Begin typing your search above and press return to search.

ఐసీయూలో బీజేపీ కురు వృద్ధుడు ఎల్ కే అద్వానీ !

ఇదిలా ఉంటే ఎల్ కే అద్వానీని ఆయన నివాసంలో కొద్ది రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్స్సులు తీసుకున్నారు.

By:  Satya P   |   17 Oct 2026 12:59 PM IST
ఐసీయూలో బీజేపీ కురు వృద్ధుడు ఎల్ కే అద్వానీ !
X

భారతీయ జనతా పార్టీ స్థాపన వెనక ఉన్న నాయకుడు, వరిష్ట నేత, రాజకీయాల్లో కురు వృద్ధుడు మాజీ ఉప ప్రధాని లాల్ క్రిష్ణ అద్వానీ (98) అనారోగ్యంతో ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం చేరారు. ఆయనకు ఐసీయూలో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఛాతిలో ఇన్ఫెక్షన్ తలెత్తడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. నూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినీత్ సూరి నేతృత్వంలోని వైద్యుల బృందం అద్వానీకి చికిత్స అందిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని తాజా హెల్త్ బులెటిన్ లో ఆసుపత్రి వర్గాలు స్పష్టం చేశాయి ఇక వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు.

కేంద్ర మంత్రి జెడ్డా పరామర్శ :

ఇదిలా ఉంటే ఎల్ కే అద్వానీ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు అన్న వార్త తెలియగానే కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆసుపత్రికి వచి అద్వానీని పరామర్శించారు. అద్వానీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అద్వానీ వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారని కేంద్ర మంత్రికి ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

అద్వానీని కలిసిన మోడీ :

ఇదిలా ఉంటే ఎల్ కే అద్వానీని ఆయన నివాసంలో కొద్ది రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ ఆశీస్స్సులు తీసుకున్నారు. ప్రభుత్వ పదవులలో ముఖ్యమంత్రిగా 13 ఏళ్ళు, ప్రధానిగా పన్నెండేళ్ళ పాటు నిరాటంకంగా కొనసాగుతూ పాతికేళ్ళ అధికార ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా మోడీ అద్వానీని కలసి ఆయనతో ఆ అనుభవాన్ని పంచుకున్నారు. అదే విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్టుగా పెట్టారు. దశాబ్దాల పాటు దేశానికి సేవ అందించి ప్రజా సేవలో తరించిన అద్వానీ ప్రభావం చరిత్రలో ఎన్నదగినది అని కొనియాడారు. దేశ ప్రగతిని ముందుకు తీసుకుని వెళ్ళడంలో అద్వానీ పాత్ర ఎంతో కీలకం అని మోడీ గుర్తు చేశారు. అద్వానీది సుదీర్ఘమైన రాజకీయ జీవితంగా పేర్కొన్న మోడీ ఆయన భారత్ ని బలమైన దేశంగా రూపొందించడంలో ప్రధానమైన పాత్రను పోషించారు అని గుర్తు చేశారు.

అద్వానీ ఒక శకం :

ఇదిలా ఉంటే ఎల్ కే అద్వానీ ఒక శకం. ఆయన ముందూ తరువాత అన్నట్లుగా దేశ రాజకీయం విభజించబడింది. ఆయన బీజేపీని తన ప్రియ స్నేహితుడు, సహచరుడు వాజ్ పేయ్ తో కలిసి స్థాపించారు. అద్వానీ జనతా పార్టీ ప్రభుత్వంలో తొలిసారి సమాచార శాఖ మంత్రిగా 1977లో బాధ్యతలు నిర్వహించారు. ఆయన దేశానికి హోం మంత్రిగా ఆరేళ్ళ పాటు పనిచేశారు. ఉప ప్రధానిగా కూడా సేవలు అందించారు. అద్వానీ మొత్తం రాజకీయ జీవితంలో ఏడు సార్లు లోక్ సభ సభ్యుడిగా నెగ్గితే మరో నాలుగు సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ఇదిలా ఉంటే అద్వానీ తొందరగా కోలుకుని పూర్తి స్వస్థతతో తిరిగి తన నిండు జీవితాన్ని కొనసాగించాలని అంతా కోరుకుంటున్నారు. నవంబర్ 8తో అద్వానీ 99 ఏళ్ళు పూర్తి చేసుకుని వందేళ్ళ మార్క్ కి చేరుకుంటారు. దాంతో అద్వానీ మరింత ఉత్సాహంగా ఉండాలని అంతా ఆకాంక్షిస్తున్నారు.