Begin typing your search above and press return to search.

ఒకే రోజు మంత్రుల‌కు బాబు-లోకేష్ క్లాస్ ఇచ్చేశారు.. !

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలో ఉన్న టీడీపీకి చెందిన‌ మంత్రులకు ఒకే రోజు సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు క్లాస్ ఇవ్వ‌డం.. పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

By:  Garuda Media   |   9 Jan 2026 7:00 PM IST
ఒకే రోజు మంత్రుల‌కు బాబు-లోకేష్ క్లాస్ ఇచ్చేశారు.. !
X

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వంలో ఉన్న టీడీపీకి చెందిన‌ మంత్రులకు ఒకే రోజు సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు క్లాస్ ఇవ్వ‌డం.. పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రుల విష‌యంలో చంద్ర‌బాబే స్పందిస్తున్నారు. కానీ.. తొలిసారి మంత్రి నారా లోకేష్ కూడా.. మంత్రుల‌ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. మంత్రులతో మంత్రి నారా లోకేష్ అల్పాహార విందు భేటీ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో వారికి కీల‌క సూచ‌న‌లు చేశారు.

ఇదేస‌మ‌యంలో కొంద‌రు మంత్రుల‌ను ఉద్దేశించి ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు. ''వైసీపీ మాదిరిగా 'రప్పా రప్పా' మన విధానం కాదు.. దౌర్జన్యాలు, బెదిరించడం తెలుగుదేశం సంస్కృతి కాదు. ప్రజల తీర్పును గౌరవిస్తూ ఎంత సేవ చేశామన్నదే మన అజెండా కావాలి.. అభివృద్ధి-సంక్షేమం సమన్వయంతో ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలి.'' అని లోకేష్ సూచించారు. అదేస‌మ‌యంలో వైసీపీ కుట్రలను పార్లమెంటు వారీగా నేతలు సమర్థంగా తిప్పికొట్టాలని చెప్పారు. నేతలు ఏకతాటిపైకి వచ్చి వైసీపీ అసత్య ప్రచారాలకు దీటుగా బదులివ్వాలన్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న క్షేత్ర‌స్థాయిలో ఐక్య‌త లేద‌న్న విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. అదేవిధంగా ప్రజావేదికలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి మంత్రులు బాధ్యత తీసుకోవ‌డం లేద‌ని చెప్పారు. మొక్కు బ‌డిగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నార‌ని చెప్పారు. కానీ, తమ శాఖలకు సంబంధించిన అర్జీల పరిష్కారానికి మంత్రులు చొరవ చూపాలని సూచించారు. పార్టీ బలోపేతానికి క్యాడర్‍ను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇన్‌ఛార్జి మంత్రులు పనిచేయాలని మంత్రి నారా లోకేష్ తేల్చి చెప్పారు.

ఇక‌, ఇదేస‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబు కూడా మంత్రుల తీరుపై వ్యాఖ్యానించారు. మంత్రి వ‌ర్గ స‌మావే శంలో ఆయ‌న స్పందిస్తూ.. కొంద‌రు మంత్రులు ఇంకా మార‌డం లేద‌ని.. వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాలే చూసుకుంటున్నార‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా పార్టీ ప‌ద‌వుల భ‌ర్తీ కోసం గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కష్టపడ్డ వాళ్ల పేర్లు ఇవ్వాలని తానే స్వ‌యంగా అడిగినా ఇంత వరకు ఎవరూ స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు స్థాయిలో కమిటీలు కూడా తానే పూర్తి చేశానని, దీని బట్టి పార్లమెంటులో అధ్యక్షులు, ఆ జిల్లా మంత్రులు పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.