మందుబాబులకు భారీ షాక్.. తాగాలంటే భయపడాల్సిందే!
మందుబాబులకు షాకింగ్ న్యూస్! త్వరలో మీ ఫేవరెట్ బ్రాండ్ల ధరలు చుక్కలు చూపించబోతున్నాయి. మద్యం తయారీ కంటే ప్యాకేజింగ్ ఖర్చులు తడిసి మోపెడవ్వడమే దీనికి ప్రధాన కారణం.
By: Madhu Reddy | 3 April 2026 12:07 PM ISTమందుబాబులకు షాకింగ్ న్యూస్! త్వరలో మీ ఫేవరెట్ బ్రాండ్ల ధరలు చుక్కలు చూపించబోతున్నాయి. మద్యం తయారీ కంటే ప్యాకేజింగ్ ఖర్చులు తడిసి మోపెడవ్వడమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా బీర్ బాటిళ్లు, విస్కీ సీసాల తయారీకి వాడే గ్యాస్ ధరలు పెరగడంతో కంపెనీలు బెంబేలెత్తిపోతున్నాయి. ఎండలు ముదురుతున్న వేళ బీర్ల కొరత ఏర్పడే ఛాన్స్ కూడా ఉంది. అసలు ఈ ధరల పెరుగుదల వెనుక ఉన్న కారణాలు చూద్దాం..
ప్యాకేజింగ్ సెగ.. గ్యాస్ కొరత సెగ:
మద్యం తయారీలో ముడిసరుకు కంటే ఇప్పుడు ప్యాకేజింగ్ ఖర్చే కంపెనీలకు పెద్ద భారంగా మారింది. విస్కీ, బ్రాందీ లాంటి స్పిరిట్స్ ప్యాకేజింగ్ ఖర్చు 20% ఉంటే, బీర్ల విషయంలో ఇది ఏకంగా 40% వరకు ఉంటోంది. ఈ బాటిళ్లను తయారు చేసే గ్లాస్ ఫర్నెస్‌లు (కొలిమి) నిరంతరం మండాలంటే సహజ వాయువు (గ్యాస్) తప్పనిసరి. మన దేశం తన గ్యాస్ అవసరాల కోసం 40% వరకు ఖతార్‌పైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల గ్యాస్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడి, అది నేరుగా గాజు బాటిళ్ల ఉత్పత్తిపై దెబ్బకొడుతోంది. ఫలితంగా బాటిళ్ల తయారీ ఖర్చు భారీగా పెరిగిపోయింది.
పెరగనున్న ధరలు.. కంపెనీల డిమాండ్:
ఇండియన్ మాల్ట్ విస్కీ అసోసియేషన్ అంచనా ప్రకారం, కేవలం గ్యాస్ ధరల పెరుగుదల వల్లే గాజు బాటిళ్ల ధర 15-20% పెరిగింది. దీనికి తోడు అంతర్జాతీయంగా షిప్పింగ్ ఛార్జీలు కూడా భారంగా మారాయి. దీంతో లాభాలు తగ్గకుండా చూసుకోవడానికి మద్యం కంపెనీలు ఒక్కో బ్రాండ్ మీద 10-15% ధరల పెంపును కోరుతున్నాయి. ఇక ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్ మద్యం ధరల్లో ఈ మార్పు తక్షణమే కనిపించే అవకాశం ఉంది. అంటే, ఇకపై మీరు కొనే ప్రతి బాటిల్ లేదా పెగ్గు మీద అదనపు భారం పడటం ఖాయమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో బీర్ల కొరత ముప్పు:
సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య వేసవి తాపానికి బీర్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే ఈసారి గ్యాస్ లభ్యత తగ్గితే గాజు ఫర్నెస్‌లు పూర్తి సామర్థ్యంతో పని చేయలేవు. దీనివల్ల మార్కెట్‌లో బాటిళ్ల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం పరిశ్రమలో ఏడాదికి సుమారు 12 నుంచి 13 కోట్ల బాటిళ్ల కొరత ఇప్పటికే ఉంది. అదనంగా అల్యూమినియం ధరలు కూడా 15% పెరగడంతో బీర్ క్యాన్ల ధరలు కూడా పెరగవచ్చు. ఇక డిమాండ్ ఎక్కువగా ఉన్న పీక్ సీజన్‌లో సరఫరా తగ్గితే వినియోగదారులు తమకు నచ్చిన బ్రాండ్లు దొరక్క ఇబ్బంది పడక తప్పదు.
ఈ గండం నుంచి గట్టెక్కేందుకు కొన్ని కంపెనీలు ముందస్తుగా ప్లాన్ చేస్తున్నాయి. ఉదాహరణకు 'రాడికో ఖైతాన్' వంటి కంపెనీలకు సొంత పవర్ ప్లాంట్లు ఉండటం వల్ల ఇంధన ధరల అస్థిరత నుంచి కొంత ఊరట లభిస్తోంది. అలాగే 'అలైడ్ బ్లెండర్స్' తమ వద్ద ఒకటిన్నర నెలలకు సరిపడా బాటిళ్ల స్టాక్ ఉందని చెబుతోంది. ఇక ఏదేమైనా, అంతర్జాతీయ పరిణామాలు చక్కబడకపోతే మాత్రం సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయం. ఒకవైపు పెరుగుతున్న ఎండలు, మరోవైపు మండుతున్న మద్యం ధరలతో ఈ వేసవి మందుబాబులకు కాస్త గట్టి పరీక్షే పెట్టబోతోంది. ఏది ఏమైనా పెరుగుతున్న ధరల కారణంగా మందుబాబులు ఇప్పుడు మద్యం తాగాలంటేనే భయపడే స్టేజికి వచ్చేస్తున్నారు అనడంలో సందేహం లేదు
