Begin typing your search above and press return to search.

లోకేశ్ కు పేర్ని నాని సవాల్

ఏపీలో డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, అందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

By:  Garuda Media   |   28 July 2026 11:06 PM IST
లోకేశ్ కు పేర్ని నాని సవాల్
X

ఏపీలో డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, అందుకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైసీపీ అధినేత జగన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. నీట్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, అదే మాదిరిగా డీఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలని జగన్ డిమాండ్ చేశారు. అయితే, జగన్ సవాల్ ను స్వీకరించిన లోకేశ్ తనతో ఆ విషయంపై చర్చకు రావాలని జగన్ కు సవాల్ విసిరారు. ఆధారాలతో సహా ఆ అక్రమాలను జగన్ నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. అయితే, లోకేశ్ ఛాలెంజ్ పై జగన్ స్పందించలేదు.

ఈ క్రమంలోనే లోకేశ్ తో తాను చర్చకు సిద్ధమని మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని వ్యాఖ్యానించారు. జగన్ చర్చకు రావాలంటే సీఎం చంద్రబాబు కూడా చర్చలో పాల్గొనాలని ఆయన అన్నారు. ఒకవేళ లోకేశ్ చేవ ఉంటే, చేతనైతే, దమ్ముంటే తనతో చర్చకు రావాలని పేర్ని నాని సవాల్ చేశారు. పవిత్రమైన టీచర్ పోస్టుల విషయంలో తప్పులు, పాపాలు చేసి ఈ రోజు నీతి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. తన అనుయాయులకు లోకేశ్ ఉద్యోగాలిప్పించారని నాని ఆరోపించారు.

అయితే, జగన్ కు లోకేశ్ సవాల్ చేస్తే పేర్ని నాని స్పందించడం ఏమిటని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. నిజంగా డీఎస్సీలో అక్రమాలు జరిగి ఉంటే జగన్ ఆ ఛాలెంజ్ ను స్వీకరించవచ్చు కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు ఊరటనిస్తూ రికార్డు స్థాయిలో డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలిచ్చిన ఘనత లోకేశ్ దని, అది చూసి ఓర్వలేక ఈ రకంగా ఆయనపై బురదజల్లుతున్నారని అభిప్రాయపడుతున్నారు.