లండన్ నుంచి ముగ్ధ రహస్యంగా ఎందుకొచ్చింది.. పూణేలో ఎందుకు చనిపోయింది.. అంతుచిక్కని మిస్టరీ
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన ముగ్ధ (34) ఎంబీఐ పూర్తి చేసేందుకు 2025 జులైలో లండన్ వెళ్లింది.
By: A.N.Kumar | 31 Oct 2026 5:15 PM ISTలండన్‌లో భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటోందని ఆశగా ఎదురుచూస్తున్న ఆ కంటికి.. కనీసం స్వదేశం వచ్చిందనే సమాచారం కూడా లేదు.. చివరికి పూణేలోని ఒక మూసిన తలుపుల వెనుక తన కూతురు అనంత లోకాలకు వెళ్లిపోయిందని తెలిసిన ఆ తండ్రి గుండె పగిలిన దృశ్యం.. నిశ్శబ్దంగా మిగిలిపోయిన ఓ జీవిత మిస్టరీకి సాక్ష్యంగా నిలిచింది.
లండన్‌లో ఉన్నత చదువులు చదువుతోందని భావించిన తల్లిదండ్రులకు కోలుకోలేని షాక్. ఆగస్టులోనే భారత్ చేరుకుని.. ఎవరికీ తెలియకుండా పూణేలోని విలాసవంతమైన ఫ్లాట్‌లో నివసిస్తున్న 34 ఏళ్ల ముగ్ధ అవినాశ్ దేశ్‌ముఖ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లు.. బ్యాంక్ లావాదేవీల ఆధారంగా పోలీసులు ఫ్లాట్ తలుపులు తెరిచి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌కు చెందిన ముగ్ధ (34) ఎంబీఐ పూర్తి చేసేందుకు 2025 జులైలో లండన్ వెళ్లింది. క్రమం తప్పకుండా ఫోన్ కాల్స్.. మెసేజ్‌లు చేస్తుండటంతో ఆమె విదేశాల్లోనే చదువుకుంటోందని కుటుంబ సభ్యులు నమ్మారు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఈ ఏడాది ఆగస్టులోనే ఆమె బ్రిటన్ విడిచి భారత్‌కు తిరిగొచ్చింది. స్వదేశం వచ్చిన విషయాన్ని కుటుంబానికి చెప్పకుండా పూణే పింప్రి-చించ్వాడ్ పరిధిలోని గహుంజే వద్ద ఉన్న లోధా బెల్మోండో రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని ఒంటరిగా నివాసముండటం ప్రారంభించింది.
అక్టోబర్ 24 నుంచి ముగ్ధ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో తండ్రి అవినాశ్ దేశ్‌ముఖ్‌కు అనుమానం వచ్చింది. లండన్‌లోని ఆమె స్నేహితురాలిని విచారించగా ముగ్ధ ఆగస్టు నెలాఖరులోనే బ్రిటన్ విడిచి వెళ్లినట్లు బ్రిటన్ పోలీసుల ద్వారా తెలిసింది. వెంటనే తండ్రి ఆమె బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ను పరిశీలించగా కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. అక్టోబర్ 8 నుంచి 25 మధ్య కాలంలో అనేక ఫుడ్ డెలివరీ, ఆన్లైన్ పేమెంట్లు కనిపించాయి. ఒక లావాదేవీ ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఉస్మాన్‌పురా ప్రాంతంతో ముడిపడి ఉండటంతో ఆమె భారత్‌లోనే ఉందనే విషయం స్పష్టమైంది. సాంకేతిక ఆధారాలను ఛత్రపతి శంభాజీనగర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అందించడంతో అన్వేషణ వేగవంతమైంది.
క్రైమ్ బ్రాంచ్ అందించిన సమాచారంతో షిర్గావ్ పోలీసులు పూణేలోని ఫ్లాట్ వద్దకు చేరుకున్నారు. తాళాలు తీసే నిపుణుడి సహాయంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్లిన పోలీసులకు ముగ్ధ మృతదేహం కనిపించింది. శరీరంపై ఎలాంటి బాహ్య గాయాలు లేవని ముగ్ధ ఈ ఫ్లాట్‌ను ఏప్రిల్‌లోనే అద్దెకు తీసుకోగా ఆగస్టు నుంచి ఇక్కడే ఉంటున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలోనూ మరణానికి స్పష్టమైన కారణం తేలకపోవడంతో ఈ ఘటన మరింత మిస్టరీగా మారింది. లండన్ నుంచి అంత రహస్యంగా ఎందుకు తిరిగొచ్చింది? స్వదేశానికి వచ్చిన విషయాన్ని కుటుంబ సభ్యులకు ఎందుకు దాచింది? పూణేలోని ఫ్లాట్‌లో ఒంటరిగా ఉండటానికి గల కారణమేంటి? అక్టోబర్ 24 తర్వాత అసలు ఏం జరిగింది? మరణానికి ముందు ఎవరైనా వచ్చారా? ఇవే ఈ కేసులో అంతుచిక్కని ప్రశ్నలుగా మిగిలాయి. ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, డిజిటల్ సీడీఆర్ ఆధారంగా పోలీసులు అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. ముగ్ధ మిస్టరీ మరణం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
