Begin typing your search above and press return to search.

ఒక్క వ్యక్తి.. లక్షల మందిని ఏకం చేశాడు

ఈ నిరసనలకు కేంద్రమైన వ్యక్తి రైట్ వింగ్ యాక్టివిస్ట్ టామీ రాబిన్సన్. ఆయన పిలుపు మేరకు "యునైట్ ది కింగ్‌డమ్" పేరుతో ప్రజలు ఏకతాటిపైకి వచ్చారు.

By:  A.N.Kumar   |   14 Sept 2025 5:00 PM IST
ఒక్క వ్యక్తి.. లక్షల మందిని ఏకం చేశాడు
X

బ్రిటన్ రాజకీయ చరిత్రలో అరుదైన దృశ్యం లండన్ వీధుల్లో ఆవిష్కృతమైంది. వలసదారులపై వ్యతిరేకత కొత్తేమీ కాకపోయినా.. ఈ సారి మాత్రం అది అపూర్వ స్థాయిలో విస్తరించింది. "వలసదారులను ఇంటికి పంపండి" అనే నినాదాలతో లక్షలాది మంది లండన్ వీధుల్లోకి చేరారు. అలా చరిత్రలోనే అత్యంత భారీ నిరసనల్లో ఒకదాన్ని బ్రిటన్ చూశింది.

ఈ నిరసనలకు కేంద్రమైన వ్యక్తి రైట్ వింగ్ యాక్టివిస్ట్ టామీ రాబిన్సన్. ఆయన పిలుపు మేరకు "యునైట్ ది కింగ్‌డమ్" పేరుతో ప్రజలు ఏకతాటిపైకి వచ్చారు. సామాన్యుల నుండి మధ్యతరగతి వరకు, వృద్ధుల నుండి యువత వరకు వివిధ వర్గాల వారు ఈ నిరసనల్లో పాల్గొని తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

అయితే, ఇదే సమయంలో లండన్ మరో కోణాన్ని కూడా చూసింది. జాత్యహంకారానికి, వలసదారులపై ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా సుమారు 5 వేల మంది ప్రతిఘటనకు దిగారు. వలసలు బ్రిటన్ అభివృద్ధికి దోహదపడ్డాయని, సమానత్వం దేశ బలానికి పునాది అని వారంతా గళమెత్తారు.

రాజకీయ ప్రభావం

ఈ నిరసనలు బ్రిటన్‌లో రాజకీయ దిశను మలుపుతిప్పే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు వలసదారులపై వ్యతిరేక భావన పెరుగుతుండగా, మరోవైపు సమానత్వం, వైవిధ్యం కోసం పోరాటం బలపడుతోంది. ఇరువైపుల భావజాలాలు ఢీ కొట్టే స్థితి ఏర్పడింది.

సమాజానికి సంకేతం

ఈ సంఘటన ఒకవైపు ప్రజలలోని అసంతృప్తిని బయటపెడుతుంటే, మరోవైపు సమాజంలో విభజన ఎంత పెరిగిందో స్పష్టమవుతోంది. ఒక వ్యక్తి పిలుపుతో లక్షలాది మంది వీధుల్లోకి రావడం ఒక చరిత్రాత్మక ఘట్టమే. కానీ అదే సమయంలో ఆ పిలుపుకు వ్యతిరేకంగా నిలిచిన వందలాది మంది బ్రిటన్ భవిష్యత్తు దిశపై మౌలిక ప్రశ్నలను లేవనెత్తుతున్నారు.

మొత్తానికి, రాబిన్సన్ పిలుపు బ్రిటన్ ప్రజాస్వామ్యాన్ని కొత్త మలుపులోకి నెట్టింది. కానీ ఈ మలుపు దేశానికి ఏ దిశలో తీసుకెళ్తుందనేది, పాలకులు చూపే వివేకం, సమాజం ప్రదర్శించే సహనంపైనే ఆధారపడి ఉంది.