జగన్ పై కొత్త ట్రోల్స్ వైరల్... లోకేష్ స్పందనకు అభినందనలు!
అవును... ఏమాటకామాట చెప్పుకోవాలంటే గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, లోకేష్ లతో పాటు వారి కుటుంబ సభ్యులపైనా వ్యక్తిగత విమర్శలు ఎక్కువగా వినిపించేవి.
By: Raja Ch | 26 Nov 2025 11:00 AM ISTరాజకీయాల్లో ఒకప్పుడు విమర్శలు అత్యంత హుందాగా ఉండేవి! కేవలం అంశాలు, సమస్యల ప్రాతిపదికనే విశ్లేషణాత్మక విమర్శలు ఉండేవి! అయితే ఇటీవల కాలంలో వ్యక్తిగత దాడులు పెరిగిపోయాయి. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి ఈ తరహా వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వంపైన విమర్శలు వెర్రితలలు వేశాయనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో లోకేష్ రియాక్షన్ ఆసక్తిగా మారింది.
అవును... ఏమాటకామాట చెప్పుకోవాలంటే గత ప్రభుత్వ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, లోకేష్ లతో పాటు వారి కుటుంబ సభ్యులపైనా వ్యక్తిగత విమర్శలు ఎక్కువగా వినిపించేవి. లేవనెత్తిన ప్రతీ సమస్యకూ సమాధానంగా ఎదురుదాడే కనిపించే పరిస్థితి అనే విమర్శలు వినిపించేవి. అయితే.. తాజా ప్రభుత్వ హయాంలో లెక్కలు మారాయనే సంకేతం తెరపైకి వచ్చింది!
వివరాళ్లోకి వెళ్తే... ఏపీలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకీ కేవలం 11 స్థానాలే వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరని పనని, జరగని వ్యవహారమని సభాపతి స్పష్టంగా చెప్పారు. దీనిపై ఉప సభాపతి సైతం క్లారిటీ ఇచ్చారు. దీంతో... వైసీపీ నేతలు అసెంబ్లీకి నిరవధికంగా గైర్హాజరవుతున్నారు. దీనిపై పలు విమర్శలు వస్తున్నాయి!
అయితే... సభలో ఉన్న నాలుగు పార్టీల్లో మూడు పార్టీలు అధికార పక్షమే అయినప్పుడు.. మిగిలిన తమ ఒక్క పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో లేవనెత్తాలసిన విషయాలను.. తాడేపల్లి ఆఫీసులో మీడియా ముందు చెప్పుకొస్తున్నారు.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు.
ఈ సమయంలో... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోన్న సమయంలో.. ఆ రోడ్డు పక్కన జగన్ ఫ్లకార్డు పట్టుకుని కూర్చున్నారు. ఆ ఫ్లకార్డుపై "దయచేసి ప్రతిపక్ష హోదా ఇవ్వండి" అని రాసి ఉండగా.. అది చూపిస్తూ ఆ ముగ్గిరి వెంట జగన్ పరుగెత్తుతున్నారు! ఈ కంటెంట్ తో ఉన్న ఏఐ జనరేటెడ్ వీడియోతో జగన్ ను ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ సమయంలో ఈ వ్యవహారంపై లోకేష్ స్పందించారు. దీనికి సంబంధించిన పోస్టుపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ... ఇలాంటి కంటెంట్ వెనుక ఉన్న భావోద్వేగం తనకూ ఉన్నప్పటికీ.. వ్యక్తిగత దాడులు ఎప్పుడూ వాంఛనీయం కాదని అన్నారు. మనం వారికి రాజకీయ ప్రత్యర్థులం కావొచ్చు కానీ.. మన బహిరంగ ప్రసంగం గౌరవం మీద ఆధారపడి ఉండాలని తెలిపారు.
ఇదే సమయంలో... ఇలాంటి కంటెంట్ ను విస్తరించకుండా ఉండమని తమ మద్దతుదారులతో సహా ప్రతీ ఒక్కరినీ తాను అభ్యర్థిస్తున్నట్లు చెప్పిన నారా లోకేష్... అసమ్మతిలో కూడా మర్యాదను కాపాడుకుందామని.. ఏపీని బలోపేతం చేసే నిర్మాణాత్మక రాజకీయాలపై దృష్టిపెడదామని.. తన ప్రియమైన టీడీపీ కుటుంబానికి సూచించారు. దీంతో... హుందాతనంతో కూడినా ఈ స్పందనకు అభినందనలు వస్తున్నాయి.
