'పార్టీ శాశ్వతం.. పార్టీ నిర్ణయమే శిరోధార్యం'.. లోకేష్ కీలక వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా... సచివాలయం అద్దె ఇల్లు లాంటిది అయితే, పార్టీ సొంత ఇల్లు లాంటిదని చెప్పిన లోకేష్... అధికారంలో ఉన్నప్పుడే సచివాలయంలో ఉంటామని.. అధికారం ఉన్నా, లేకపోయినా పార్టీ శాశ్వతమని గుర్తు చేశారు.
By: Raja Ch | 21 Dec 2025 12:14 PM ISTపార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు (రీజనల్ కో ఆర్డినేటర్స్) తో తాజాగా విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా.. ఈ ఏడాదిన్నరలో టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్నరలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై నివేదిక ఇవ్వాలని రీజనల్ కో ఆర్డినేటర్స్ కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. అందులో పనితీరు బాగాలేని వారిని పిలిపించి పార్టీ కౌన్సెలింగ్ ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా... పదవులకు అతీతంగా అందరికీ పార్టీనే సుప్రీం అని తెలిపారు.
ఈ సందర్భంగా... సచివాలయం అద్దె ఇల్లు లాంటిది అయితే, పార్టీ సొంత ఇల్లు లాంటిదని చెప్పిన లోకేష్... అధికారంలో ఉన్నప్పుడే సచివాలయంలో ఉంటామని.. అధికారం ఉన్నా, లేకపోయినా పార్టీ శాశ్వతమని గుర్తు చేశారు. ఈ క్రమంలో.. ఎంత పెద్ద నాయకులకైనా పార్టీ నిర్ణయమే శిరోధార్యమని.. అందరూ పార్టీ లైన్ కి లోబడి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు.
పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్స్ తో సుమారు రెండున్నర గంటలపాటు భేటీ అఅయిన లోకేష్.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు మధ్య అనుసంధాన బాధ్యత సమన్వయకర్తలదేనని.. ఎమ్మెల్యేల పనితీరును పరిశీలించడం మొదలు, జిల్లా ఇన్ ఛార్జి మంత్రులతో కలసి సమీక్ష సమావేశాలు నిర్వహించడం వరకు సమన్వయకర్తలు క్రియాశీలంగా వ్యవహరించాలని తెలిపారు.
ఇదే సమయంలో... గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పెండింగ్ లో ఉన్న పార్టీ పదవుల్ని ఈ నెలాఖరుకు భర్తీ చేయాలని సూచించిన ఆయన... దేవాలయ కమిటీలు, మార్కెట్ యార్డులు, పీఏసీఎస్ ల అధ్యక్షులు లాంటి పోస్టుల్లో నియామకాల్ని వెంటనే పూర్తిచేయాలని తెలిపారు. ఏపీపీఎస్సీ, బీసీ కార్పొరేషన్ లో పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు తీసుకోవాలని సూచించారు.
ఏది ఏమైనా... లోకేష్ పరిపాలనకు, తన శాఖలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో పార్టీకీ అంతే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు లోకేష్ కు పరిపాలన, పార్టీ రెండు కళ్లుగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు పరిపాలనను, ఇటు పార్టీ పనులను బేరీజు వేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఇది అటు ప్రజలకు, ఇటు కార్యకర్తలకు కూడా శుభపరిణామం!
