పార్లమెంటు సీట్ల పెంపు.. కాంగ్రెస్‌కు ఇచ్చిపడేసిన లోకేష్!
పార్లమెంటు నియోజకవర్గాల పెంపు(డీలిమిటేషన్) అంశంపై.. సీఎం చంద్రబాబును కార్నర్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు.
By: Garuda Media | 18 Jun 2026 10:00 PM ISTపార్లమెంటు నియోజకవర్గాల పెంపు(డీలిమిటేషన్) అంశంపై.. సీఎం చంద్రబాబును కార్నర్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. గతాన్ని గుర్తు చేస్తూ.. కాంగ్రెస్‌కు పెను సవాల్ రువ్వారు. ''గతంలో మీ పార్టీ సీనియర్ నేత.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. కాంగ్రెస్ వైఖరిని పేర్కొన్నారు. పార్లమెంటు నియోజకవర్గాలను 543 నుంచి 1000 కి పెంచాలన్నారు. కానీ, ఇప్పుడు మీరు ఆ విధానం మార్చుకున్నారా?'' అని ప్రశ్నించారు.
అంతేకాదు.. ''ప్రణబ్ వాదన తప్పా.. రాజకీయ అవసరాల కోసం.. కాంగ్రెస్ విధానం మార్చుకుందా?'' అని లోకేష్ నిలదీశారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా.. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే.. కొన్ని రోజుల కిందట.. చంద్రబాబు ఢిల్లీలో పర్యటించినప్పుడు.. మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సమయంలో ఆయన ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదించింది. డీలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నామన్నారు. జనాభాతో సంబంధం లేకుండా.. 50 శాతం సీట్లు పెరిగితే అందరికీ మంచిదేనని తెలిపారు.
అయితే..చంద్రబాబు వ్యాఖ్యలను చాలా రోజుల తర్వాత.. శశిథరూర్ తప్పుబట్టారు. దీనిపై ఆయన సెటైర్లు వేశారు. ''ఇదెలా సాధ్యం ముఖ్యమంత్రి గారూ..?'' అని ప్రశ్నించారు. ''మీ జీతం, మీ కారు డ్రైవరు జీతం 50 శాతం పెంచితే.. సరిపోతుందా?'' అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై నారా లోకేష్ స్పందించారు. జీతాలతో పోలిక ఎందుకు.. అని ప్రశ్నించారు. జీతాలకు.. పార్లమెంటు స్థానాల పెంపునకు సంబంధం లేదన్నారు. పార్లమెంటు స్థానాలను 50 శాతం మేరకు పెంచేందుకు.. కేంద్రం రెడీ అయిందని.. ఇది అందరికీ ఆమోదయోగ్యమైన విధానమని పేర్కొన్నారు.
నియోజకవర్గాల పెంపుతో ఉత్తరాది-దక్షిణాది రాష్ట్రాల మధ్య వివక్షచూపుతున్నారన్న వాదనలోనూ వాస్తవం లేదన్నారు. అన్నింటినీ రాజకీయం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ''నియోజకవర్గాలను 50 శాతం పెంచడంతో .. ఎవరికీ ఎలాంటి అదనపు ప్రయోజనాలు ఉండవు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా కూడా ఉండదు. 50 శాతం పెంచితే దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదని.. ఈ విషయంలో తాము స్పష్టతతో ఉన్నామని'' తెలిపారు. రాజకీయంగా కాంగ్రెస్ తన వైఖరిని మార్చుకుంటే చెప్పాలన్నారు. రాజకీయ ప్రయోజనాలు వేరు ప్రజల, రాష్ట్రాల ప్రయోజనాలు వేరని వ్యాఖ్యానించారు.
