Begin typing your search above and press return to search.

బంగారం రూపంలో లిక్కర్ సొమ్ములు.. అనిల్ చోఖ్రా అంతా చెప్పేస్తున్నాడా?

లిక్కర్ కేసులో రోజుకొక సంచలనంపై లీకులు వస్తున్నాయి. తాజాగా ముంబై వ్యాపారి అనిల్ చోఖ్రాను కస్టడీలో సిట్ అధికారులు విచారిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   2 Dec 2025 3:50 PM IST
బంగారం రూపంలో లిక్కర్ సొమ్ములు.. అనిల్ చోఖ్రా అంతా చెప్పేస్తున్నాడా?
X

లిక్కర్ కేసులో రోజుకొక సంచలనంపై లీకులు వస్తున్నాయి. తాజాగా ముంబై వ్యాపారి అనిల్ చోఖ్రాను కస్టడీలో సిట్ అధికారులు విచారిస్తున్నారు. మద్యం ముడుపులను విదేశాలకు తరలించడంతోపాటు బ్లాక్ మనీని వైట్ గా మార్చడంలో అనిల్ చోఖ్రా కీలక పాత్ర పోషించినట్లు సిట్ చెబుతోంది. ఈ ఆరోపణలపై అనిల్ చోఖ్రాను విచారిస్తుండగా, ఆయన కీలక విషయాలను బయటపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా షెల్ కంపెనీలను ఏర్పాటు చేయడంతోపాటు వాటి ద్వారా లిక్కర్ డబ్బులను బంగారంగా మార్చినట్లు అనిల్ చోఖ్రా సమాచారమిచ్చాడని కథనాలు వినిపిస్తున్నాయి.

లిక్కర్ స్కాం కేసులో ఏ49 అనిల్ చోఖ్రా. ముంబైకి చెందిన అనిల్ చోఖ్రా సూట్ కేసు కంపెనీలు స్థాపించి, నల్లడబ్బును వైట్ మనీగా మార్చడంలో సిద్ధహస్తుడని సిట్ చెబుతోంది. దీంతో ఏపీ లిక్కర్ స్కాంలో నిందితులు మద్యం డిస్టలరీల నుంచి కమీషన్ గా వచ్చిన కోట్లాది రూపాయల డబ్బును అనిల్ చోఖ్రా ద్వారా వైట్ మనీగా మార్చుకున్నట్లు సిట్ అభియోగాలు నమోదు చేసింది. గతంలోనే అనిల్ చోఖ్రాను అరెస్టు చేయగా, తాజాగా కస్టడీలోకి తీసుకుంది. అనిల్ చోఖ్రాపై గతంలోనే మనీలాండరింగ్ కేసులు ఉన్నాయి. దీంతో ఆయన పాత్రపై సిట్ కీలక ఆధారాలను సేకరించినట్లు చెబుతున్నారు.

ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి బినామీ డిస్టలరీలు అయిన ఆదాన్, లీలా, ఎస్పీవై ఆగ్రోస్ కు ఏపీఎస్బీసీఎల్ నుంచి వచ్చిన రూ.78 కోట్లను షెల్ కంపెనీల్లోకి మళ్లించినట్లు నిందితుడు అనిల్ చోఖ్రా సిట్ పోలీసులకు చెప్పాడని అంటున్నారు. షెల్ కంపెనీల ద్వారా తాను ఎవరెవరి డబ్బును ఎలా వైట్ గా మార్చిందో సిట్ విచారణలో అనిల్ చోఖ్రా బయటపెట్టేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఊరుపేరు లేని వ్యక్తుల ఆధార్ కార్డులను సేకరించి ముంబై కేంద్రంగా ముప్ఫయికి పైగా షెల్ కంపెనీలు సృష్టించినట్లు సిట్ అధికారులకు చెప్పాడని అంటున్నారు. ఈ షెల్ కంపెనీలలోకి డబ్బును మళ్లించి కొంత మొత్తం నగదుగా, మరికొంత మొత్తం బంగారంగా వెనక్కి తీసుకున్నట్లు అనిల్ చోఖ్రా చెప్పాడని ప్రచారం జరుగుతోంది.

షెల్ కంపెనీలోకి వచ్చిన డబ్బును ముందుగా చాముండ బులియన్స్ యజమాని చేతన్ కుమార్ ద్వారా గోల్డ్ డీల్ కుదరిచ్చినట్లు అనిల్ చోఖ్రా చెబుతున్నాడట. మరికొంత డబ్బును సిండికేట్ గోల్డ్ డీలర్స్ ద్వారా బంగారంగా మార్చానని చెప్పాడని అంటున్నారు. అంతేకాకుండా దుబాయ్ లో ఉన్న చేతన్ కుమార్ తండ్రి ద్వారా మొత్తం నల్లడబ్బును వైట్ గా మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఏ49 అనిల్ చోఖ్రా వాంగ్మూలంపై నిందితుల్లో టెన్షన్ కనిపిస్తోందని అంటున్నారు. నిందితుడు గతంలో మనీలాండరింగ్ కేసుల్లో అరెస్టు కావడం, ఈ కేసులోనూ సిట్ మనీలాండరింగ్ అంశాలను ఎత్తిచూపడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి