Begin typing your search above and press return to search.

ఆధిపత్య పోరు: మండ‌లిలో ఎవ‌రికి వారే..!

శాసనమండలి సమావేశాలు ముగిసాయి. వర్షాకాల సమావేశాలు మొత్తం 8 రోజులు సాగగా 22 బిల్లులను సభలో ఆమోదించారు.

By:  Garuda Media   |   29 Sept 2025 9:11 AM IST
ఆధిపత్య పోరు: మండ‌లిలో ఎవ‌రికి వారే..!
X

శాసనమండలి సమావేశాలు ముగిసాయి. వర్షాకాల సమావేశాలు మొత్తం 8 రోజులు సాగగా 22 బిల్లులను సభలో ఆమోదించారు. అయితే శాసన మండలి గురించి ఎప్పుడూ..పెద్దగా చర్చించుకునే పరిస్థితి ఉండేది కాదు. శాసనసభ ప్రైమ్. దాని గురించే ఎక్కువ మంది మాట్లాడుకునేవారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ఉంటారు కాబట్టి వారి గురించే ఎక్కువగా రాజకీయాల్లోనూ చర్చ సాగేది. అయితే గత ఏడాది కాలం నుంచి కూడా రాష్ట్రంలోని శాసనమండలిలో జరుగుతున్న కార్యకలాపాలు ఆసక్తిగా మారాయి. వీటికి ఎక్కువగా ప్రాధాన్యం కూడా లభిస్తుంది.

దీనికి కారణం అసెంబ్లీకి వైసిపి వెళ్లకపోవడం. శాసనమండలిలో వైసీపీ బలంగా ఉండడంతో.. వైసిపి నాయకులు ఇక్కడ బలమైన వాదనను వినిపిస్తున్నారు. దీంతో శాసనమండలిలో జరిగే కార్యకలాపాలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నయి. అదేవిధంగా ఈ సభలో అధికార, ప్ర‌తిప‌క్షాలు పైచేయి సాధించేందుకు ప్ర‌య‌త్నించాయ‌నే చెప్పాలి. ముఖ్యంగా మూడు కీలక అంశాలు శాసనమండలిని కుదిపేసాయి. 1) పిపిపి విధానంపై మెడికల్ కాలేజీ లను ప్రైవేటుపరం చేస్తున్నారని వైసీపీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్య‌క్తం చేశారు.

దీనికి ప్రభుత్వం వివరించే ప్రయత్నం చేస్తూ వైసిపి హయాంలో మెడికల్ కాలేజీల విషయాన్ని తీవ్ర స్థాయిలో ఎండగట్టింది. ఇది శాసనమండలిలో రెండు రోజులపాటు దుమారానికి దారితీసింది. ఇక‌, చివ‌రి రెండు రోజులు శాసనమండలిలో మరిన్ని చిత్రమైన విషయాలు చోటుచేసుకున్నాయి. మోషన్ రాజును అవమానిస్తున్నారంటూ వైసీపీ తీర్మానం చేయటం... దీనిపై చర్చకు పట్టు పట్టడం. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం మండల చైర్మన్ గా ఉన్న మోషన్ రాజును ఆహ్వానించాలి.

అయితే, తిరుపతి సహా అమరావతిలో నిర్వహించిన రెండు కార్యక్రమాలకు ఆయనను పిలవలేదు. ఇది పెను వివాదంగా మారింది. ఇక‌, క్యాంటీన్లలో ఇస్తున్న టీ, కాఫీలు రుచిగా ఉండటం లేదని, భోజనం నాసిరకంగా ఉంటుందని కూర‌ల్లో ఉప్పు తక్కువ, కారం ఎక్కువ అన్నట్టుగా ఉంటున్నాయని సభ్యులు ఆరోపించారు. ఇది కూడా దాదాపు నాలుగు గంటల పాటు సభా సమయాన్ని తినేసిందనే చెప్పాలి. మరో ముఖ్య విషయం మంత్రి నారా లోకేష్ కు అదే విధంగా వైసిపి పక్ష నేత బొత్స‌ సత్యనారాయణకు మధ్య తీవ్ర వివాదం జరిగింది.

వైసీపీ స‌భ్యురాలు, ఫైర్ బ్రాండ్‌గా మారుతున్న‌ వరుదు కళ్యాణిని అవమానించారంటూ నారా లోకేష్ పై సత్యనారాయణ విరుచుకుపడ్డారు. కానీ తమకు మహిళలంటే గౌరవమని, గత ప్రభుత్వానికి మహిళలు అంటే గౌరవం లేదని చెబుతూ నారా లోకేష్ ఎదురు దాడి చేశారు. దీంతో మండలిని ఒక రకంగా అట్టుడికించార‌నే చెప్పాలి. మొత్తంగా శాసనమండలి సమావేశాలు 8 రోజులు హాట్ హాట్ గానే సాగాయి. చివ‌రిరోజు ప్ర‌భుత్వం కొన్ని విష‌యాల‌పై పొర‌పాట్లు జ‌రిగాయ‌ని ఒప్పుకోక త‌ప్ప‌లేదు.