Begin typing your search above and press return to search.

సర్ పై చర్చ...డౌట్లు తీర్చిందా ?

సర్ మీద దేశంలోని విపక్షం అంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోంది. ప్రధానంగా వారు చేస్తున్న ఆరోపణ అంతా ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తున్నారు అని. అలా చేయడం వల్లనే బీజేపీకి విజయావకాశాలు పెరుగుతున్నాయని.

By:  Satya P   |   11 Dec 2025 4:00 PM IST
సర్ పై చర్చ...డౌట్లు తీర్చిందా ?
X

సర్ మీద దేశంలోని విపక్షం అంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తోంది. ప్రధానంగా వారు చేస్తున్న ఆరోపణ అంతా ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తున్నారు అని. అలా చేయడం వల్లనే బీజేపీకి విజయావకాశాలు పెరుగుతున్నాయని. అలాగే ఈవీఎంల పనితీరు మీద పెద్ద ఎత్తున సందేహాలను పార్లమెంట్ వ్యక్తం చేసింది. ఈవీఎంల కంటే పేపర్ బ్యాలెట్ బెట్ అని కూడా ప్రతిపక్షం మూకుమ్మడిగా ఓటేసింది. అందులో వైసీపీ వంటి తటస్థ పార్టీలు కూడా ఉండడం విశేషం. అయితే సర్ మీద రెండు రోజుల పాటు ధాటీగా లోక్ సభలో చర్చ సాగింది. అయితే దీని మీద విపక్షాల సందేహాలు ఏ మేరకు తీరాయి అన్నది ఒక చర్చ అయితే ప్రభుత్వం పక్షాన ఏమి చేసింది ఏం చేయబోతోంది అన్నది మరో చర్చగా ఉంది.

తిప్పికొట్టడం ఓకే :

ఇక రాహుల్ గాంధీ వర్సెస్ అమిత్ షా మధ్య భారీగానే డైలాగ్ వార్ నడిచింది. రాహుల్ గాంధీ నకిలీ ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయని లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున జవాబు ఏమి వచ్చింది అన్నది కూడా విశ్లేషకులు మేధావులు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం ఎపుడైనా సభలో తన వాదనను సమర్ధంగా వినిపించుకునే వెసులుబాటు ఉంటుంది. అదే సమయంలో విపక్షం మీద దాడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాహుల్ కంటే తాను అనుభవంలో ఎక్కువగానే చట్ట సభలో ఉన్నాను అని అమిత్ షా చెప్పారు. సర్ అన్నది ఎన్నికల సంస్కరణలో భాగంగానే అని ఆయన చెప్పారు. అయితే నకిలీ ఓట్ల విషయం అయితే చెప్పలేదని ఇండియా కూటమి అంటోంది తాము ఎంతసేపూ అడుగుతున్న దానికి ప్రభుత్వం వైపు నుంచి బదులు రాలేదని అంటోంది.

ఈవీఎంల విషయంలోనూ :

ఇక ఈవీఎంల పనితీరు మీద సందేహాలు ఉన్నాయని విపక్షాలు అంటే అది కాంగ్రెస్ హయాంలోనే ప్రవేశపెట్టారు కదా అని అధికార పక్షం నుంచి వచ్చిన స్పందన. సరే ఎవరి టైంలో ప్రవేశపెట్టారు, ఎవరు ఎంతవరకూ తీసుకెళ్ళారు అన్నది పక్కన పెడితే ఈవీఎంల మీద డౌట్లు అన్ని పార్టీలకూ ఉన్నాయి కదా అని అంటున్నారు. ఈ రోజున ఎన్డీయే పక్షాన ఉన్న కొన్ని పార్టీలు కూడా గతంలో ఈవీఎంల తీరు మీద అనుమానం వ్యక్తం చేసిన సంగతిని కూడా గుర్తు చేస్తున్నారు. ఎపుడు ప్రవేశపెట్టినా టెక్నాలజీ అన్నది రోజు రోజుకీ విస్తరిస్తున్న వేళ మరింతగా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలి కదా అన్న సూచనలు వస్తున్నాయి. అంతే కాదు ఎన్నికల్లో గెలుపు ఓటమి ముఖ్యం కాదు ఓడినా సమాధానం చెప్పుకునే విధంగా ఉండాలని అంటున్నారు. మొత్తం మీద చూస్తే సర్ విషయంలో కానీ ఈవీఎంల పనితీరు విషయంలో కానీ విపక్షాల నుంచి ఎదురైన ప్రశ్నలకు ప్రభుత్వం ధీటుగా సమాధానం అయితే ఇచ్చింది కానీ ఆ సందేహాల నివృత్తికి ఏమి చేస్తుంది అన్నదే ఆసక్తిగా ఉంది. అంతా కోరుతున్నట్లుగా పేపర్ బ్యాలెట్ కి మళ్ళీ వెళ్తామని ప్రభుత్వం చెబుతుందా అన్నది ఒక ప్రశ్న. అలాగే సర్ విషయంలో మరింత పారదర్శకంగా ముందుకు సాగేలా ఎన్నికల సంస్కరణలకు సిద్ధమవుతామని చెబుతారా అన్నది కూడా మరో పాయింట్ గా ఉంది చూడాలి మరి ఏమి చేస్తుందో.