Begin typing your search above and press return to search.

బ్రిటన్‌లో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ… చరిత్రలోనే అతి పెద్ద నిరసన

బ్రిటన్ రాజధానిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం సెంట్రల్ లండన్ వీధుల్లోకి లక్షా 10 వేలకు పైగా ప్రజలు తరలివచ్చారు.

By:  A.N.Kumar   |   14 Sept 2025 12:47 PM IST
బ్రిటన్‌లో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ… చరిత్రలోనే అతి పెద్ద నిరసన
X

బ్రిటన్ రాజధానిలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం సెంట్రల్ లండన్ వీధుల్లోకి లక్షా 10 వేలకు పైగా ప్రజలు తరలివచ్చారు. వలస విధానాలకు వ్యతిరేకంగా టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ యాంటీ-ఇమిగ్రేషన్ ర్యాలీ బ్రిటన్ చరిత్రలోనే అతి పెద్ద నిరసనగా పోలీసులే ప్రకటించాయి.

“వలసదారుల కారణంగా బ్రిటన్‌లో అసురక్షిత పరిస్థితులు పెరుగుతున్నాయి. వారిని తిరిగి పంపించాలి” ఇదే ఆందోళనకారుల ప్రధాన డిమాండ్. అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను ప్రదర్శిస్తూ “మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్” టోపీలు ధరించిన నిరసనకారులు జాత్యహంకారానికి వ్యతిరేకంగా నిలిచిన వర్గంతో ఎదురెదురై నగర వాతావరణాన్ని మరింత కఠినతరం చేశారు.

ఎలాన్ మస్క్ మద్దతు

ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ స్వయంగా ర్యాలీకి మద్దతు తెలపడం ఈ నిరసనకు అంతర్జాతీయ ప్రాధాన్యం తెచ్చింది. “బ్రిటన్ ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పడానికి భయపడకూడదు” అంటూ మస్క్ వీడియో సందేశం ద్వారా ర్యాలీకి మద్దతు లభించింది.

రెండు భిన్న నిరసనలు.. ఒకే నగరం

ఇక అదే సమయంలో దాదాపు 5 వేలమంది “స్టాండ్ అప్ టు రేసిజమ్” పేరిట రోడ్డెక్కారు. వలసదారులను కాపాడాలని, జాతి వివక్షకు వ్యతిరేకంగా చైతన్యం నింపాలని నినాదాలు చేశారు. ఒకవైపు వలస వ్యతిరేక ర్యాలీ, మరోవైపు రేసిజం వ్యతిరేక నిరసన.. లండన్ వీధులు పరస్పర విరుద్ధ భావజాలాలతో రగిలిపోయాయి.

*పోలీసులు.. ఆందోళనకారుల ఘర్షణ

స్థితిగతులు క్రమంగా అదుపు తప్పాయి. నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు లాఠీలు ఊపగా, ఆగ్రహించిన ర్యాలీ కారులు వాటర్ బాటిల్లు, వస్తువులు విసిరారు. ఘర్షణల్లో 26 మంది పోలీసులు గాయపడ్డారని, కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.

ప్రభుత్వంపై ఘాటైన దాడి

ప్రధాని కీర్ స్టార్మర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నినాదాలు చేశారు. “మాకు భద్రత కావాలి… వలస విధానాలను రద్దు చేయాలి” అంటూ డిమాండ్లు గట్టిగా వినిపించాయి. ప్రజా అసంతృప్తి పెరుగుతుండటంతో ప్రభుత్వానికి ఇది కొత్త తలనొప్పిగా మారింది.

ఒకే నగరంలో రెండు విభిన్న ఆందోళనలు… ఒకవైపు వలస వ్యతిరేక కోపం, మరోవైపు జాతి వివక్ష వ్యతిరేక ప్రతిస్పందన. ఈ రెండు ఒత్తిళ్ల మధ్య బ్రిటన్ ప్రభుత్వం నిలిచింది. లండన్ వీధులు బ్రిటన్ భవిష్యత్ రాజకీయ దిశను నిశ్చయించే క్షణాలను సాక్షిగా చూస్తున్నాయి.