Begin typing your search above and press return to search.

ఆ నగరంలో క్యాబ్ డ్రైవర్ అవ్వాలంటే మామూలు యవ్వారం కాదు

ట్యాక్సీ డ్రైవర్ గా నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 25 వేల వీధులను.. ల్యాండ్ మార్కులను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.

By:  Garuda Media   |   26 Feb 2026 10:45 AM IST
ఆ నగరంలో క్యాబ్ డ్రైవర్ అవ్వాలంటే మామూలు యవ్వారం కాదు
X

క్యాబ్ డ్రైవర్ కావాలంటే.. డ్రైవింగ్ లైసెన్సు.. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. అది మన దేశంలో. కానీ.. ఇప్పుడు చెప్పే దేశంలో క్యాబ్ డ్రైవర్ కావటమంటే.. ఆషామాషీ వ్యవహారం కాదు. క్యాబ్ డ్రైవర్ గా అర్హత సాధించటం.. అనుమతి పొందటానికి చేయాల్సిన కసరత్తు చూస్తే.. మన దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన సివిల్స్ కు ఏ మాత్రం తగ్గని రీతిలో ఉండటం కనిపిస్తుంది. ఇంతకూ ఆ మహానగరం మరెక్కడో లేదు బ్రిటన్ రాజధాని లండన్ లో.. క్యాబ్ డ్రైవర్ కావాలంటే భారీ కసరత్తు ఉంటుంది.

ట్యాక్సీ డ్రైవర్ గా నిర్వహించే అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 25 వేల వీధులను.. ల్యాండ్ మార్కులను గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదేమీ కొన్ని నెలల్లో సాధ్యం కాదు. కొన్ని ఏళ్లుగా అధ్యయనం చేస్తే తప్ప.. సాధ్యం కాని పని. వీటికి తోడు డ్రైవింగ్ లో చాకచక్యం ఉండాలి. ఇన్నేసి కండీషన్లు లండన్ మహానగరంలో క్యాబ్ డ్రైవర్లకు పెట్టేసింది అక్కడి ప్రభుత్వం.

రోమన్ కాలం కంటే ముందు నుంచి లండన్ మహానగరం ఎంత ప్రసిద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాల ప్రవాహంలో అధికారంలోకి వచ్చిన పాలకులు.. లండన్ లో పెద్ద ఎత్తున నిర్మాణాల్ని చేపట్టటమేకాదు.. నగరం నలుమూలలకు విస్తరించేలా చేశారు. దీంతో నగరం భారీగా విస్తరించింది. ఆటోమొబైల్స్ రాకతో ట్యాక్సీలు వచ్చాయి. లండన్ మహానగరంలో పాతికవేలకు పైగా వీధులు.. ప్రాంతాలు ఉన్నాయి.

వీటిపై అవగాహన ఉండేలా డ్రైవర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. దాదాపు 160 ఏళ్ల క్రితమే ఈ తరహా పరీక్షను సిద్ధం చేశారు. ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఇదొకటిగా చెబుతారు. క్యాబ్ డ్రైవర్ గా అనుమతి సాధించాలంటే.. మొత్తం లండన్ భౌగోళిక పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఈ కారణంగానే లండన్ లో ట్యాక్సీ డ్రైవర్ గా అనుమతి సాధించాలంటే కనీసం మూడేళ్ల పాటు కష్టపడాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే లండన్ లోని ట్యాక్సీ డ్రైవర్ల మీద అధ్యయనం చేసినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

లండన్ లోని ట్యాక్సీ డ్రైవర్ల మీద గత ఏడాది ఒక అధ్యయనాన్ని నిర్వహించగా.. వీరికి లండన్ మహానగరం మొత్తం తెలిసి ఉండటంతో రోజు ఏదోఒక ప్రాంతానికి వెళ్లి రావాల్సి వస్తుంది. దీంతో భారీ ఎత్తున మెమరీ అవసరం. అంతలా లండన్ మహానగరాన్ని గుర్తు ఉంచుకోవటం ద్వారా వారికి అపారమైన మెమరీ ఉంటుందని తేలింది. అంతేకాదు.. మెదడులోని హిస్పోక్యాంపస్ మిగిలినవారి కంటే కాస్త ఎద్దదిగా ఉంటుందని తేల్చారు.

ఈ హిప్పోక్యాంపస్ చిన్ననాటి తీపి గురుతుల్ని సుదీర్ఘకాలంలో గుర్తు పెట్టుకోవటంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంటుంది. సాధారణంగా పెద్ద వయస్కుల్లోని వారికి.. దీని పని తీరు మందగించటం కారణంగానే వారు మెమరీ లాస్ అవుతుంటారని పేర్కొన్నారు. అయితే.. లండన్ మహానగర డ్రైవర్లకు మెమరీ లాస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం అరుదుగా ఈ అధ్యయనం వెల్లడించింది.