లోక్ సభ స్పీకర్ డెసిషన్...ఏపీలో వైసీపీకి ట్రబుల్స్ !
దేశంలో అత్యున్నత చట్ట సభగా పార్లమెంట్ ని చెబుతారు. ఏ నిర్ణయం అయినా పార్లమెంట్ నుంచే రాష్ట్రాలు పరిశీలించి అనుసరిస్తాయి.
By: Satya P | 21 Jan 2026 5:00 PM ISTదేశంలో అత్యున్నత చట్ట సభగా పార్లమెంట్ ని చెబుతారు. ఏ నిర్ణయం అయినా పార్లమెంట్ నుంచే రాష్ట్రాలు పరిశీలించి అనుసరిస్తాయి. ఇదిలా ఉంటే చట్ట సభలో సభ్యులు హాజరు అన్నది ఎపుడూ అతి పెద్ద చర్చగానే ఉంటోంది. ఏడాదికి మూడు సార్లు నిర్వహించే సమావేశాలకు సభ్యులు పూర్తి స్థాయిలో హాజరు కావడం లేదన్న ఆవేదన అంతటా ఉంది. కొన్ని సార్లు కోరం కి సరిపడా సభ్యులు లేక సభలను వాయిదా వేయడాన్ని అంతా చూస్తున్నారు. మరి దీనికి పరిష్కారం ఏమిటి అన్న చర్చ కూడా లోతుగా సాగుతోంది.
లోక్ సభలో కొత్త రూల్స్ :
ఈ క్రమంలో ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కొత్త రూల్స్ ని ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా సభ్యుల అటెండెన్స్ విషయంలో ఆయన కీలక ఆదేశాలను జారీ చేశారు. లోక్ సభ సభ్యులు సభలో కూర్చున్నప్పుడే వారి నుంది అటెండెన్స్ తీసుకుంటామని ఆయన అంటున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు చెబుతూ పారదర్శకత జవాబు దారీ తనంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అన్నారు.
హౌస్ బయట హాజరు రద్దు :
అదే సమయంలో సభ బయట నుంచే హాజరు తీసుకునే విధానాన్ని రద్దు చేస్తున్నామని స్పీకర్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. సభలో సభ్యులు కూర్చున్నాక వారి సీట్ల వద్దనే కన్సోల్ పరికరాలు ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. అంటే ఎంపీలు సభలోకి వచ్చాక హాజరు నమోదు అన్నది వారి సీట్ల వద్ద ఉన్న కన్సోల్ ని ఆపరేట్ చేసే ఆటోమేటిక్ గా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు అన్న మాట. ఇక సభ ముగిసినా లేదా సభ అర్ధాంతరంగా వాయిదా పడినా హాజరు వేయడానికి లేదని కూడా స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేస్తున్నారు. దాంతో సభ్యులు అంతా తప్పనిసరిగా తమ సీట్లలో అసీనులు అయిన తరువాతనే హాజరు విధానం ఉంటుంది. సో అంతా సభలోకి వచ్చి చర్చలో పాల్గొంటారు అన్నదే ఈ రూల్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
వైసీపీకి ఇదే రూల్ :
ఇక ఏపీ అసెంబ్లీలో చూస్తే గత ఏడాదిన్నరగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ సభకు హాజరు కావడం లేదు, పైగా వారంతా సభ బయట రిజిస్టర్ లో సంతకాలు చేసి అటు నుంచి అటు వెళ్ళిపోతున్నారు అని కూటమి ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. ఈ విధయం మీద ఎథిక్స్ కమిటీ సైతం పరిశీలన చేస్తోంది అని అంటున్నారు. ఇపుడు లోక్ సభ స్పీకర్ కొత్త రూల్ ని తీసుకుని వస్తున్నారు. ఏపీ అసెంబ్లీ కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తే కనుక కచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా సభలోకి వచ్చిన మీదటనే హాజరు వేయించుకోవాల్సి ఉంటుంది లేకపోతే వారు గైర్ హాజరు అయినట్లుగానే నమోదు అవుతుంది. అరవై పని దినాల లోపు సభకు రాకపోతే వారి మీద అనర్హత వేటు కూడా పడుతుందని చెబుతున్నారు. మరి ఏపీ అసెంబ్లీలో ఈ రూల్ ని అమలు చేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. అదే కనుక జరిగితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే రిజిష్టర్ లో సంతకాలు చేసి వెళ్తున్నారో వారంతా సభలోకి రావాల్సి ఉంటుందని అంటున్నారు.
