అరుపులు కేకలు.. రూ.4 లక్షల లంచంతో దొరికిన పోలీస్ తీరిది!
కర్ణాటక రాజధాని బెంగళూరులో అవినీతి తిమింగలాల వేట కొనసాగుతోంది. సామాన్యుల రక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థలోనే కొందరు అధికారులు కాసుల కక్కుర్తికి పాల్పడుతూ లోకాయుక్తకు చిక్కుతున్నారు.
By: A.N.Kumar | 31 Jan 2026 11:31 AM ISTకర్ణాటక రాజధాని బెంగళూరులో అవినీతి తిమింగలాల వేట కొనసాగుతోంది. సామాన్యుల రక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసు వ్యవస్థలోనే కొందరు అధికారులు కాసుల కక్కుర్తికి పాల్పడుతూ లోకాయుక్తకు చిక్కుతున్నారు. తాజాగా ఓ సెటిల్మెంట్ వ్యవహారంలో భారీగా లంచం డిమాండ్ చేసిన ఇన్‌స్పెక్టర్ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఉదంతం నగరంలో సంచలనం సృష్టిస్తోంది. దొరికిన సమయంలో అతడు చేసిన అరుపులు, కేకలు హల్ చల్ వీడియో ఇప్పుడు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
ఖాకీ చొక్కా మాటున అవినీతికి పాల్పడుతున్న మరో అధికారి లోకాయుక్త వలలో చిక్కారు. కేసు నుంచి పేరు తొలగించేందుకు ఓ బిల్డర్ వద్ద నుంచి రూ. 4 లక్షల లంచం తీసుకుంటున్న కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ గోవిందరాజును అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అసలేం జరిగింది?
లోకాయుక్త అధికారుల కథనం ప్రకారం.. మొహమ్మద్ అక్బర్ అనే బిల్డర్‌పై గతంలో ఒక చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా చార్జ్‌షీట్ నుంచి అక్బర్ పేరును తొలగించడానికి ఇన్‌స్పెక్టర్ గోవిందరాజు బేరసారాలు మొదలుపెట్టారు. ఇందుకు ప్రతిఫలంగా రూ. 5 లక్షలు సమర్పించుకోవాలని సదరు బిల్డర్‌ను డిమాండ్ చేశారు. అవినీతి అధికారికి లొంగడం ఇష్టం లేని మొహమ్మద్ అక్బర్ వెంటనే లోకాయుక్తను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన లోకాయుక్త పోలీసులు పక్కా స్కెచ్ వేసి నిందితుడిని పట్టుకునేందుకు వల పన్నారు.
సీన్ రిపీట్.. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్‌లో ఆపరేషన్
లోకాయుక్త అధికారుల సూచన మేరకు గురువారం చామరాజ్‌పేట్‌లోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్స్‌కు లంచం డబ్బుతో బిల్డర్ వెళ్లారు. అక్కడ ఇన్‌స్పెక్టర్ గోవిందరాజు రూ. 4 లక్షల నగదు తీసుకుంటుండగా మాటు వేసిన అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. "చట్టాన్ని కాపాడాల్సిన అధికారి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడటం తీవ్రమైన నేరం. ఈ కేసులో పక్కా ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేశాం" అని లోకాయుక్త బృందం పేర్కొంది.
విచారణ వేగవంతం
అరెస్ట్ అనంతరం గోవిందరాజుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కేవలం ఇన్‌స్పెక్టర్ మాత్రమే ఉన్నారా? లేక పైస్థాయి అధికారుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. గతంలో కూడా ఇతనిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినట్లు సమాచారం ఉండటంతో అతని సర్వీస్ రికార్డులను కూడా అధికారులు తనిఖీ చేస్తున్నారు.ఈ అరెస్టుతో బెంగళూరు పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలకలం రేగింది. అవినీతి అధికారుల గుండెల్లో లోకాయుక్త చర్యలు వణుకు పుట్టిస్తున్నాయి.
