Begin typing your search above and press return to search.

లోక్ సభ సీట్ల పెంపు 668నా లేక 848నా ?

ఇక తాజా జనాభా గణాంకాలనే ప్రాతిపదికగా తీసుకుని ఎంపీల సీట్లు పెంచితే కనుక ఉత్తరాది రాష్ట్రాలకే మేలు జరుగుతుంది అని అంటున్నారు.

By:  Satya P   |   23 Feb 2026 9:14 AM IST
లోక్ సభ సీట్ల పెంపు 668నా లేక 848నా ?
X

దేశంలో లోక్ సభ సీట్లు భారీగా పెరుగుతున్నాయి. ఎన్ని అన్నదే ఇపుడు చర్చ సాగుతోంది. 2029 నాటికి పెరిగే ఎంపీ సీట్లతోనే ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. దేశంలో జన గణన కార్యక్రమం మొదలైంది. ఇది 2027 నాటికి పూర్తి చేసి ఆ మీదట పెరిగిన జనాభాను అనుగుణంగా చేసుకుని ఎంపీల సీట్లు పెంచాలన్నది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం ఆలోచన అని ప్రచారం సాగుతోంది. ఇక కొత్తగా నిర్మించిన పార్లమెంట్ అయితే మరో వందా నూటాభై ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. ఏకంగా 1200 మందికి పైగా ఎంపీలు కూర్చోనే విధంగా లోక్ సభను అలాగే ఇప్పటికి రెట్టింపు సంఖ్యలో రాజ్యసభ సభ్యులు వచ్చినా వారికి సరిపోయేలా పెద్దల సభను డిజైన్ చేశారు.

ప్రమాణం అదేనా :

ఇక దేశంలో లోక్ సభ నియోజకవర్గాల పునర్ విభజనకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది అని అంటున్నారు. పునర్ విభజన జరిగితే ఏ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు అన్న చర్చ ఉంది. అభివృద్ధి సూచీలు అలాగే ఇతర అంశాలను కూడా క్రెడిటేరియా ఇచ్చి సీట్ల పెంపు చేయాలని విపక్ష పార్టీలు కోరుతున్నాయి. ఇక జనాభానే కొలమానంగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు విపరీతంగా నష్టపోతాయని అంటున్నాయి. దక్షిణాదిన చూస్తే జనాభా నియంత్రణను పక్కాగా అమలు చేసి అక్షరాస్యతలో అభివృద్ధిలో కీలకంగా ఈ రాష్ట్రాలు మారాయి. ఇక్కడ జనాభా అయితే తక్కువగానే ఉంటుంది. ఉత్తారిదితో పోలిస్తే దక్షిణాదిన మందకొడిగానే పెరుగుదలా ఉంటుందని అంటున్నారు.

ముందుగా అప్రమత్తం :

అందుకే ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే ముందుగానే అప్రమత్తం అయ్యారు. అన్ని పార్టీల నేతలను పిలిచి మరీ రౌండ్ టేబిల్ సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రాన్ని కూడా ఈ విషయంలో తగిన సూచనలు చేస్తూ ఈ రోజు తమకు ఉన్న 39 ఎంపీ సీట్లను తగ్గకుండా చూడాలని కోరారు. ఇక దేశంలో 543 ఎంపీ సీట్లు ఉన్నపుడు 39 ఎంపీ సీట్లు అంటే 7.18 శాతంగా ఉందని, ఒకవేళ ఎంపీ సీట్లు పెంచినా ఈ శాతాన్ని అలాగే కొనసాగించాలని అన్నారు. అంటే జనాభా ప్రాతిపదికన కాకుండా శాతాలుగా తీసుకుంటే కనుక లోక్ సభ సీట్లు 848 సీట్లు పెంచితే తమిళనాడు వాటా 59 ఎంపీ సీట్లుగా అవుతుంది అన్న మాట. ఇక 1971 నాటి జనాభా ప్రాతిపదికన తీసుకుని ఎంపీల సీట్లు పెంచాలని కూడా కోరారు. మిగిలిన పార్టీలు అదే డిమాండ్ చేస్తున్నాయి. కేవలం తాజా జనాభా గణాంకాలు తీసుకుంటే కనుక కేరళకు ఒక్క సీటూ అదనంగా పెరగదు, అలాగే ఏ దక్షిణాది రాష్ట్రం కూడా మొత్తంగా పది సీట్ల కంటే పెరిగేది ఉండదని అంటున్నారు.

ఉత్తరాదికే లాభం :

ఇక తాజా జనాభా గణాంకాలనే ప్రాతిపదికగా తీసుకుని ఎంపీల సీట్లు పెంచితే కనుక ఉత్తరాది రాష్ట్రాలకే మేలు జరుగుతుంది అని అంటున్నారు. అదేలా ఉంటే యూపీలో ప్రస్తుతం ఉన్న 80 సీట్లు కాస్తా 143 సీట్లు అవుతాయని అంటున్నారు. బీహార్ వంటి రాష్ట్రాలలో సైతం భారీ పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. బీజేపీకి దక్షిణాదిన పెద్దగా బలం లేదు, దాంతో ఉత్తరాది రాష్ట్రాలలో ఎంపీ సీట్లు పెంచుకుంటే కనుక కచ్చితంగా నాలుగోసారి కూడా అధికారంలోకి రాగలదని లెక్క ఉందని చెబుతున్నారు.

ఈ నంబర్ తోనే ముందుకు :

ఇక ఎన్ని లోక్ సభ సీట్లు పెంచుతారు అన్నది కూడా చర్చగా ఉంది. 848 సీట్లు పెంచుతారా లేక 668 సీట్లుగా ఉంచుతారా అన్నది కూడా చర్చించుకుంటున్నారు. అయితే ముందుగా 668 సీట్లనే పెంచి 2029 ఎన్నికలకు వెళ్తారు అని అంటున్నారు. ఈ విధంగా చేసినా ఉత్తరాదికే ఎక్కువ ఎంపీలు వస్తాయని అంటున్నారు. ప్రస్తుతం లోక్ సభలో 543 మంది ఎంపీలు ఉన్నారు. దానిని 668 గా చేస్తే కనుక మరో 125 మంది ఎంపీలు కొత్తగా వస్తారు. ఇక మ్యాజిక్ ఫిగర్ కేంద్రంలో అధికారం చేపట్టడానికి కూడా మారుతుంది. అది కాస్తా 272 నుంచి 335 గా మారుతుంది. బీజేపీకి 2024 ఎన్నికల్లో 240 ప్లస్ ఎంపీ సీట్లు వచ్చాయి. అంటే మరో వంద సీట్లు సాధిస్తే మ్యాజిక్ ఫిగర్ ని దాటి సొంతంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్న మాట పెరిగేవి 125 సీట్లు. అందులో ఎక్కువ భాగం ఉత్తరాదిన పెరిగితే బీజేపీ సులువుగానే మ్యాజిక్ ఫిగర్ ని అందుకుంటుందని ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఎంపీ సీట్ల పునర్ విభజన అన్నది రాజకీయ రచ్చగా మారుతుందా అన్నది కూడా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.