసత్వ సంపద దొంగిలించబడిందని ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
దోపిడీ ఎలా జరిగింది?:
ఫ్రెంచ్ దినపత్రిక లె పారిసియన్ ప్రకారం... నిర్మాణం జరుగుతున్న సీన్ ముఖంగా ఉన్న ముఖభాగం నుండి దొంగలు ది లౌవ్రేలోకి ప్రవేశించారు. అనంతరం.. అపోలో గ్యాలరీలోని టార్గెట్ చేసుకున్న గదికి నేరుగా ప్రవేశం పొందడానికి వారు గూడ్స్ లిఫ్ట్ ను ఉపయోగించారని తెలుస్తోంది. ఆ గ్యాలరీలోనే ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్ ప్రదర్శన ఉంది.
దొంగలు దొంగతనం చేయడానికి చిన్న చైన్సాలను తీసుకెళ్లి, పని పూర్తైన తర్వాత బైక్స్ పై అక్కడి నుండి వెళ్లిపోయారని భావిస్తున్నారు. మెసొపొటేమియా, ఈజిప్ట్, శాస్త్రీయ ప్రపంచం నుండి యూరోపియన్ కళాకారుల వరకు పురాతన వస్తువులు, శిల్పాలు, చిత్రలేఖనాలతో పాటు సుమారు 33,000 కంటే ఎక్కువ కళాఖండాలకు నిలయంగా ఈ మ్యూజియం ఉంది.
ఇదే మ్యూజియంలో ప్రధాన ఆకర్షణలలో మోనాలిసా, వీనస్ డి మిలో, వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోత్రేస్ ఉన్నాయి. అయితే ఈ ఘటనపై ఈ ప్రఖ్యాత మ్యూజియం ఇంకా అధికారికంగా స్పందించలేదని తెలుస్తోంది.
కాగా... ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించబడే మ్యూజియంగా లౌవ్రే కు పేరుంది. ఇక్కడకు రోజుకు కనీసం 30,000 మంది సందర్శకులు వస్తుంటారు. ఈ మ్యూజియంలో గత కొన్ని సంవత్సరాలుగా మోనాలిసాతో సహా అనేక దొంగతనాల ప్రయత్నాలు జరిగాయి. లియోనార్డో డా విన్సీ చిత్రపటాన్ని 1911లో విన్సెంజో పెరుగ్గియా అనే మాజీ కార్మికుడు దొంగిలించాడు.
అతను పెయింటింగ్ ను తన కోటు కింద దాచి మ్యూజియం నుండి బయటకు వెళ్లాడు. అయితే.. సుమారు రెండు సంవత్సరాల తర్వాత దీనిని ఫ్లోరెన్స్ లో తిరిగి పొందారు. ఈ మ్యూజియంలో చివరిగా దొంగతనం 1983లో జరిగింది. ఆ సమయంలో మ్యూజియం నుండి రెండు కవచాలు దొంగిలించబడ్డాయి. వాటిని 2021లో తిరిగి పొందారు.
