Begin typing your search above and press return to search.

ఆధునిక రాజకీయ శకం...వందేళ్ళ అద్వానీకి వందనం

బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ నవంబర్ 8న 99 ఏళ్లు పూర్తి చేసుకుని వందో ఏడాదిలోకి అడుగుపెడుతున్నారు. 1927లో కరాచీలో జన్మించిన ఆయన జనసంఘ్ నుంచి బీజేపీ ఎదుగుదల వరకు కీలక పాత్ర పోషించారు. 1990లో చేపట్టిన సోమనాథ్‌–అయోధ్య రథయాత్ర రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచింది. ఉప ప్రధానిగా, హోంమంత్రిగా సేవలందించిన అద్వానీకి 2024లో భారతరత్న లభించింది.

By:  Satya P   |   7 Nov 2026 7:33 PM IST
ఆధునిక రాజకీయ శకం...వందేళ్ళ అద్వానీకి వందనం
X

లాల్‌కృష్ణ అద్వానీ నవంబర్ 8వ తేదీతో 99 ఏళ్ళు పూర్తి అయి వందో పడిలోకి అడుగుపెడుతున్నారు. 1927 నవంబరు 8న దీపావళి రోజు పుట్టారు. అవిభక్త భారతదేశంలో కరాచీలో పుట్టిన అద్వానీ దేశ విభజన నాటికి 20 ఏళ్ల నవ యువకుడు. ఆయన కుటుంబం ఆ తరువాత గుజరాత్ రాష్ట్రానికి వచ్చి అక్కడే నివసించింది. అద్వానీ జీవితం మొత్తం ఆధునిక భారత చరిత్రలోని అనేక కీలక ఘట్టాలతో పెనవేసుకుని సుదీర్ఘమైనదిగా ఉంది. అద్వానీ జీవితంలో ఎన్నో కఠిన పరీక్షలు ఎదుర్కొన్నారు. 1947లో యవ్వన ప్రాయంలోనే సింధు ప్రాంతంలోని తన జన్మ స్థలాన్ని అక్కడి ప్రపంచాన్ని వీడి రావాల్సిన దుస్థితి తో పాటు ఎంతో ఆవేదనను ఆయన అనుభవించారు. అలా శూన్యం నుంచి తన జీవితాన్ని తిరిగి మొదలుపెట్టారు. అద్వానీ ఢిల్లీ చేరి జనసంఘ్‌ బలోపేతం చేసే కృషిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఆయన 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఛైర్మన్ అయ్యారు. ఇక అద్వానీ పార్లమెంటరీ ప్రస్థానం 1970లో ప్రారంభమైంది.

పార్లమెంట్ లో కీలకం :

ఇక అద్వానీ ఒక ఎంపీగా ఆ తర్వాత ఉభయ సభలలో ప్రతిపక్ష నేతగానే కాకుండా అధికార పక్షంలో ఉన్నపుడు కూడా తనదైన ముద్ర వేశారు. జనతా పార్టీ 1977లో ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు అద్వానీ సమాచార ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ శాఖలో ఆయన పనితీరు పట్ల అంతా ప్రశంసించారు. ఇలా పార్లమెంటరీ బాధ్యతల్లో తలమునకలై నప్పటికీ దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యే వారు. లోక్ సభ విషయానికి వస్తే గాంధీనగర్ ప్రజలు ఆయనను పలుమార్లు తమ ప్రతినిధిగా పార్లమెంటుకు పంపారు. అద్వానీ జీవితంలో ఎమర్జెన్సీ ఓ కీలక మలుపు. ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగ రక్షణ పోరాటాన్ని ఆయన ముందుండి నడిపించారు. నాటి అనుభవాలను ఎ ప్రిజనర్స్ స్క్రాప్-బుక్ పేరిట రాసిన పుస్తకంలో ఆయన అందరితోనూ పంచుకున్నారు.

ప్రతిపక్ష నేతగా :

అదే విధంగా పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారు. ఒక విధంగా చెప్పాలీ అంటే అత్యధిక కాలం ఆయన ఆ పదవిలోనే ఉన్నారు. అధికారంలో ఉన్నది అయితే తక్కువ. ఇక పోరాటాలు బీజేపీ విస్తరణ కోసం నిరంతరం జనంలో ఉండడమే అద్వానీని జనం నేతగా చేసింది. ఆయన బీజేపీని పటిష్టమైన సంస్థగా సంస్థాగతంగా పటిష్టం చేశారు. అటుపైన ఉప ప్రధానమంత్రిగా దేశంలో అత్యధిక కాలం హోంశాఖ బాధ్యతలు నిర్వర్తించిన నేతగా రికార్డు సృష్టించారు. దేశ భద్రత వ్యవస్థ బలోపేతంలోనూ కీలక పాత్ర పోషించారు. ఉగ్రవాదంపై ఆయన తీసుకున్న నిర్ద్వంద్వ వైఖరి వల్లనే భారత్‌ అత్యంత పటిష్ట ఉగ్రవాద నిరోధక చట్టం చేయగలిగింది అన్నది చరిత్రలో ఉంది

రధ యాత్రికుడిగా :

ఇక అద్వానీ 1989లో పార్టీ అధ్యక్షుడిగా బీజేపీకి సారథ్యం వహించినపుడు లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ బలం 400 స్థానాల నుంచి 200 కన్నా తక్కువకు చేయడంలో ఆయన నిర్వహించిన పాత్ర అద్వితీయం అని చెప్పాలి. ఆ తర్వాత 1996లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. దీనికి ముందు అద్వానీ 1990లో దేశవ్యాప్తంగా రధయాత్ర చేపట్టి బీజేపీకి అధికారానికి చేరువ చేశారు. అద్వానీ జీవితంలో సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ రథయాత్ర నిస్సందేహంగా ఒక చారిత్రక ఘట్టం. భారత సమాజ గమనాన్ని మాత్రమే కాదు రాజకీయాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. రధయాత్రని దేశవ్యాప్తంగా నిరంతరంగా చేయడం అద్వానీకే దక్కింది. ఈ దేశంలో రామ మందిర నిర్మాణం పూర్తిచేస్తామని అద్వానీ రధయాత్ర ద్వారా దేశ ప్రజల ఎదుట ప్రమాణం చేశారు. ఎట్టకేలకు అనేక ఏళ్ల తర్వాత అది సాకారం అయింది.

రాజనీతిజ్ఞుడిగా :

ఇక ఒక నాయకుడిగా అద్వానీ విశిష్టతను తెలిపే రెండు ప్రత్యేక లక్షణాలను గుర్తుచేసుకుంటే మొదటిది ఆయనకు గల సైద్ధాంతిక స్పష్టత ఉంటుంది. అలాగే మేధాపరమైన పదును ఇది ఆయన రచనలలో ప్రసంగాల్లో స్పష్టంగా కనిపిస్తూంటుంది. ఆయన ఇంటర్వ్యూలు ఎంతో లోతుగా సూటిగా ఉండేవి. రెండవదిగా చూస్తే దేశ రాజకీయాల్లో దీర్ఘకాలం కొనసాగిన మిథ్యా లౌకిక వాదాన్ని ఎండగట్టడంలో అద్వానీ చాతుర్యం గురించి అంతా చెబుతారు. అద్వానీ అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి పనిచేయడం ఒక చరిత్ర. ఇద్దరూ రాజకీయ దిగ్గజాలే అయినా దశాబ్దాల పాటు పరస్పర పోటీదారులుగా మారకపోవడం స్ఫూర్తిదాయకంగా చెప్పుకోవాలి.

నిరాడంబరుడిగా :

ఇక అద్వానీ అంటే ఎన్నో ఆయన నిరాడంబరత్వం అందరికీ గుర్తుకు వస్తుంది. అద్వానీ ఒక పుస్తకాల పురుగుగా కూడా చెప్పాలి. ఆయనతో సమయం గడిపేవారికి వార్తాపత్రికలను ఎంత జాగ్రత్తగా చదువుతారో బాగా తెలుసు. సినిమా, నాటకాలకు అభిమానిగానే కాకుండా సినీ విమర్శకుడిగానూ ఆయన ప్రసిద్ధులు. ‘మై కంట్రీ-మై లైఫ్’ పేరిట ఆయన రాసిన పుస్తకంలో ఇవన్నీ ఉంటాయి. దేశానికి ఆయన సేవలకు గానూ 2024లో ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించారు. ఇదిలా ఉంటే అనేక కీలక ఘట్టాలతో మిళితమై అద్వానీ జన్మదినం ఈసారి వస్తోంది. ఇదే సందర్భంలో జనసంఘ్ ఆవిర్భావానికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. అలాగే జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఇదే ఏడాది వచ్చింది. ఇక ఇటీవలే ఆర్‌ఎస్‌ఎస్‌ శత వసంతోత్సవాలు జరిగాయి. ఇలా బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి అతి ముఖ్యమైన వేడుకల మధ్యలో అద్వానీ వందేళ్ల పండుగ కూడా రావడంతో కాషాయ పార్టీ ఎంతో ఉత్సాహాంగా జరుపుకుంటోంది.